అల‌నాటి అమ‌ర గాయ‌కుడు

భారతదేశం గర్వించదగిన అమర గాయకుడు మహమ్మద్‌ రఫీ. అతని పాట మధురం, మనసు నవనీతం, మనిషి బంగారం. యావద్భారతాన్నీ తన పాటలతోభారతదేశం గర్వించదగిన అమర గాయకుడు మహమ్మద్‌ రఫీ. అతని పాట మధురం, మనసు నవనీతం, మనిషి బంగారం. యావద్భారతాన్నీ తన పాటలతో పరవశింప చేసి, ఆనందసాగరంలో మునకలు వేయించి మధురామతానికి మారుపేరుగా నిలిచారు మహ్మద్‌ రఫీ. హిందీతో పాటు 17 భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడాడు. తొలితరం భారతీయ సినీ సంగీత సాగర ప్రయాణానికి దిక్సూచి లాంటి రఫీ ‘పృథ్వీరాజ్‌ కపూర్‌, రాజ్‌ కపూర్‌, రిషీ కపూర్‌’ వంటి మూడు తరాల బాలీవుడ్‌ నటులకు స్వరాలు అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. డిసెంబర్‌ 24 న ఆ దివంగత గాయకుడి 99 వ జయంతి సందర్భంగా సోపతి పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.
మహ్మద్‌ రఫీ పాశ్చత్య పాటల నుండి దేశభక్తి పాటల వరకు, విషాదకరమైన గీతాల నుండి శృంగార గీతాల వరకు, ఖవ్వాలిస్‌ నుండి గజల్స్‌ వరకు, భజన పాటల నుండి శాస్త్రీయ పాటల వరకు విభిన్నంగా పాడారు. ఆయన పాడిన ”బహారో పూల్‌ బర్‌సావో…”, ”మేరా మెహబూబ్‌ ఆయాహైఉ…”, ”ఆజ్‌ మౌసమ్‌ బడా బేమాన్‌ హై…”, ”యే మేరా ప్రేమ్‌ పాత్ర పడ్కర్‌ కే తుమ్‌…”, ”చాహుంగా మై తుఝే సాంజ్‌ సవేరే…”, ”ఆప్‌ ఆయే బహార్‌ ఆయీ…”, ”ఓ మేరీ మెహబూబా మెహబూబా మెహబూబా తుజే…”, ”తూ ఇస్‌ తారా సే మేరీ జిందగీ…”, ”చౌద్విన్‌ కా చంద్‌ హౌ…”, ”ఖోయా ఖోయా చంద్‌ ఖులా ఆస్మాన్‌…”, ”మన్‌ రే, తు కాహే న ధీర్‌ ధరే…” వంటి హిందీ పాటలు పాడిన రఫీ తెలుగులో ”ఎంతవారు గాని, వేదాంతులైన గాని…”, ”నా మది నిన్ను పిలిచింది గానమై..”, ”తారలెంతగా మురిసేనో”, ”నీకేల ఇంత నిరాశ”, ”సిపాయీ ఓ సిపాయీ..” వంటి పాటలు శ్రోతలను మురిపించాయి.. మైమరిపించాయి. బతికినంతకాలం, చివరి శ్వాస వరకు పాడుతూనే బతికిన వ్యక్తి మహ్మద్‌ రఫీ.
తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరించిన మహ్మద్‌ రఫీ 24 డిసెంబర్‌ 1924 పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించాడు. జాట్‌ కుటుంబంలో హాజీ అలీ మహమ్మద్‌, అల్లా రాఖీ దంపతులకు జన్మించిన ఆరుగురు కుమారుల్లో మహ్మద్‌ రఫీ రెండవవాడు. అయితే బాల్యంలో తమ గ్రామానికి వచ్చే ఫకీర్ల గానాన్ని రఫీ అనుకరించేవాడు. అలా చిన్నప్పడే రఫీకి సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. ఆ క్రమంలోనే రఫీ తండ్రి 1935లో లాహోర్‌కు మకాం మారినపుడు అక్కడ ‘ఉస్తాద్‌ అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌’ వద్ద రఫీ సంగీతంలో శిక్షణ తీసుకున్నాడు. 13 సంవత్సరాల వయస్సులో రఫీ మొదటి బహిరంగ ప్రదర్శన ఇచ్చాడు. లాహోర్‌లో కె.ఎల్‌.సైగల్‌తో కలిసి రఫీ పాటలు పాడాడు. 1941లో లాహోర్‌లో సంగీత దర్శకుడు శ్యామ్‌ సుందర్‌ రూపొందించిన పంజాబీ చిత్రం ‘గుల్‌ బలోచ్‌’ (1944లో విడుదలైంది) లో జీనత్‌ బేగంతో కలిసి ”సోనియే నీ, హీరీయే నీ” యుగళగీతంతో ప్లేబ్యాక్‌ సింగర్‌గా అరంగేట్రం చేశాడు. ఆ తరవాత రఫీ సినిమాల్లో పాటలు పాడడానికి 1944లో బొంబాయి వెళ్లాడు.
