నవతెలంగాణ-రాయికల్
మండలంలోని అల్లీపూర్ సెక్టార్ పరిధిలోని కుమ్మరిపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో 8వ పోషణ పక్వాడ సందర్భంగా ప్రీ-స్కూల్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గుమ్మడి సంతోష్ అధ్యక్షతన, సీడీపీవో మమత ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోషణ పక్వాడ కార్యక్రమం ప్రజల ఆరోగ్య మెరుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. వీఎచ్‌ఎస్‌ఎన్‌డీ ద్వారా పిల్లల బరువు, ఎత్తు పరిశీలిస్తూ లోప పోషణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి సమతుల్య ఆహారం అవసరమని, తరచూ చిన్న భోజనాలు, పాలు, పండ్ల రసాలు ఇవ్వాలని సూచించారు. 3-6 సంవత్సరాల పిల్లల అభివృద్ధిని గుర్తించి ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలతో ప్రదర్శనలు నిర్వహించి, పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అన్నప్రసన్న నిర్వహించి గుడ్లు, బాలామృతం, టిహెచ్‌ఆర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధ, అంగన్వాడీ టీచర్లు పద్మావతి, వనిత, ఉప సర్పంచ్ కోడిమ్యాల శేఖర్, ఏఎన్‌ఎమ్ ప్రశాంతి, పంచాయతీ కార్యదర్శి కె.రాజేష్, కరోబార్ రాజేందర్, హెచ్‌ఎం దేవలక్ష్మి, ఆశా వర్కర్లు సుష్మ,రజిత, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.



