గ్రూప్‌-1 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

నవతెలంగాణ – అమరావతి: రేపట్నుంచి (శనివారం) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 6,455 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపట్నుంచి జూన్ 10 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రదీప్కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని ప్రకటించారు. 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ప్రదీప్కుమార్ వివరించారు.

Spread the love