రష్యాపై ఆంక్షల పర్యవసానం… జర్మన్‌ పరిశ్రమలు నాశనం

యూరోపియన్‌ యూని యన్‌లో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ పరిశ్రమలు రష్యాపైన ఆంక్షలు విధించటం వల్ల నాశనమౌతున్నాయని జర్మన్‌ పార్లమెంట్‌ సభ్యుడు, యూవె షుల్జ్‌ హెచ్చరించారు. మితవాద ఏఏఫ్డి పార్టీ సభ్యుడైన షుల్జ్‌ ఆ పార్టీ వెబ్‌ సైట్‌లో ఒక ప్రకటన చేస్తూ రష్యాను నష్టపరచాలనే ఆంక్షలు ఘోరంగా విఫలమవటమే కాకుండా అవి జర్మన్‌ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని చెప్పాడు. పర్యవసానంగా 2022లో రష్యన్‌ ఫెడరేషన్‌ జర్మనీని వెనక్కు నెట్టి ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందన్నారు. తాజా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రిపోర్ట్‌ ప్రకారం ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రష్యా ఒకటి. పర్చేజ్‌ పవర్‌ ప్యారిటీ(పీపీపీ) ని అనుసరించి 2022 చివరలో ఐరోపా ఖండంలో చరిత్రలో ఏ దేశంపైనా విధించని ఆంక్షలను విధించినప్పటికీ రష్యా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. పీపీపీతో కొలిచినప్పుడు ఐదు ట్రిల్లియన్‌ డాలర్ల జర్మన్‌ ఆర్థిక వ్యవస్థను రష్యా అధిగమించిందని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌)లు ప్రచురించిన అంచనాలు తెలియజేస్తున్నాయి. 31ట్రిల్లియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో చైనా ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్బవించిదని, ఆ తరువాత స్థానాలలో అమెరికా, ఇండియా, జపాన్‌లు ఉన్నాయని, పది అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఇండోనేషియా, బ్రాజిల్‌, టర్కీలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు ప్రచురణ పేర్కొంది. రష్యాపైన విధించిన ఆంక్షల ప్రభావం జర్మన్‌ ఆర్థిక వ్యవస్థపైన వినాశకరంగా ఉన్నదని నిరాశాజనకమైన 2023 జర్మన్‌ ఆర్థిక సూచికలు తెలియజేస్తున్నాయని షుల్జ్‌ పేర్కొన్నాడు. జర్మనీలో వస్తువుల తయారీ ఉత్పత్తి దిగజారటం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి జర్మన్‌ ఆర్థిక వ్యవస్థ మరింతగా దెబ్బతినకముందే వెంటనే రష్యాపైన విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని సదరు పార్లమెంట్‌ సభ్యుడు విజ్ఞప్తి చేశాడు.
జర్మన్‌ ఆర్థిక వ్యవస్థ ఇక ఏమాత్రం పోటీపడే స్థితిలో లేదని, అది ‘జబ్బుపడిన ఐరోపా వాసి’గా మారిపోయిందని మెటల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పరిశ్రమలకు చెందిన జర్మన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయర్స్‌ అసోషియేషన్స్‌ అధినేత, స్టెఫాన్‌ వోల్ప్‌ అన్నారు. ఈ సంవత్సరం రెండవ అర్ధభాగంలో జర్మనీలో మాంధ్యం నెలకొనే అవకాశమున్నట్టు ఆయన అంచనా వేస్తున్నాడు. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా యూరోపియన్‌ యూనియన్‌ రష్యపైన ఆంక్షలను విధించిన తరువాత యూరోప్‌ లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీకి రష్యా గ్యాస్‌, చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. అంతకుముందు జర్మనీ ఆర్థిక వ్యవస్థ గ్యాస్‌ డిమాండ్‌లో 40శాతం, చమురు అవసరాల్లో మూడవ వంతు రష్యా నుంచి దిగుమతి అయ్యేవి.

Spread the love