నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి, కొన్ని నిర్దిష్ట హామీలు ఇచ్చినందన, నిరవధిక సమ్మె ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రకటించింది. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్ సెంట్రల్ సిటీ జిల్లా కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సునీత అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరంతరం పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. ఆగస్టు 5న హైదరాబాదులో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ఇతర సంఘాలను కూడా కలుపుకొని నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు ఆగస్టు 12న జాయింట్ మీటింగ్ జరిగిందని వివరించారు. ఆగస్టు 18న ఐసిడిఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ అన్ని అంగన్వాడీ సంఘాలతో జాయింట్ మీటింగ్ పెట్టడం సీఐటీయూ పోరాటాల ఒత్తిడి చేసిన ఫలితమేనని అన్నారు. ప్రభుత్వం స్పందించి కొన్ని సమస్యలపై నిర్దిష్ట హామీలు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందనీ, భవిష్యత్తులో వాటి అమలు కోసం మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి మాట్లాడుతూ సెక్రటేరియట్‌లో ఐసిడిఎస్ మంత్రి సత్యవతి రాథోడ్‌తో జరిగిన సమావేశ వివరాలను తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు గతం కంటే ఎక్కువ పీఆర్సీ పెంచుతామనీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రెండు లక్షలు, ఆయాలకు ఒక లక్ష, ఆసరా పెన్షన్ వర్తింప చేస్తామనీ, రెండు లక్షలు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని, మినీ సెంటర్స్ అన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ సెంటర్స్‌గా మారుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామనీ, ఆన్‌లైన్‌లో ఒకటే యాప్ ఉంచి, మిగిలినవి రద్దు చేస్తామని, అంగన్వాడీ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తించే విధంగా సర్క్యులర్ జారీ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రతి నెల 14న వేతనాలు చెల్లించే విధంగా నిర్ణయం చేశామని, మట్టి ఖర్చులు రూ.20 వేలు వచ్చేలా కృషి చేస్తామని, గ్రోత్ మానిటరింగ్ మెటీరియల్స్ నాలుగు సప్లరు చేస్తామన్నారని తెలిపారు. మిగిలిన డిమాండ్స్‌లో… మే నెలలో ఒక నెల అంతా ఎండాకాలం సెలవులు, టిఎ, డిఎ లు ఇతర సమస్యలు పరిశీలిస్తామని మంత్రి చెప్పారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించి కొన్ని సమస్యలపై నిర్దిష్టమైన హామీలు ఇచ్చినందున అంగన్వాడీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేయాలనుకున్న నిరవధిక సమ్మె ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు. సమావేశంలో అంగన్వాడి యూనియన్ రాష్ట్ర కోశాధికారి పీ మంగ, ఉపాధ్యక్షులు వెంకటమ్మ ఈమెలమ్మ, జ్యోతి, సహాయ కార్యదర్శులు జీ పద్మ, నర్సమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.