‘గావ్‌ కి గోరి’తో గాయకుడుగా.. 
1945లో రూపొందిన ‘గావ్‌ కి గోరి’ చిత్రంలో జి.ఎం. దురానీతో కలిసి రఫీ బాలీవుడ్‌లో తొలిసారి పాడారు. ఆయనలోని అసలైన గాయకుణ్ణి లోకానికి పరిచయం చేసిన ఘనత సంగీత దర్శకుడు నౌషాద్‌ అలీకే దక్కుతుంది. ‘బైజు బావరా’ చిత్రంలోని పాటలు హిట్‌ కావడంతో రాత్రికి రాత్రి మహ్మద్‌ రఫీ గాయకుల్లో సూపర్‌ స్టార్‌ అయ్యారు. ఆ తర్వాత 1948లో గాంధీజీ హత్య జరిగినపుడు రఫీ ”సునో సునో ఏ దునియావాలో బాపూజీకి అమర్‌ కహానీ” పాటతో పాపులర్‌ అయ్యాడు. ఈ పాటకు భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా సిల్వర్‌ మెడల్‌ అందుకున్నాడు. నౌషాద్‌తో పరిచయం రఫీ జీవితాన్ని మలుపు తిప్పింది. ‘బైజు బావరా’ నుంచి మొదలైన వీరి కలయిక ఆ తర్వాత ఎన్నో సూపర్‌ హిట్‌ గీతాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచింది. భారతీయ చిత్ర రంగంలో కె.ఎల్‌.సైగల్‌ తరువాతి శకంలో పాటలు పాడటంలో కొత్త ఒరవడిని సృష్టించింది రఫీనే. నాటి నుంచీ హిందీ సినీ పరిశ్రమలో మహ్మద్‌ రఫీ గానం జైత్రయాత్ర చేసింది. కె.ఎల్‌.సైగల్‌ తరువాతి శకంలో పాటలు పాడటంలో కొత్త ఒరవడిని సృష్టించింది రఫీనే. ఆయన ఏ హీరోకి పాడితే అచ్చు వాళ్లు పాడినట్టే ఉంటుంది. ఆ తర్వాత రఫీ గాన ఒరవడినే ఎస్పీ బాలు అనుకరించారు. ముఖ్యంగా గురదత్‌ కి రఫీ గొంతు చక్కగా కుదిరింది. అందుకే వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా చిత్రాలు బాక్సాఫీసు వద్ద మ్యూజికల్‌ హిట్స్‌ గా నిలిచాయి. భారతీయ సినిమాలలో రఫీ మొదటి ఆధునిక గాయకుడు. అందుకే చాలామందికి ఆరాధ్యనీయుడు అయ్యాడు. రఫీ అటు తన ముందుతరానికి ఇటు తర్వాత తరాల వారికి వారధిలా నిలిచాడు. మొత్తానికి సినిమా పాటలు పరవళ్లు తొక్కడానికి రఫీ గొంతే కారణం. షమ్మీకపూర్‌ మాస్‌ హీరోగా నిలదొక్కుకోవడంలో రఫీ పాటలే కీరోల్‌ పోషించాయి. ‘ఛాహే ముజే కోయి జంగ్లీ కహే’ పాటను చూస్తుంటే నిజంగా షమ్మీ కపూరే పాడినట్లు ఉంటుంది. అది రఫీ గాన మాధుర్యం. రఫీ సాధారణ సినిమా