భావితరాలకు ఆదర్శం

An example for future generationsగుమ్మడి నర్సయ్య
భోగభాగ్యాలు అనుభవించడానికి ఆయనకు అవకాశం వచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే సాదాసీదా జీవితం గడుపుతున్నారు. ఆయన కోరుకుంటే ఇప్పటికీ విలాసవంతమైన బతుకు బతకొచ్చు. కానీ అదనపు విలువను తన చెంతకు చేరనివ్వరు. ఆయన తలుచుకుంటే తన బిడ్డల్ని సంపాదనాపరులుగా తీర్చిదిద్దొచ్చు. అందుకు ససేమిరా అంటారు. నిరుపేదల మధ్య తానూ పేదగానే బతకాలని ముచ్చటపడుతుం టారు. బతికినంత కాలం పేదలకు సేవ చేయడంలోనే ఆనందం ఉందంటారు. పేదల రాజ్యం కోసం లడాయి చేయడమే జీవతాశయ మంటారు. ఆయన ఐదు పర్యాయాలు ఇల్లెందు నయోజకవర్గ శాసన సభ్యుడుగా చేశారు. ఆయనే గిరిజనుల ముద్దుబిడ్డ గుమ్మడి నర్సయ్య.
గుమ్మడి నర్సయ్య పేద ఆదివాసి బిడ్డడు. గుమ్మడి లక్ష్మయ్య- చుక్కమ్మ దంపతుల కొడుకు. ఆయన తన పేరు రాసేంతటి చదువును మాత్రమే నేర్చుకున్నారు. చిరుప్రాయంలో పశువులను కాసేవారు. ఈ సందర్భంలోనే సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1981లో ఉసిరికాయపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పంచాయతీ నిధులను సక్రమంగా సద్వినియోగం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో శ్రద్ద వహించారు. గ్రామ ప్రజల మన్ననలు పొందారు. ఈ సమయంలోనే సీతారాంపురం భూస్వాములకు వ్యతిరేకంగా భూపోరాటాలు నిర్వహించారు. పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్నారు.
తొలిసారిగా 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థిగా గుమ్మడి నర్సయ్య పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1985, 89, 1999, 2004 తిరిగి గుమ్మడి నర్సయ్య గెలుపొందారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సమయంలో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లారు. పౌరహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలను ఎండగట్టడంలో అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడారు. ఎమ్మెల్యేకు వచ్చే గౌరవ వేతనాన్ని పార్టీకి జమ చేసేవారు. పార్టీ ఇచ్చే అలవెన్స్‌తో జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వ పథకంలో భాగంగా వచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే సాదాసీదా వ్యక్తిగా, నిగర్విగా, నిరాడంబరుడుగా జీవనం సాగిస్తున్నారు.

Spread the love