ఆసియా ఆర్థిక వ్యవస్థల అవసరాలకు రష్యా చమురు

జూన్‌ నెలలో భారత దేశం, చైనాలకు రష్యా అన్నిదేశాలకంటే ఎక్కువగా చమురును ఎగుమతి చేసిందని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్‌ కంట్రీస్‌ (ఒపెక్‌) గురువారం విడుదల చేసిన చమురు మార్కెట్‌ నివేదిక పేర్కొంది. ఒపెక్‌ విడుదల చేసిన సమా చారాన్ని బట్టి తెలుస్తున్నదేమంటే ఒపెక్‌ రిపోర్టింగ్‌ కాలంలో చైనా చమురు దిగుమతుల మొత్తంలో 20శాతం రష్యా నుంచి వస్తోంది. గత ఆరు నెలలుగా చైనాకు అత్యధిక స్థాయిలో క్రూడ్‌ను ఎగుమతి చేస్తున్న దేశంగా రష్యా నిలిచింది. చైనాకు చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా 15శాతంతో రెండవ స్థానంలోను, మలేషియా 11శాతంతో మూడవ స్థానంలోను నిలిచాయి. చైనా దిగుమతి చేసుకుంటున్న రష్యా చమురు జూన్‌ నెలలో 10.5మిలియన్‌ టన్నులుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 40శాతం అధికం. మొత్తంమీద మే నెలతో పోల్చినప్పుడు చైనా చమురు దిగుమతులు 5శాతం పెరిగాయి. పరిమాణం పరంగా అవి రోజుకు(బీపీడీ) 12.7 మిలియన్‌ బ్యారెల్స్‌ చైనాకు దిగుమతి అవుతున్నాయి.అలాగే జూన్‌ నెలలో ఇండియా చేసుకున్న చమురు దిగుమతుల్లో 45శాతం రష్యా నుంచి వచ్చింది. గత సంవత్సరంగా ఇండియాకు అత్యధి కంగా క్రూడ్‌ను సరఫరా చేస్తున్న దేశంగా రష్యా నిలిచింది. ఇండియా చమురు దిగుమతుల్లో ఇరాక్‌ వాటా 17శాతం, సౌదీ అరేబియా వాటా 16 శాతంగా ఉన్నాయి. ఒపెక్‌ రిపోర్టింగ్‌ కాలంలో ఇండియా చేసుకుంటున్న మొత్తం దిగుమతులు మే నెలతో పోల్చినప్పుడు 3శాతం క్షీణించి 4.7 మిలి యన్‌ బిపిడిగా ఉన్నాయి. 2023లో మొదటి ఐదు నెలల కాలంలో ఇండి యా రష్యా నుంచి 37మిలియన్‌ టన్నుల చమురును దిగుమతి చేసుకు న్నది. ఇది 2022 సంవత్సరం అంతా చేసుకున్న దిగుమతులకంటే అధికం.ఇండియా, చైనాలు రష్యా చమురును చాలా తక్కువ ధరకు కొంటున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా రష్యాపైన పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలవల్ల రష్యా తన సంప్రదాయ పశ్చిమ ఐరోపా మార్కెట్‌ ను కోల్పోవటంతో ఇండియా, చైనాలకే కాకుండా రష్యా చాలా దేశాలకు చమురు ధరను తగ్గించి అమ్ముతోంది.

Spread the love