పాటలే కాదు. గీత్‌, గజల్‌, ఖవ్వాలి, రాక్‌.. ఏ శైలి అయినా చక్కగా పాడేవాడు. ముఖ్యంగా గణేష్‌ నవరాత్రుల్లో పాడే ‘దేవా హో దేవా’ పాటను మిగతా సింగర్స్‌తో కలిసి మహ్మద్‌ రఫీ చాలా చక్కగా పాడారు. అలాగే నరేంద్ర చంచల్‌తో కలిసి ‘తూనే ముఝే బులాయా’ పాట కూడా ఇప్పటికీ దేవీ నవరాత్రుల్లో మారుమోగుతూనే వుంది. ముఖ్యంగా ఇతర గాయకులైన మహేంద్రకపూర్‌, శైలేంద్ర కుమార్‌, ముకేష్‌ కుమార్‌, కిషోర్‌ కుమార్‌లతో కలిసి పాడిన ఆయన లతా, ఆషా భోంస్లేలతో ఎన్నో యుగళగీతాలు ఆలపించారు. తన కెరీర్‌ ప్రారంభంలో రఫీ చాలా మంది సమకాలీన సంగీత దర్శకులైన ”నౌషాద్‌ అలీ, ఓ.పి.నయ్యర్‌, శంకర్‌ జైకిషన్‌, ఎస్‌.డి.బర్మన్‌, రోషన్‌, రవి, మదన్‌ మోహన్‌, లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్‌, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ” వంటి సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. వెయ్యికి పైగా హిందీ చిత్రాలతో పాటు, భారతీయ భాషలైన ఉర్దూ, పంజాబీ, తమిళం, తెలుగు, కొంకణి, అస్సామీ, భోజ్‌పురి, ఒడియా, బెంగాలీ, మరాఠీ, సింధీ, కన్నడ, గుజరాతీ, మైథిలి మొదలైన భాషలు, మాండలికాలలో ఎన్నో పాటలను పాడాడు. రఫీ భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌, పార్సీ, అరబిక్‌, సింహళం, మారిషస్‌, క్రియోల్‌, డచ్‌ వంటి విదేశీ భాషలలో సైతం పాడాడు.
మహ్మద్‌ రఫీ వివాద రహితుడు. అయితే లతా మంగేష్కర్‌తో వచ్చిన రాయల్టీ వివాదం కొంత ఇబ్బంది పెట్టింది. రఫీ, లతా కి మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రావడం వల్ల కొంతకాలం పాటు ఇద్దరు డ్యూయెట్లు పాడలేదు. ఆ తర్వాత శంకర్‌-జైకిషన్‌ సంగీత దర్శక ద్వయం వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. దాదాపు ఆరు సంవత్సరాల పాటు లతా మంగేష్కర్‌ మహ్మద్‌ రఫీ తో పాడలేదు. ఆ విరామంలో మహ్మద్‌ రఫీ సుమన్‌ కళ్యాణ పూర్‌ ల జంట మంచి హిట్‌ పాటలు ఇచ్చింది. అలాగే రఫీ లత సోదరి ఆశాబొంస్లే తో కలిసి పాడటం విశేషం.
