హామీలన్నీ నీటి మూటలే..

– 2014 నాటి వాగ్దానాలకే దిక్కు లేదు
–  ధరాఘాతంతో సామాన్యుల బెంబేలు
– జీవనోపాధి కరువై నిస్తేజమవుతున్న యువత
– పట్టణాలలో కానరాని మౌలిక వసతులు

అందరికీ సత్వర న్యాయం లభించేలా చూస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని, ధరలను అదుపు చేస్తామని, స్మార్ట్‌ సిటీలు అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అయితే ఈ తొమ్మిదేండ్ల కాలంలో.. ఇవన్నీ నీటి మీద రాతలేనని తేలిపోయింది.
బెంగళూరు/రారుపూర్‌/న్యూఢిల్లీ :
వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గతంలో మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సింహావలోకనం చేసుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను దాచిపెట్టడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతచిచ్చుతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.
పెరిగిన ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి, నిత్యావసరాల ధరలను నియంత్రిస్తమని 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ హామీ ఇచ్చింది. అయితే గత సంవత్సరం ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిది సంవత్సరా లలో ఎన్నడూ లేనంతగా 7.8%నికి చేరింది. అలాగే హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం 15.08%నికి చేరుకుంది. ఈ సంవత్సరంలో కూడా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 6% కంటే కొంచెం అధికంగానే ఉంది. ద్రవ్యోల్బణ పెరుగుదల ప్రభావం ప్రజల పొదుపుపై పడింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో ప్రజల పొదుపు 30 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రజలు తాము దాచుకున్న సొమ్ములో నుండి కొంత మొత్తాన్ని తీసి వాటిని కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో విలాస వస్తువులకు డిమాండ్‌ పెరగడం గమనార్హం. మోడీ హయాంలో దేశంలో అసమానతలు, పేదరికం పెరిగాయని పలు నివేదికలు కుండబద్దలు కొట్టాయి.
ఉద్యోగ కల్పనలో వెనుకబాటు
యువతకు ఉద్యోగావకాశాలను పెంచేందుకు ఉపాధి కల్పనా కేంద్రాలను కెరీర్‌ సెంటర్లుగా మారుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగాలు సృష్టిస్తామని గొప్పలు చెప్పింది. అయితే ప్రభుత్వం కేవలం ఉత్పత్తితో ముడిపడిన ఉద్యోగాల కల్పనకే ప్రాధాన్యత ఇచ్చిందని జేఎన్‌యూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అరుణ్‌ కుమార్‌ చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు జీ న్యూస్‌కు మోడీ ఇంటర్వ్యూ ఇస్తూ ‘మీ కార్యాలయం ఎదుట ఎవరైనా పకోడీ షాపు తెరిచారని అనుకోండి. అది ఉపాధి కిందికి రాదా?’ అని ప్రశ్నించారు. ‘రోజుకు రూ.200 సంపాదించే వ్యక్తి ఏ పుస్తకంలోనూ కన్పించడు. ఏ ఖాతాలోనూ చేరడు. వాస్తవమేమంటే యువత పెద్దఎత్తున ఉపాధి పొందుతోంది’ అని ఆయన చెప్పారు. ప్రధాన ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజులకే లక్నోలో నిరుద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. 2017-18లో నిరుద్యోగుల సంఖ్య 45 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరింది. ఇది ప్రభుత్వ సమాచారమే. దేశంలో నాణ్యతతో కూడిన ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయని దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తున్న ఓ కేంద్రం అధిపతి మహేష్‌ వ్యాస్‌ తెలిపారు. 2017 నుండి దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం గళం విప్పుతూనే ఉన్నారు.
స్మార్ట్‌ సిటీలో అభివృద్ధి ఏది?
స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగా 2015లో ప్రభుత్వం 100 నగరాలను ఎంపిక చేసింది. ఆయా నగరాలలో మౌలిక సదుపాయాల కల్పనే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే ఉన్న నగరాలనే అభివృద్ధి చేస్తున్నారు తప్పించి కొత్త నగరాలపై దృష్టి సారించడం లేదు. ఉదాహరణకు ఢిల్లీ, పూణే, ఉదరుపూర్‌ ఇప్పటికే నగరాలు. అయితే అవి ‘స్మార్ట్‌’ జాబితాలో లేవు. పైగా స్మార్ట్‌ సిటీలలో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయి. కొన్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయి. స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి నిర్దేశించుకున్న గడువును దఫదఫాలుగా పొడిగిస్తున్నారు. వచ్చే సంవత్సరం జూన్‌ వరకూ గడువు పెట్టుకున్నప్పటికీ కనీసం 20 నగరాలు కూడా లక్ష్యాల మేరకు అభివృద్ధి చెందే అవకాశాలు కన్పించడం లేదు. పైగా ప్రజలు కోరుకున్న రీతిలో వాటి అభివృద్ధి జరగడం లేదు. వ్యర్థాల తొలగింపు, మురికివాడలలో సౌకర్యాల కల్పన, కాలుష్య నివారణ, జీవవైవిధ్య పరిరక్షణ వంటి విషయాలలో ముందుకు అడుగులు పడడం లేదు. కాషాయ పార్టీ దృష్టిలో ‘స్మార్ట్‌’ అంటే వనరుల లభ్యత ఉన్నా లేకున్నా మతపరమైన పర్యాటకం, రియల్‌ ఎస్టేట్‌, సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటిని అభివృద్ధి చేయడం. అంతేకానీ పట్టణ పేదలకు అందుబాటు ధరల్లో గృహవసతి కల్పించడం కాదు. రాబోయే పది సంవత్సరాలలో స్మార్ట్‌ సిటీల్లో 25 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళిక హామీ ఇచ్చింది. అయితే ఆ దిశగా పెద్దగా అడుగులు పడుతున్న దాఖలాలు కన్పించడం లేదు.
కాలుష్య కోరల్లో ‘గంగ’
ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో 2014 మేలో ‘నమామి గంగ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గంగానదిని కాలుష్య కోరల నుండి బయటపడేయడం దీని ఉద్దేశం. అయితే ఇప్పటికీ నదీ జలాలు కాలుష్యంతో నిండి ఉన్నాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం కన్పిస్తోంది. నది దిగువ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నీటిలో చేరిన వ్యర్థ పదార్థాలు, బాక్టీరియా ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించాయి. మురుగు నీటిని శుద్ధి చేసే ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. సెప్టిక్‌ ట్యాంకులు, మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసే పని నుండి కార్మికులను దూరంగా ఉంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాలలో కార్మికుల చేతే ఆ పనులు చేయిస్తున్నారు. 2017-22 మధ్యకాలంలో ట్యాంకుల నుండి వెలువడే విషవాయువుల కారణంగా 330 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనిని ప్రభుత్వం ఖండిస్తోంది. ఈ సంవత్సరం మార్చి 22, ఏప్రిల్‌ 26 మధ్యకాలంలో ఒక్క గుజరాత్‌లోనే ఆరుగురు చనిపోయారు. సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేస్తూ 1993 నుండి వెయ్యి మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

Spread the love