అజయ్ కుమార్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాల్సిందే…

Ajay Kumar Mishra should be sacked...– రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి : మోడీ సర్కారుకు ఎస్‌కేఎం, కార్మిక సంఘాల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరిలో (అక్టోబర్‌3,2023) రైతులు చేపట్టిన శాంతియుత ర్యాలీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్‌ మిశ్రా కుమారుడు వాహనాలతో తొక్కించారని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ దుస్సంఘటనకు ఏడాది గడిచినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించాయి. అందుకు నిరసనగా మంగళవారం హైదరాబాద్‌లోని నారాయణ గూడ ఫ్లై ఓవర్‌ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ డౌన్‌, డౌన్‌, కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తేవాలి. కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టి. సాగర్‌, పశ్యపద్మ, ప్రసాదన్న, ఎన్‌ బాల మల్లేష్‌, పాలడుగు భాస్కర్‌ (సీఐటీయూ), బాలరాజు (ఏఐటీయూసీ), చంద్రశేఖర్‌ (ఐఎన్‌టీయూసీ), సూర్యం (ఐఎఫ్‌టీయూ) మాట్లాడారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరిలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్ కుమార్‌ మిశ్రా కుమారుడు అశీష్‌ మిశ్రా కార్లతో తొక్కించి నలుగురు రైతు ఉద్యమకారులను అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినా కేంద్ర మోడీ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. హత్యాకాండకు కారణమైన కేంద్రహోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అతని కుమారున్ని బీజేపీ గుండాలను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ అంశాన్ని యావత్తు దేశం ముక్తకంఠంతో నినదించినా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా లఖింపూర్‌ ఖేరి హత్యాకాండకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు.
హామీల అమలేది?
ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హమీలను అమలు చేయకుండా రైతాంగాన్ని మోసం చేస్తోందని విమర్శించారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకొవస్తామని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణ విమోచన చట్టాన్ని తెచ్చి రైతాంగాన్ని ఆత్మహత్యల నుంచి రక్షిస్తామంటూ ఉత్త మాటలు చెబుతున్నారని విమర్శించారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లులో వ్యవసాయరంగాన్ని మినహాయిస్తామంటూ నే మాట తప్పిందన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేలా కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. రైతు ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను రద్దు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. దొడ్డి దారిన వ్యవసాయచట్టాలను తిరిగి పునరుద్ధరించే కుట్ర చేస్తోందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేసే విధంగా అనేక ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని కోరారు. మోడీ ప్రభుత్వ రైతాంగ,కార్మిక వ్యతిరేక విధానా లను కార్మిక,కర్షక ఐక్యతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చ రించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర సింహారెడ్డి, జె వెంకటేష్‌, రమ, వంగూరు రాములు (సీఐ టీయూ), రెబ్బరామారావు(హెచ్‌ఎంఎస్‌), ఏఐఎఫ్‌టీయూ (న్యూ) మోడెం మల్లేష్‌, మూఢ్‌ శోభన్‌ (తెలంగాణ రైతు సంఘం), బుర్రి ప్రసాద్‌ (తెలంగాణ వ్యవసాయకార్మిక సం ఘం), బాలమల్లేష్‌, కాంతయ్య (వ్యవసాయకార్మిక సంఘం), శ్రీరాంనాయక్‌, ధర్మానాయక్‌ (తెలంగాణ గిరిజన సంఘం), కిషోర్‌, ప్రేమ్‌ పావని, మల్లికార్జున్‌ పాల్గొన్నారు.
మంత్రి అజయ్ కుమార్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలి – సంయుక్త కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో నిరసనలు
లక్కింపూర్‌ కేరి దుస్సంఘటనలో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో మంగళవారం దేశ వ్యాప్తంగా బ్లాక్‌ డేకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జనగామ జిల్లా పాలకుర్తి చౌరస్తాలో నిరసన తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండల కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని మంచికంటి భవన్‌ నుంచి ప్రదర్శనగా బస్టాండ్‌ సెంటర్‌కి చేరుకొని అక్కడ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్‌ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హుజూర్‌నగర్‌ పట్టణంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. భువనగిరి జిల్లాకేంద్రంలో స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోనిని సుభాష్‌ చంద్ర బోస్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మిర్యాలగూడలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి బ్లాక్‌ డే నిర్వహించారు. నకిరేకల్‌ పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Spread the love