అంబేద్కర్‌ హెచ్చరికలు నిజమవుతున్నాయి…

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 134వ జయంతిని మనదేశంలో ఆయన ఆశయాలకి, ఆలోచనలకు పూర్తి విరుద్ధమైన రాజకీయ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఆయన నాయకత్వాన రచించబడ్డ భారత రాజ్యాంగం పెను ప్రమాదంలో పడింది. రాజ్యాంగం చాటుతున్న లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థ, ఆర్థిక స్వావలంబనలను అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అంతం చేయచూస్తున్నది. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఒక రాజకీయ పార్టీగానున్న బీజేపీ, ఆ రాజ్యాంగం పైనే దాడి ఎక్కుపెట్టింది. రాజ్యాంగాన్ని అంగీకరించబోమని, రాజ్యాంగం ఏర్పడిన నాలుగు రోజుల్లోనే ప్రకటించిన ఆర్‌ఎస్‌ఎస్‌, కాషాయ కూటమి 70 ఏండ్లలో ఎలా బలపడిందీ, రాజ్యాంగాన్ని ఆమోదిస్తు న్నామన్న లౌకిక పార్టీలు ఎందుకు బలహీనపడ్డాయన్న కీలకమైన అంశాన్ని రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన ఈ 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రను గమనిస్తే డాక్టర్‌ అంబేద్కర్‌ హెచ్చరికలు నిజమవుతున్నట్లు స్పష్టంగా కనబడుతున్నది. అలాగే ఆయన ఆశయాలు, సైద్ధాంతిక నిర్ధారణలు అన్నీ ఒకటొకటిగా వమ్మవుతూ వస్తున్నాయి. ఈ ప్రక్రియను నిలవరించకపోతే తదుపరి అంబేద్కర్‌ జయంతి నాటికి భారత రాజ్యాంగం మరింత బలహీన పడుతుంది. ఆ రాజ్యాంగం ఆధారంగా నిర్మించబడ్డ రాజకీయ ప్రజాస్వామ్యం కునారిల్లుతుంది.
రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడాలంటే…
ఏ మాత్రం నేటి రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్నవారికైనా దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అర్థమవుతుంది. అంబేద్కర్‌ చాలా స్పష్టంగా ”సాంఘిక ప్రజాస్వామ్యం భూమికగా ఏర్పడకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కువకాలం మనజాలదు” అన్నారు. ఈ సందర్భంగానే ఆయన దీనిపై మరింత వివరణ ఇస్తూ ”భారతదేశం ఒక రాజకీయ ప్రత్యామ్నాయ వ్యవస్థగా కాకుండా సాంఘిక ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపొందడానికి కషి చేయాల్సి ఉంటుంది. 1950 నవంబర్‌ 26న (రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు) మనం ఒక వైరుధ్య భరితమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. రాజకీయాలలో సమానత్వం ఉంటుంది. కానీ సాంఘిక, ఆర్ధిక జీవితంలో అసమానతలు ఉంటాయి. ఈ వైరుధ్యాన్ని ఎంత తొందరగా పరిష్కరించగలిగితే అంతగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని నిలబెట్టుకోగలుగుతాము”. అని చెప్తూ ఆయన మరో హెచ్చరిక కూడా చేశారు. అదేమంటే, ”అలా జరగకుంటే ఈ అసమానతల వలన నలిగిపోతున్న ప్రజలు ఎంతో కష్టానికోర్చి నిర్మించిన ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థని బద్దలు కొట్టేస్తారు” అన్నారు. కానీ, వాస్తవానికి ఈరోజు ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థని లేక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని బద్దలు కొడుతున్నది బాబాసాహెబ్‌ ఊహించినట్లుగా పీడిత ప్రజలు కాదు, మతోన్మాద ఫాసిస్ట్‌ పాలక శక్తులే.