రఫీ, లత ల మద్య విబేదాలు 
మహ్మద్‌ రఫీకి రికార్డ్‌ స్థాయిలో పాటలు పాడిన గౌరవం, ఘనత సంపాదించాలనే కోరిక ఉండేది. అయితే 1977లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లతా మంగేష్కర్‌ పేరు ఉందని తెలియగానే ఆయన నిరాశ చెందారు. వాస్తవానికి లత అంటే రఫీకి ఎటువంటి అసూయ లేదు. కానీ ఆమె కంటే ముందు తనకే గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కాలనీ, ఆ అర్హత తనకే ఉందనీ ఆయన అనేవారు. ‘గ్రామ్‌ఫోన్‌ సినిమా’ అనే కేటగిరిలో అత్యధిక పాటలు పాడిన గాయని లతా మంగేష్కర్‌ అని 1977 ఎడిషన్‌లో గిన్నిస్‌బుక్‌ పేర్కొంది. 1948-74 మధ్య కాలంలో ఆమె 25 వేలకు తక్కువ కాకుండా పాటలు పాడారనీ… సోలో, డ్యూయెట్‌, కోరస్‌, గ్రూప్‌ సాంగ్స్‌ను 20 భారతీయ భాషల్లో ఆమె పాడారనీ అందులో పేర్కొన్నారు. రోజుకి ఆమె ఐదు షిఫ్టుల చొప్పున పాటలు పాడారనీ, 1974లోనే దాదాపు 1800 పాటలు పాడారని కూడా ఆ బుక్‌లో పేర్కొన్నారు. అయితే రఫీ ఈ రికార్డ్‌ను సవాల్‌ చేస్తూ గిన్నిస్‌ బుక్‌ ప్రచురణ కర్తలకు ఓ లేఖ రాశారు. ”1944 నుంచి సినీ రంగానికీ, భారతీయ సినీ సంగీతానికీ నేను చేసిన సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించాలని కోరడం అత్యాశ కాదనుకుంటున్నాను. నా కెరీర్‌ 1944లో మొదలైంది. రికార్డ్‌ అయిన పాటల సంఖ్య 23 వేలు. దానికి తగిన ఆధారాలు కూడా జత చేస్తున్నాను. లత పాట 1947లో మొదటిసారి రికార్డ్‌ అయింది. నాకన్నా జూనియర్‌ అయిన గాయని నా కంటే ఎక్కువ పాటలు పాడడం ఎలా సాద్యం అని ఆయన ప్రశ్నించారు. అందువల్ల పక్షపాతం లేని ఓ భారతీయ ఏజెన్సీ ద్వారా నిజానిజాలు తేల్చాలి. అది తేలేవరకూ ఈ రికార్డ్‌కు సంబంధించిన పేజీని ఖాళీగా ఉంచాలని కోరుతున్నాను” అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు రఫీ. దానికి ‘మీరు పేర్కొన్న విషయం పరిశీలిస్తాం’ అని గిన్సిస్‌ బుక్‌ సంస్థ రఫీకి హామీ ఇచ్చింది కానీ, ఆ తర్వాత రెండు సార్లు ప్రచురించిన పుస్తకంలో కూడా లత పేరే ఉంది. రఫీ తన పాటల వివరాలు పంపిస్తూ రెండు, మూడు సార్లు లేఖలు రాసినా గిన్సిస్‌ బుక్‌ సంస్థ నుంచి ఎటువంటి ప్రత్యుత్తరం రాలేదు. ఈ వివాదం తేలకుండానే రఫీ కన్నుమూశారు. 1984 ఎడిషన్‌లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లత పేరుని ఉంచుతూ… 11 భాషల్లో 1944- 80 మధ్య కాలంలో 28 వేల పాటలు మహ్మద్‌ రఫీ పాడారని ఆయనే పేర్కొన్నారని గిన్నిస్‌బుక్‌ వెల్లడించింది. అయితే 1991 ఎడిషన్‌లో గిన్సిస్‌ బుక్‌ సంస్థ లత, మహమ్మద్‌ రఫీ.. ఇద్దరి పేర్లనూ తొలగించింది.
తెలుగులో యన్టీఆర్‌ చిత్రాలలో రఫీ పాటలు 
రఫీ పాటకు తెలుగు సినిమాకు కూడా అనుబంధం ఉంది. తెలుగులో మహ్మద్‌ రఫీతో తొలిసారి పాట పాడించింది నటనిర్మాత జగ్గయ్య. ఆయన సమర్పణలో తెరకెక్కిన ‘పదండి ముందుకు’ సినిమాలో ”మంచికి కాలం తీరిందా” అనే పాటను రఫీ పాడాడు. ఇదే రఫీ పాడిన తొలి తెలుగు పాట. ఈ సినిమా తరువాత యన్టీఆర్‌ ‘భలే తమ్ముడు’ సినిమాలో రఫీ పాటలు పాడి జనాన్ని పరవశింప చేశాడు. హిందీ ‘చీనా టౌన్‌’ ఆధారంగానే ‘భలే తమ్ముడు’ రూపొందింది. అక్కడ కూడా రఫీ పాటలే చిత్రానికి