– త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి
నవతెలంగాణ-రామచంద్రాపురం
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. మరో రెండు రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని ఆశోక్‌నగర్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేండ్లు కష్టపడ్డానని, కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదన్నారు. స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తే.. బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు. ఐదేండ్ల క్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని.. కానీ ఆనాడు, నేడు తనకు మోసమే జరిగిందన్నారు. ఏఐసీసీ పెద్దలు తనను పలకరించారని, కానీ, ఇంత జరిగినా రాష్ట్ర నాయకత్వం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్థాపం చెంది కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని అందజేస్తున్నానన్నారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నర్సా పూర్ మండల మైనారిటీ ప్రెసిడెంట్ అజమాత్ అలీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.