అంగన్వాడీలకు రూ.26వేల వేతనం చెల్లించాలి

to Anganwadis
Salary of Rs.26 thousand should be paid– అధికారుల బెదిరింపులు సరికాదు
–  సమస్యను పరిష్కరించండి.. : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-నిర్మల్‌/విలేకరులు
”అంగన్వాడీ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి.. నెల రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యను పరిష్కరించకుండా అధికారులు బెదిరింపులకు పాల్పడటం.. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం ఏంటని” సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె మంగళవారం రెండో రోజూ కొనసాగింది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో అంగన్వాడీల సమ్మెకు తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌ (టీచర్స్‌) అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలకిë, పాలడుగు భాస్కర్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులు లేబర్‌ యాక్ట్‌ ప్రకారం నెల రోజుల ముందే ఐసిడిఎస్‌ కమిషనర్‌కు సమ్మె నోటీస్‌ ఇచ్చారన్నారు. అయినా అంగన్వాడీలను అధికారులు బెదిరిస్తున్నారని, సమ్మెను భగం చేసేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి ఐకెపి వివోఏలకు, పంచాయతీ సెక్రెటరీలకు అప్పజెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఎవరి పని వారే చేయాలని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తోందని విమర్శించారు. పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం, పెన్షన్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ టీచర్లకు రూ.10లక్షలు, హెల్పర్లకు రూ.5లక్షలు చెల్లించాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం రూ.5లక్షలు చెల్లించాలని కోరారు. సమ్మె నోటీసులో తెలియజేసిన ఇతర డిమాండ్స్‌ అన్నింటినీ పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్‌, జిల్లా అధ్యక్షులు పి.గంగామణి, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రాజమణి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌, చేవెళ్లలో సమ్మెకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లను ప్రభుత్వం బెదిరించడం సరికాదన్నారు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఆరాంగర్‌ చౌరస్తాలో అంగన్‌వాడీలు రాస్తారోకో చేశారు. శేరిలింగంపల్లి పరిధిలోని అంగన్‌వాడీలు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి వినతిపత్రం అందజేశారు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాజెక్టు పరిధిలో రెండో రోజు కొనసాగుతున్న సమ్మె శిబిరాన్ని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నాయకులు పి.నాగమణి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్‌ను బెదిరించడం కాదు సమస్యను పరిష్కరించండని డిమాండ్‌ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, పినపాకలో సీపీఐ(ఎం) నాయకులు మద్దతు తెలిపారు. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేటలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిల్వ ఉన్న సరుకులను సీడీపీవో స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లి మండలం మాధారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం తాళం పగలగొడుతున్న సీడీపీవోను సీపీఐ(ఎం) నాయకులు అడ్డుకున్నారు. భద్రాచలంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు దీక్షను ప్రారంభించారు.

Spread the love