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ వేల సంవత్సరాల భారతదేశ చరిత్రని, ముఖ్యంగా హిందూ సమాజాన్ని మరీ ముఖ్యంగా హిందూ మత ఆవిర్భావం, దాని పెరుగుదలను అత్యంత లోతుగా అధ్యయనం చేసిన మీదట ఆయన చేసిన మరో అతి ముఖ్యమైన హెచ్చరిక ఏమంటే ”హిందూ రాజ్యమనేదే ఒక వాస్తవ రూపం తీసుకుంటే ఎటువంటి అనుమానం లేకుండా అది ఈ దేశానికి అత్యంత విధ్వంసపూరితమైనది అవుతుందని చెప్పవచ్చు. అందువలన హిందూ రాజ్యస్థాపన అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించి తీరాలి”. అని ఆయన చేసిన హెచ్చరిక ఈ జయంతి సందర్భంగా కేవలం అంబేద్కరైట్లు మాత్రమే కాదు, దేశంలోని లౌకిక శక్తులు, ప్రజాతంత్ర వాదులు, ప్రగతిశీల వాదులు, వామపక్ష శక్తులు అందరూ తీసుకోవాల్సిన ముఖ్యమైన హెచ్చరిక. కారణాలు ఏమైనప్పటికీ ఈ హెచ్చరికను తీవ్రంగా పరిగణించడంలోనూ, పరిగణించే వారు కూడా అందరినీ ఐక్యం చేసి హిందూరాజ్య స్థాపన ప్రక్రియను నిలువరించడంలోనూ కతకత్యులు కాలేదన్నది మాత్రం వాస్తవం. కాబట్టి అదే నేడు దేశం ముందున్న అత్యంత కీలక కర్తవ్యం.
లోపం ఎక్కడుంది?
పై కర్తవ్య సాధనలో ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. దీనికి సమాధానం భారతదేశ చరిత్రలో మనకి కనబడుతుంది. స్వాతంత్రోద్యమం ఊపందుకున్న దశలో అంటే 1920ల తరువాత దేశం ముందుకు ఆ స్వాతంత్రోద్యమం కొన్ని కీలకమైన ప్రశ్నలను తెచ్చింది. ఒకవైపు స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంపన్న వర్గాల ప్రతినిధులైన కాంగ్రెస్‌ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మేధావులు, సంఘసంస్కర్తలు. మరోవైపు సాంఘిక ఉద్యమాన్ని కులవ్యవస్థ వ్యతిరేక ఉద్యమంగా నిర్మించబూనుకున్న సంఘ సంస్కర్తలు ముందుకు తెచ్చిన వాదనలు మనం పరిశీలించాలి. ఇందులో మొదటి తరహాకు చెందిన రాజా రామ్మోహన్‌రారు, బాలగంగాధర తిలక్‌, లాలా లజపతిరారు వంటి వారు. రెండవ తరగతిలో ప్రముఖులు జ్యోతిబాపూలే, నారాయణగురు, అయ్యంకాళి, రామస్వామి నాయకర్‌, త్రిపురనేని రామస్వామి అంతిమంగా డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌. ఈ రెండవ తరగతికి చెందినవారు మొత్తం ఈ వ్యవస్థలో సాంస్కతిక ఆర్థిక రాజకీయ స్థాయిలలో జరుగుతున్న అణచివేతను ఎదిరించారు. వారు అప్పుడే పెరుగుతున్న హిందూ జాతీయవాదాన్ని సవాల్‌ చేశారు. హిందూ జాతీయవాదం అప్పటికే భారతదేశాన్ని, సమాజాన్ని హిందూ పరిధిలోకి తేవాలని చేస్తున్న ప్రయత్నాలను వారు తిరస్కరించారు. హిందూయిజం అనేది భారతదేశంలోని అత్యధిక మందికి సంబంధించిన మతం కాదని, అది కత్రిమంగా రుద్దపడుతున్న వాదన అనీ, దీనిని అల్పజాతులన్నీ ఐక్యంగా తిరస్కరించాలని ఎలుగెత్తారు. ఫూలే కొత్త తరహా నాస్తికవాద మతాన్ని రూపొందించారు. పెరియార్‌ నాస్తిక వాదాన్ని, నారాయణగురు (కేరళలో) ‘ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు’ అని ఆయన అనుచరుడైన అయ్యప్ప మరో అడుగు ముందుకేసి ‘మతం లేదు, కులం లేదు, మానవ జాతికి దేవుడు లేడు’ అని, అంబేద్కర్‌ హిందూ మతాన్నే వదిలి బౌద్ధమతాన్ని స్వీకరించడం, వీటన్నింటిలో మనకి కనబడే ఒక సాధారణ అంశం ఏమంటే హిందూయిజాన్ని తిరస్కరించడం. అందులో భాగంగా కులవ్యవస్థ వ్యతిరేక రాడికల్‌ వైఖరులను తీసుకోవడం జరిగింది. ఈ వైఖరి స్థూలంగా రాజా రామ్మోహన్‌రారు, స్వామి వివేకానందల నుంచి గాంధీ వరకు (వివిధ తేడాలున్నప్పటికీ) తీసుకున్న వైఖరికి విరుద్ధమైనది. ఆనాటి నుంచి కూడా అంబేద్కర్‌ హిందూ మతాన్ని, కుల వ్యవస్థను విడదీయరానివిగా పరిగణించారు. గాంధీ వంటి జాతీయోద్యమ అగ్ర నాయకులు ఆ రెండింటిని విడగొట్టి చూడడం, అందులోనూ కుల వ్యవస్థను (చాతుర్వర్ణ వ్యవస్థను) సంస్కరిచాలని తద్వారా అంటరానితనాన్ని నిర్మూలించగలుగుతామని వసుధా చాతుర్వర్ణ వ్యవస్థ ఆచరణీయమైనదేనని వాదించారు. నేటికీ ఈ వైరుధ్యం కొనసాగుతున్నది.
