బాపుపై దాడి చేసిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు పెట్టాలి

నవతెలంగాణ-కోటపల్లి
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం షెట్‌పల్లి గ్రామంలో దళిత రైతు దుర్గం బాపుపై దాడి చేసిన సూరం రాంరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్‌ చేశారు. రాంరెడ్డిపై చర్య తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ర్యాలీ, పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంకె రవి మాట్లాడుతూ.. నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో నియోజకవర్గంలో గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మందమర్రి మండలం మామిడిగట్టు, జైపూర్‌ మండలం గంగిపల్లిలో దళితులపై దాడి జరిగిందన్నారు. సిర్సా గ్రామంలో ప్రేమ పేరుతో పెండ్లి చేసుకొని వెన్నెల అనే దళిత అమ్మాయి మరణానికి పెత్తందారులు కారణమయ్యారని తెలిపారు. లింగన్నపేటలో దళిత బాలికను చంపేశారని చెప్పారు. తాజాగా దళిత రైతును కట్టేసి కొట్టారని, ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు. దుర్గం బాపుపై దాడి చేసి, కొట్టి అవమానపరిచిన సూరం రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు తిగిరి పునరావృతం కాకుండా మండలాల్లో, గ్రామాల్లో ప్రతినెలా సమావేశాలు నిర్వహించాలని కోరారు. బాధిత రైతు బాపుకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అంతకు ముందు బాపు ఇంటికెళ్లి పరామర్శించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చెన్నూర్‌ పట్టణ కార్యదర్శి ఎండి అవేజ్‌, కావేరి, మండల కార్యదర్శి రవి, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్‌, నాయకులు గడ్డం పోసక్క, ఉమారాణి, దాసరి సంధ్య, మారయ్య, నగేష్‌, బండారి రాజేశ్వరి, సుందిల్ల రాజేశ్వరి, రుక్సానా, మధు, రమ్య, ఆర్‌ఎం.ఖాన్‌, బండారి శ్రీనివాస్‌, రేణుక, ప్రసన్న, రజిత, సౌందర్య, మంజుల, రమేష్‌, శంకర్‌, మధుకర్‌, జక్కయ్య, రాజన్న, పద్మ, లక్ష్మి, రాజేశ్వరి పాల్గొన్నారు.

Spread the love