ఆగని మృత్యుఘోష

An unceasing death knell– లిబియా జల ప్రళయంలో
– 20 వేలకు చేరిన మృతుల సంఖ్య
డెర్నా : ఆఫ్రికా దేశమైన లిబియాలో తుఫాను, వరదలు భీభత్సం సృష్టించాయి. జల ప్రళయంలో వేలాది మంది మరణించారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య 20,000 చేరినట్టు అంచనా వేస్తున్నారు. డెర్నా వీధులన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. తమ ఆప్తుల కోసం శవాల గుట్టల మధ్య కలియ తిరుగుతున్న దృశ్యాలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. ఆదివారం రాత్రి లిబియా తీర ప్రాంతాన్ని తాకిన డేనియల్‌ తుఫాను కొన్నిగంటల వ్యవధిలోనే తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఆకస్మిక వరదలతో రెండు డ్యాములు కొట్టుకుపోయాయి. తీరప్రాంతాలపై వరద నీరు పోటెత్తడంతో భవనాల్లో నిద్రిస్తున్నవారు నిద్రలోనే మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయారు. మరణించిన వారి సంఖ్య, తప్పిపొయిన వారి సంఖ్య వేలల్లోనే ఉండవచ్చని డేర్నా మేయర్‌ అబ్దుల్‌ మేనమ్‌ తెలిపారు. విపత్తు కారణంగా నగరంలో మరణాల సంఖ్య 18,000 నుంచి 20,000 మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. తప్పిపోయిన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నామన్నారు. అయితే వాస్తవానికి, మృతదేహాలను వెలికితీసేందుకు తమకు ప్రత్యేక బృందాలు అత్యవసరమని అన్నారు. శిథిలాల కింద నీటిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఉన్నందున అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని భయపడుతున్నట్టు తెలిపారు.తన కుటుంబసభ్యులను 50 మందిని కోల్పోయానని హుసాది మీడియాకు వివరించారు. తన భార్య పిల్లలు, ఇతర బంధువుల కోసం పునరావాస కేంద్రాలు, ఆస్పత్రులు అన్నిచోట్ల వెతుకుతున్నాననీ, కానీ ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తనతోటి కార్మికులు, వారి కుటుంబసభ్యులు వరదకు సముద్రంలోకి కొట్టుకుపోయారని మరో వ్యక్తి మొహ్మద్‌ అదమ్‌ తెలిపారు. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వరదనీరు ముంచెత్తిందని అన్నారు.
లిబియాకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. ఈజిప్ట్‌, టునీషియా, యూఏఈ, టర్కీ, ఖతార్‌ నుంచి సహాయక బృందాలు లిబియాకు చేరుకున్నాయి. రెండు ఫీల్డ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన పరికరాలతో కూడిన ఓడను టర్కీ పంపింది. ఇటలీ మూడు విమానాల నిండా అత్యవసర సామగ్రి, సిబ్బందిని, రెండు నౌకలను పంపింది. డెర్నా ఓడరేవు శిథిలాలతో నిండిపోవడంతో అత్యవసరం కావచ్చని పేర్కొంది

Spread the love