ఒప్పించడం ఓ కళ

Persuasion is an artమన రోజు వారి జీవితంలో భాగంగా చాలామంది సహాయం తీసుకోవల్సివస్తుంది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో వారిని మెప్పించి, మనకి కావల్సిన పని గురించి ఒప్పించాల్సి వుంటుంది. అలా ఒప్పించగలిగిన వారు విజేతలుగా నిలుస్తారు. అలా ఒప్పించడం అనేది ఓ కళ. అయితే మీరు ముందుగా మీ మనసును ఒప్పించుకోగలిగితే, ఆ తర్వాత ఎవరినైనా ఒప్పించవచ్చు’ అంటారు పెద్దలు. సాధారణంగా చాలామంది ఎదుటి వ్యక్తిని ఎలా కన్విన్సు చెయ్యాలో తెలియక ఇబ్బంది పడతారు. ఫలితంగా సమస్యలని పరిష్కరించు కోలేకపోతారు. ఒప్పించడం రాకుంటే ఒక సేల్స్‌ పర్సన్‌ తన వస్తువులని అమ్మలేడు, భర్త లేదా భార్య తమ జీవిత భాగస్వామి నుండి సహాయం తీసుకోలేరు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల నుండి తాము కోరుకునే వస్తువులు పొందలేరు.
ఏ విధంగా చూసినా ఈ రోజుల్లో విజయవంతమైన జీవితం గడపడానికి ఇతరులని కన్విన్సు చెయ్యడం చాలా అవసరం. ఉద్యోగం కోసం వెతికే వ్యక్తికి ఇంటర్వ్యూలో విజయానికి కూడా ఈ స్కిల్‌ అవసరం. ఈ రోజుల్లో టెక్నికల్‌ స్కిల్‌ జాబ్స్‌ కన్నా, మేనేజర్‌ జాబ్స్‌ కన్నా, పీపుల్‌ స్కిల్‌ వున్నా వారికే ఎక్కువ డిమాండ్‌ వుంది. ఎందుకంటే ఒక సరైన క్లయింట్‌ని ఒప్పించి తెచ్చే ఉద్యోగి ఆ కంపెనీకి పెద్ద ఆస్థి కాబట్టి.
అయితే ఇక్కడ మనం ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే మనల్ని బలవంతం చేస్తే, ఏ విషయాన్ని కూడా మనస్పూర్తిగా ఒప్పుకోం కదా. అలాగే ఇతరులు కూడా. ఎదుటి వారు మనల్ని మెప్పించి ఒప్పిస్తే మాత్రం, చాలా సంతోషంగా ఒప్పుకుంటాం. అలాగే ఎదుటివారు కోరిన సహాయాన్ని మన పనిలా మనస్ఫూర్తిగా, విజయవంతంగా చేస్తాం. కనుక మనం కూడా ఎదుటి వారిని కన్విన్సు చేయడానికి అదే పద్ధతిని అనుసరించాలి. ఎవరినైతే కన్విన్సు చేయాలనుకుంటున్నామో వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవాలి. ఎలా చెబితే వారు మన మాట వింటారో గుర్తించాలి.
ఇది బయట వారి విషయంలోనే కాదు ఇంట్లో వారి విషయంలో కూడా వర్తిస్తుంది. సాధారణంగా ఇంట్లో వారిని ఏదైనా విషయంపై ఒప్పించాలంటే చాలా మంది తమకున్న పెద్దరికం, అధికారంతో బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఇక పిల్లల విషయంలో అయితే తల్లిదండ్రులుగా మేం చెప్పాం కాబట్టి మీరు ఒప్పుకోవల్సిందే అన్నట్టు ఉంటారు. ఇది సరైనది కాదు. పెద్దల్ని అయినా, పిల్లల్ని అయినా ముందే మీరు చెప్పాలనుకున్నది చెప్పుకుంటూ పోవద్దు. మొదటగా వారికేమైనా సమస్య ఉంటే తెలుసుకోవాలి. వారి అవసరాలేంటో గుర్తించాలి. మీరు చెప్పబోయే విషయం పట్ల వారి అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకోవాలి. వారు చెప్పింది ప్రశాంతంగా వినాలి. ఎప్పుడైతే ఎదుటి వారి అవసరాన్ని, ఆలోచనల్ని వింటామో అప్పుడే వారికి మనం అర్ధం చేసుకున్నామనే భావన వస్తుంది.
ఎవరైనా ఒక విషయం గురించి కొన్ని సందర్భాల్లో లాజిక్‌గా ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్‌గా ఆలోచిస్తారు. అయితే వారి ఆలోచన ఎలా ఉన్నా ఒక ప్రశంస ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మనపైన వారికీ మంచి అభిప్రాయం వస్తుంది. మీరు చెప్పినట్టు వింటే వారికి కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో వివరించాలి. వినకపోతే కలిగే నష్టాలు కూడా చెప్పాలి. తర్వాత నిర్ణయం వారికే వదిలేయాలి. ఇలా చేస్తే కచ్చితంగా మీరు వారిని ఒప్పించగలరు.

Spread the love