1935 ఆగస్టు నెలలో గుజరాత్‌లోని ‘కవిత’ అనే గ్రామంలో దళితులు తమ పిల్లలను పాఠశాలకు పంపారు. అది గమనించిన అగ్రవర్ణాల వారు పాఠశాల నుండి తమ పిల్లలను వెనక్కి తీసుకొని ఆ పాఠశాలపైన, దళిత పిల్లలపైన దాడి చేశారు. వాళ్ల ఇండ్లమీద పడి చితక్కొట్టి, ఇండ్లు ధ్వంసం చేశారు. వారు నీళ్లు తాగే బావిలో కిరసనాయిల్‌ పోశారు. తమ పిల్లలను ఇంకెప్పటికీ ఆ పాఠశాలకి పంపమని ఆ దళిత పెద్దలు హామీ ఇచ్చేవరకు ఈ దమనకాండ సాగింది. దీనిపై స్పందించిన అంబేద్కర్‌ ‘నేను దళిత కుటుంబంలో పుట్టాను. పుట్టుక నా చేతుల్లో లేదు. కానీ హిందువుగా మాత్రం చావను’ అని ప్రకటించాడు. ఈ ఘటనకి 7,8 సంవత్సరాల ముందే మహద్‌ గ్రామంలో ఆయన చేసిన చెరువు పోరాటం మన గమనంలో వుండాలి. దీనిపై గాంధీజీ స్పందిస్తూ, అంబేద్కర్‌ ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, క్షణికావేశానికి గురయ్యాడని చెప్పిన దానికి సమాధానంగా డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ‘కవిత’ ఘటన మొత్తం అనాదిగా దేశంలో జరుగుతున్న తీవ్రమైన సామాజిక సమస్య అని, ఇది హిందూమతంలోని విడదీయరాని ఓ క్రూరమైన ధోరణి అని ప్రకటించాడు. అలాగే 1932లో ‘పూనా ప్యాక్ట్‌’ సందర్భంగా జరిగిన చర్చలలో అంబేద్కర్‌ వైఖరిని విమర్శిస్తూ గాంధీజీ అది హిందువులలో విభజన తెస్తుందన్నారు. దీనికి అంబేద్కర్‌ సమాధానం చెబుతూ ”నన్ను దగ్గరలో ఉన్న వీధి దీపపు స్తంభానికి ఉరితీసినా నా ప్రజల న్యాయబద్ధమైన ప్రయోజనాలు కాపాడటానికి నా పవిత్రమైన కర్తవ్యం నుండి వైదొలగనని ప్రకటించాడు”. ఈ విధంగా నాడు మన దేశ స్వాతంత్య్రానికి ముందే ఒకటి, రెండు దశాబ్దాల పాటు జరిగిన ఈ చర్చలు అటు రాజకీయ రంగంలోనూ,సాంస్కతిక రంగంలోనూ తీవ్రమైన, పరస్పర విరుద్ధమైన వాదనలను, ఉదంతాలను ముందుకు తెచ్చాయి. వీటి పర్యవసానం స్వాతంత్య్రా నంతరం కూడా కొనసాగాయి. పదేండ్ల హిందూ మతోన్మాదుల పాలనలో చాతుర్వర్ణ వ్యవస్థను బలపరిచే మనువాదుల బలం పెరిగింది. మరోపక్క దీన్ని ఎదిరించే, ఎదిరించాల్సిన శక్తుల మధ్య ఐక్యత కొరవడింది.
