వెలుగు తొవ్వ

‘అతడు జాతిబువ్వ, అతడు వెలుగుతొవ్వ, అతడు పాలబువ్వ, అతడు నిప్పురవ్వ’ అని అంబేద్కర్‌ ఏమిటో కవితాత్మకంగా చెబుతారు ఎండ్లూరి సుధాకర్‌. నిజమే భారతదేశంలోని సామాజిక విభజనపై, అసమానత్వంపై, అస్పృశ్యతా దుర్మార్గంపై జీవితాంతమూ పోరాడిన యోధుడు అంబేద్కర్‌. సమానతా విలువను హక్కుగా చేసిన రాజ్యాంగ నిర్మాణ నాయకుడు, దేశంలోని అణగారిన జనుల గుండె చప్పుడూ అయిన బాబాసాహెబ్‌ రాంజీ అంబేద్కర్‌ చిరస్మరణీయ నాయకుడు. ఆ మహనీయుని జన్మదిన సంద ర్భంగా ఆయన మనకందించిన విలువల్ని, ఆశయాలనూ మననం చేసుకుని, నేడు వాటికి ఎదురౌతున్న సవాళ్లను ఎలా అధిగమించాలో ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. మాటల్లో అంబేద్కర్‌ను పొగుడుతూనే ఆయన ఆశయాలను నిలువునా పాతేస్తున్న పాలకుల దుష్ట పన్నాగాలను పసికట్టకపోతే, రేపు పబ్లిక్‌గానే హత్యకు పూనుకుంటారనేది నిష్టుర సత్యం. ముఖ్యంగా సామాన్య ప్రజల, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితపర్యాంతమూ చేసిన కృషికి పూర్తి విరుద్ధమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఆ ప్రజల హక్కులకు, జీవితాలకు పెద్ద ప్రమాదం ఎదురుకాబోతున్నది.
అంబేద్కర్‌ అణగారిన వర్గాల ప్రజలకోసం ప్రత్యేక కృషి చేసినప్పటికీ, ఈ దేశ ప్రజలందరి క్షేమం కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పనిచేసిన సమతా సంపన్నుడాయన. ఆయన పనిచేసిన ముఖ్యమయిన విషయాలు, కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, ఆర్థిక సమత, మానవ హక్కులు, బలహీనవర్గాల సాధికారత. వీటి సాధన ప్రాతిపదికగానే మన దేశానికి రాజ్యాంగ నిర్మాణాన్ని గావించిన మేధోఘనుడు. అంబేద్కర్‌ ఆశయాలనే కాదు, ఆయన్ను కూడా కించపరిచే విధంగా రాజ్యాంగం ఆయనొక్కడేమీ రాయలేదని, 288 మందిలో ఆయనొకడనీ ప్రేలాపిస్తున్న ఘటనలూ చూస్తున్నాము. ఎంతమంది కమిటీలో వున్నా ప్రధాన పాత్ర వహించింది అంబేద్కరే. ‘రాజ్యాంగం నైపుణ్యం కలిగిన పైలట్‌ పనిని అంబేద్కర్‌ నిర్వహించాడనీ’ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ కొని యాడాడు. ‘రాజ్యాంగ నిర్మాణంలో డా|| అంబేద్కర్‌ కంటే ఎక్కువ శ్రద్ధ, ఇబ్బంది ఎవరూ తీసుకోలేదు’ అని నాటి ప్రధాని నెహ్రూ అన్నారు. 1948లోనే డ్రాప్టింగ్‌ కమిటీ సభ్యులు టి.టి. కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మరణం, అనారోగ్యం, ఇతర ఆందోళనల కారణంగా చాలామంది సభ్యులు గణనీయమైన రచనలు చేయలేకపోయినందున, ఈ రాజ్యాంగాన్ని రూపొందించే భారం అంబేద్కర్‌పై పడింది’ అని అన్నారు. కాబట్టి ఒక దాడి జరిగే ముందు చేసే నీచ ప్రచారం ఇది.
ప్రపంచంలోనే పేరెన్నికగన్న మేధావి, దార్శనికుడు అయిన అంబేద్కర్‌, రాజ్యాంగం ద్వారా మనకేమిచ్చాడు అని పరిశీలిస్తే, రాజ్యాంగానికి పూర్వం భారతదేశం మనుస్మృతి రాజ్యం. అప్రజాస్వామ్య రాజ్యం. లౌకికేతర రాజ్యం, నియంతృత్వ రాజ్యం, రాజ్యాంగం వచ్చాక లౌకిక ప్రజాస్వామిక దేశం అయింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు భారత ప్రజలకు లభించడానికి కారణాలయ్యాయి. ముఖ్యంగా భారత ప్రజలమైన మనకు మనమే ఏర్పాటు చేసుకున్న స్వేచ్ఛా పత్రంగా రాజ్యాంగం నిర్మితమైంది. మహిళలను బానిసలుగా చూసిన విధానం నుంచి, వారికీ ఆస్తి హక్కును, విద్యను, సమానతను అందించింది రాజ్యాంగమే. మత స్వేచ్ఛను కలిగించి, అంటరానితనం, అన్నిరకాల వివక్షతలను చట్ట విరుద్ధం చేయడం రాజ్యాంగం ద్వారానే సాధ్యమయింది. భారత రాజ్యాంగంలో అభాగ్యులకు, అనాథలకు, పరాజితులకు అవకాశాలతో పాటు అస్తిత్వం, ఆత్మగౌరవం పొందేలా అంబేద్కర్‌ కృషి చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా భారతీయ వాస్తవిక జీవన విలువ అయిన ‘భిన్నత్వంలో ఏకత్వం’ స్పూర్తినిచ్చింది రాజ్యాంగమే.
ఇంతటి మహత్తరమైన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నది ఆరెస్సెస్‌, బీజేపీ దాని మిత్రపక్షాలు. 1927లో మహద్‌ పోరాటంలో మనుస్మృతిని తగులబెట్టి, అదెంత విఛ్చిన్నకర బోధనో, దాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చాడు అంబేద్కర్‌. కానీ తమ ప్రాచీన భారత రాజ్యాంగం మనుస్మృతి మాత్రమే అని ఆరెస్సెస్‌ ప్రకటించింది. మన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ బహిరంగంగానే రాజ్యాం గాన్ని మారుస్తామని చెప్పాడు. ఇక కర్నాటక బీజేపీ ఎంపీ అనంత కుమార్‌ హెగ్డె, మాకు 400 ఎంపీ సీట్లిస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని, రద్దుచేస్తామని ప్రకటించాడు. ఇప్పటికి మనకున్న హక్కులన్నీ రాజ్యాంగం ఇచ్చినవే. రాజ్యాంగపు విలువలన్నీ ధ్వంసం చేస్తున్నారు వీళ్లు. ఇంకోవైపు ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటుపరం చేసి, సామాజిక న్యాయాన్నీ రిజర్వేషన్లనూ లేకుండా చేసేస్తున్నారు. ప్రజా స్వామ్యం, ఫెడరలిజంపైనా దాడి ఆరంభిం చారు. ఇప్పుడు, అంబేద్కర్‌ జయంతి స్ఫూర్తితో, రాజ్యాం గాన్నీ, ప్రజాస్వామిక విలువలనూ వారి నుంచి రక్షించుకోవాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో, రాజ్యాంగం మనకిచ్చిన ఓటుహక్కుతో ఈ పనికి మనం పూనుకోవడమే అంబేద్కర్‌ ఆశయానికి నిజమైన కొనసాగింపు.

Spread the love