ప్రాణం పోశాయి. దాంతో నిర్మాత పుండరీకాక్షయ్య తెలుగులోనూ రఫీతోనే పాడించారు. ఈ సినిమాలో రఫీ గళం నుండి జాలువారిన ”ఎంతవారు గానీ వేదాంతులైన గానీ”, ”ఇద్దరి మనసులు ఒకటాయె”, ”నేడే ఈ నాడే మురిపించె నన్ను చెలితానే..”, ”గుమ్మా గుమ్మా గుమ్మెత్తించే ముద్దుల గుమ్మా”, ”బడా దిల్‌ వాలా హూ మై” అనే ఖవ్వాలీ ఎంతగానో అలరించాయి. తరువాత తెలుగులో యన్టీఆర్‌ తో అనుబంధం ఉన్న చిత్రాలలోనే రఫీ పాటలు పాడడం విశేషం. యన్టీఆర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘తల్లా పెళ్ళామా’లో ”నువ్వు నవ్వుతున్నావు, నేను నవ్వుతున్నాను” అనే ఖవ్వాలీ సాంగ్‌ పాడించారు. తరువాత యన్టీఆర్‌ కుమారులు హరికష్ణ, బాలకృష్ణ నటించిన ”రామ్‌ – రహీమ్‌”లో హరికృష్ణకు ”యూనానీ హకీమ్‌ హూ”, ”నేను కత్తుల రత్తయ్యనులే” పాటలు పాడారు. తరువాత యన్టీఆర్‌ తో పుండరీకాక్షయ్య నిర్మించిన ‘ఆరాధన’ చిత్రంలో మరోమారు రామారావుకు రఫీ నేపథ్యగానం చేసి మురిపించారు. ఈ సినిమాలో ”ప్రియతమా నా మది నిన్ను పిలిచింది”, ”నేడే తెలిసింది, ఈ నాడే తెలిసింది”, ”నీకేల ఇంత నిరాశ” పాటలు పాడగా అవి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అనంతరం యన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలి’లో సలీమ్‌ పాత్రధారి బాలకృష్ణకు అన్ని పాటలూ రఫీతోనే పాడించారు. ఇందులోని మహ్మద్‌ రఫీ పాడిన ”సిపాయీ ఓ సిపాయీ..”, ”తారలెంతగా మురిసేనో”, ”తానే మేలి ముసుగు తీసి”, ”హసీనా ఓ హసీనా”, ”రేయి ఆగిపోనీ రేపూ ఆగిపోనీ…” పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. యన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ లో ”దేవుడు ఒకడే ఆ దైవం ఒకడే” పాటను పాడాడు. ఇదే ఆయన చివరగా పాడిన తెలుగు పాట. ఏది ఏమైనా మహ్మద్‌ రఫీ గళంలో జాలువారిన గానానికి తెలుగువారు ఎంతగానో పులకించిపోయారు. ఆయన పాడిన తెలుగు పాటలనే కాదు, హిందీ గీతాలనూ అదే స్థాయిలో అభిమానించి, ఆరాధించారు తెలుగు శ్రోతలు. తెలుగులో రఫీ పాడినవి కొన్ని పాటలే అయినా అవన్నీ ఆణిముత్యాలే.
అవార్డులు
మహ్మద్‌ రఫీని వరించిన అవార్డులకు లెక్కేలేదు. 1967 లో కేంద్ర ప్రభుత్వంచే ‘పద్మశ్రీ’ పురస్కారం. 1977 లో ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ చిత్రంలోని ”క్యా హువా తేరా వాదా” పాటకి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడి అవార్డుతో పాటు, 1960 లో చౌద్విన్‌ కా చంద్‌ లోని ”చౌద్విన్‌ కా చంద్‌ హౌ” పాటకు, 1961 లో ససురాల్‌ లో ”తేరీ ప్యారీ ప్యారీ సూరత్‌ కో” పాటకు, 1964 లో దోస్తీ లోని ”చాహుంగా మెయిన్‌ తుజే” పాటకు, 1966లో సూరజ్‌ చిత్రంలోని ”బహారో ఫూల్‌ బర్సావో” పాటకు, 1968 లో బ్రహ్మచారి లోని ”దిల్‌ కే ఝరోకే మే” పాటకు, 1977లో హమ్‌ కిసీసే కమ్‌ నహీ చిత్రం లోని ”క్యా హువా తేరా వాదా”కు కలిపి మొత్తం ఆరు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. 2001లో రఫీని హీరో హోండా, స్టార్‌డస్ట్‌ మ్యాగజైన్‌ సంస్థలు ”బెస్ట్‌ సింగర్‌ ఆఫ్‌ ది మిలీనియం” తో సత్కరించాయి. 2013లో హిందీ సినిమాలో గ్రేటెస్ట్‌ వాయిస్‌ కోసం సి.ఎన్‌.