
తెలంగాణ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ నాయకులు శివ సాయి, రవీందర్, ఆకాష్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎదుట పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదని, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో లక్షల్లో ఫీజులు కట్టలేక ఉమ్మడి నిజామాబాద్,అదిలాబాద్ జిల్లాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కోసం హైదరాబాదు ఇతర పట్టణ ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారని, గతంలో ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్ లో పెడతామని పాలకులు హామీ ఇచ్చారని, యూనివర్సిటీ 500 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ తే.యూ నాయకులు అక్షయ్, రామకృష్ణ,హన్మాండ్లు ,రాజు తదితరులు పాల్గొన్నారు.