అంబేద్కర్‌ ఆలోచనల కొనసాగింపుగా…
అంబేద్కర్‌ జయంతి, వర్థంతులని దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన జయంతి రోజును భారత ప్రభుత్వం ”సమానత్వ దినం”గా జరపాలని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ”అంతర్జాతీయ సమానత్వ దినం”గా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని కోరడం జరిగింది. కానీ అంబేద్కర్‌ ఆలోచనలను, సాంఘిక రంగంలో ఆయన ముందుకు తెచ్చిన శాస్త్రీయమైన, వర్గ దక్పథంతో కూడుకున్న వాదనలను మాత్రం పాలకవర్గాలు ఉద్దేశపూర్వకంగానే కప్పేయడానికి ప్రయత్నిస్తున్నాయి. డాక్టర్‌ అంబేద్కర్‌ కమ్యూనిస్టు కానప్పటికీ భూ సమస్యపై, కార్మికవర్గ సమస్యలపైన, మహిళల సమస్యలపైన చేసిన కషి, మంత్రివర్గంలో ఉన్న కొద్దికాలంలో ముందుకు తెచ్చిన చట్టాలు తెలుసుకుంటే ఆయన కేవలం కులవ్యవస్థ గురించే కాకుండా మొత్తం దేశంలో ఏ పీడనాలేని ఆధునిక సమాజం కోసం చేసిన అద్వితీయ కషి మనకి కనపడుతుంది. నిజానికి 1937లో జరిగిన ఎన్నికలలో ఆయన ప్రారంభించిన ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ (కమ్యూనిస్టు పార్టీ నిషేధంలో వుంది) బాంబే ప్రాంతంలో 15కి గాను 13 స్థానాలు గెలుపొందింది. రెండు జనరల్‌ సీట్లు కూడా గెలుచుకుంది. వ్యవసాయ కార్మికుల బానిసత్వ రద్దుకు భారతదేశంలో బిల్లు తీసుకొచ్చిన తొలి శాసనసభ్యుడు అంబేద్కర్‌. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్‌ చేయాలన్న తన ఆకాంక్షను ప్రకటించాడు. వ్యవసాయ కార్మికుల కష్టాలు, భూకామందుల జల్సాలతో ఉత్పన్నమవుతాయని ఆయన పేర్కొన్నాడు. సాగుచేయని భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిలేని వ్యవసాయ కార్మికులకు అప్పగించడం ద్వారా వారి తక్షణ సమస్యని పరిష్కరించవచ్చని ఆయన వాదించాడు. చివరగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వైఫల్యానికి తప్పుడు సిద్ధాంతం కంటే చెడు నిర్వహణ ఎక్కువ కారణం అనిపిస్తుందని ఆయన పదేపదే హెచ్చరించారు. ఈ సందర్భంగా ”రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసేవారు చెడ్డవారయితే రాజ్యాంగం చెడుగానే పరిణమిస్తుంది” అని కూడా హెచ్చరించారు.
అంబేద్కర్‌ కలలు నెరవేర్చాలి
అంబేద్కర్‌ ఆలోచనలు, ఆయన ఆశయాలు, ఆయన కలలు కన్న నూతన ఆధునిక భారతదేశం, అసమానతలు లేని సమాజం సాధించాలంటే అందుకు తొలిమెట్టు భారత రాజ్యాంగాన్ని నిష్కర్షగా పట్టుదలతో అమలుచేయించుకోవటమే. నేటి పరిస్థితులలో హిందూ మతోన్మాదం మనువాదులు అందలం ఎక్కిఉన్న తరుణంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయించ డానికి చేయవలసిన కృషే ప్రధానమవుతుంది. లౌకిక, ప్రజాతంత్ర, రిపబ్లిక్‌ని నిర్మించడం భారత పెట్టుబడిదారీ పాలకుల వల్ల కాదని స్వాతంత్య్రానంతర చరిత్ర నిరూపిస్తున్నది. ఆ కర్తవ్య నిర్వహణ బాధ్యత కీలకంగా శ్రామిక వర్గ పార్టీ అయిన కమ్యూనిస్టుల మీద, విప్లవ శక్తులమీద వుంటుంది. ఈ సందర్భంగా డబ్ల్యు ఎన్‌ కుబేర్‌ చెప్పినట్లు (అంబేద్కర్‌ విశ్లేషణాత్మక అధ్యయనం) ”విప్లవాత్మక శక్తులను పటిష్టం చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను గురించి మనకి స్పష్టమైన అవగాహన వుండాలి. నేడు కావలసింది ఏమంటే భారత సామాజిక వ్యవస్థకి అనుగుణంగా అంబేద్కర్‌ ఆలోచనల అన్వయంతో మార్క్సిస్టు విప్లవోద్యమాన్ని నిర్మించడం.
(నేడు డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి)
– ఆర్‌.రఘు
9490098422

Spread the love