ఎన్‌., ఐ.బి.ఎన్‌ పోల్‌లో రఫీ గెలుపొందారు. జూన్‌ 2010లో ఔట్‌లుక్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన పోల్‌లో రఫీ, లతా మంగేష్కర్‌తో పాటు అత్యంత ప్రజాదరణ పొందిన నేపథ్య గాయకుడిగా ఎంపికయ్యారు. అదే పోల్‌ లో రఫీ పాడిన ‘చిత్రలేఖ’ చిత్రంలోని ”మన్‌ రే, తు కహే న ధీర్‌ ధరే” మొదటి స్థానంలో నిలిచింది. 2015లో లండన్‌ వార్తాపత్రిక ఈస్టర్న్‌ ఐ ”గ్రేటెస్ట్‌ 20 బాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్స్‌” జాబితాలో రఫీ మూడవ స్థానంలో నిలిచారు. 2012 లో ”మహ్మద్‌ రఫీ: నా అబ్బా – ఒక జ్ఞాపకం” పేరుతో ‘యాస్మిన్‌ ఖలీద్‌’ రఫీ బయోగ్రపీ తో గ్రంధాన్ని తీసుకురాగా, 2015 లో ”మహ్మద్‌ రఫీ – గోల్డెన్‌ వాయిస్‌ ఆఫ్‌ ది సిల్వర్‌ స్క్రీన్‌” పేరుతో రఫీ జీవిత చరిత్రను ‘సుజాత దేవ్‌’ రచించి ఆయన 91వ పుట్టినరోజున ఆవిష్కరించారు. అలాగే రజనీ ఆచార్య, వినరు పటేల్‌ దర్శకత్వంలో ”దస్తాన్‌-ఇ-రఫీ” పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ 92వ పుట్టినరోజు జ్ఞాపకార్థం విడుదల అయ్యింది. ఇందులో 60కి పైగా బాలీవుడ్‌ నటుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. 100 ఏళ్ల సినీ వేడుకల సందర్భంగా ”బిబిసి ఆసియా నెట్‌వర్క్‌” నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రఫీ ”బహరోన్‌ ఫూల్‌ బర్సావో” పాట అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ పాటగా ఎంపికైంది. కాగా రఫీ మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. భారత పోస్టల్‌ శాఖ 2003 మే 15న మహ్మద్‌ రఫీ స్మారక స్టాంపుతో సత్కరించాగా, 2016 డిసెంబర్‌ 30న మరో పోస్టల్‌ స్టాంపుతో సత్కరించింది.
వ్యక్తిగత జీవితం 
మహ్మద్‌ రఫీ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. అతని మొదటి వివాహం బంధువుల అమ్మాయి ‘బషీరా బీబీ’తో జరిగింది. ఈ వివాహం అతని పూర్వీకుల గ్రామంలో జరిగింది. అయితే భారతదేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో ‘బషీరా బీబీ’ తన తల్లితండ్రులను కోల్పోవడంతో ఆమె భారతదేశంలో నివసించడానికి నిరాకరించి పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్లిపోయింది. దీంతో రఫీ ‘బిల్కిస్‌ బానో’ ను వివాహమాడాడు. రఫీ మొదటి కుమారుడు ‘సయీద్‌’ మొదటి బార్య సంతానం కాగా, ఆ తరువాత ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు జన్మించారు.
జులై 31న తుదిశ్వాస విడిచిన రఫీ 
నాలుగు దశాబ్దాల పాటు భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన గాత్రంతో ఓలలాడించిన మహ్మద్‌ రఫీ.. 1980 జూలై 31న గుండెపోటుతో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. రఫీ ఈ లోకాన్ని వదిలి వెళ్లి 42 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆయన స్వరం ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అందుకే భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆయన అమరగాయకుడిగా నిలిచిపోయాడు. ఆయన పంచిన మధురామతం ఈ నాటికీ ఆనందం పంచుతూనే ఉంది.
-పొన్నం రవిచంద్ర,
9440077499 

Spread the love