చిలీలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం!

Another anti-communist campaign in Chile!ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన చిలీ నియంత పినోచెట్‌ చచ్చి పద్దెనిమిదేండ్లు అవుతున్నా, వాడి వారసులు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల పూర్వరంగంలో మరోసారి కమ్యూనిస్టుల మీద విరుచుకుపడుతున్నారు. చిలీలో ఆశ్రయం పొందిన వెనెజులా సోషలిస్టు వ్యతిరేక మిలిటరీ అధికారి ఒకడు ఇటీవల హతుడయ్యాడు. కమ్యూనిస్టులే చంపారంటూ చిలీ మీడియా, పినోచెట్‌ వారసులైన ప్రతిపక్ష పార్టీ కూటమి తప్పుడు ప్రచారం ప్రారంభించింది. కమ్యూనిస్టుల విశ్వసనీయత ప్రశ్నించరానిదని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ బహిరంగంగా సమర్ధించాడు. వామపక్ష సంఘటన ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రధాన భాగస్వామిగా ఉంది. పార్లమెంటులోని 155 స్థానాలకుగాను అధికార కూటమికి 37, దానికి మద్దతు ఇస్తున్న కూటమికి మరో 37 ఉన్నాయి. వాటిలో సోషలిస్టులకు 13, కమ్యూనిస్టు పార్టీ 12సీట్లతో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. లాటిన్‌ అమెరికాలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మితవాద శక్తుల ప్రధాన ఆయుధం కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఒకటన్నది తెలిసిందే. అనేక దేశాల్లో నిరంకుశ, మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోషలిస్టులు, కమ్యూనిస్టులు అధికారానికి వస్తే క్రైస్తవమతానికి, ధనికుల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో చేస్తున్నారు. నాజీ గోబెల్స్‌ను మించి అవాస్తవాలను ప్రచారంలో పెడుతున్నారు.
2017లో వెనెజులా నుంచి పారిపోయి వచ్చి చిలీలో ఆశ్రయం పొందిన మిలిటరీ మాజీ అధికారి రోలాండ్‌ జెడాను కొద్ది రోజుల క్రితం కొందరు అపహరించి హత్యచేశారు. దీని వెనుక కమ్యూనిస్టులు ఉన్నారని, దేశంలో హింసాకాండ సృష్టికి కుట్రలు పన్నుతున్నారంటూ అనేక పత్రికలు, ప్రతిపక్ష మితవాద పక్షాలు ఎలాంటి ఆధారం లేకుండా ధ్వజమెత్తుతున్నాయి. జనంలో అనుమానాలు కలిగించే రీతిలో కథనాలు అల్లుతున్నాయి. ఈ శక్తులన్నీ నియంత పినోచెట్‌ హయాంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఇతర ప్రజాస్వామికవాదుల అణచివేత, అపహరణలను సమర్ధించినవే. మార్క్సిస్టు కాన్సర్‌ను అంతమొందించాలనే పేరుతో పినోచెట్‌ మిలిటరీ పాలకులు వేలాది మంది కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులను హతమార్చారు, అనేక మంది జాడలేకుండా చేశారు. చిత్రహింసలు, జైళ్లపాలు సరేసరి. 1983లో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 20 మంది కమ్యూనిస్టు నేతలను హత్యచేశారు. తరువాత ముగ్గురు నేతల నాలుకలను చీల్చి చిత్రహింసలకు గురిచేశారు. పినోచెట్‌ పాలనలో నాలుగువేల మంది అపహరణలకు గురయ్యారు. కనీసం ఇరవై వేల మంది పిల్లలను అపహరించి విదేశాల్లో చట్టవిరుద్ద దత్తతకు సహకరించారనే విమర్శలున్నాయి. వాటి గురించి దర్యాప్తు జరపాలని, నిజాల నిగ్గుతేల్చాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.
చిలీలో నియంతృత్వం ఉన్నకాలంలో కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. ప్రజల తరఫున పోరాడేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసింది. నియంతల పాలన అంతరించిన తరువాత కమ్యూనిస్టులు తిరిగి బహిరంగంగా పనిచేయటం ప్రారంభించారు. ప్రస్తుతం 46,023 మంది సభ్యులతో దేశంలో అతిపెద్ద పార్టీగా ఉంది. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధి బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే వామపక్ష కూటమిలోని పార్టీల అభిప్రాయం మేరకు గాబ్రియెల్‌ బోరిక్‌ పోటీ చేసి 2021 ఎన్నికల్లో గెలిచారు. హతుడైన వెనెజులా మాజీ మిలిటరీ అధికారికి వెనెజులాలో అనేక మందిని హతమార్చిన చరిత్ర ఉంది. హత్యవెనుక వెనెజులా హస్తం ఉందని, దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఖండించటంలో గొంతుకలపాలని చిలీ మితవాద పార్టీలు చేసిన డిమాండ్‌ను కమ్యూనిస్టు పార్టీ తిరస్కరించింది. కమ్యూనిస్టుల మీద విషం చిమ్మటానికి ఇదొక కారణమని చిలీ మంత్రి, కమ్యూనిస్టు నేత గామిలా వలేజో చెప్పారు. పార్లమెంటులో ఉన్న బలంతో గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి అనేక ఆటంకాలు కలిగిస్తున్న ప్రతిపక్షాలు కమ్యూనిస్టు పార్టీ మీద విషం చిమ్మటంలో ఆశ్చర్యం ఏముందని కమ్యూనిస్టు పార్టీ ఎంపీ, విద్యార్ధి సంఘమాజీ నాయకురాలు కరోల్‌ కారియోలా చెప్పారు. భాగస్వామ్య పక్షాల అవగాహన మేరకు పార్లమెంటు సభాధ్యక్ష స్థానాన్ని కమ్యూనిస్టులు చేపట్టనున్న పూర్వరంగంలో పార్టీ మీద దాడికి దిగినట్లు చెప్పారు.
అంతరంగంలో గూడు కట్టుకున్న కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రతిపక్షాలు వెల్లడిస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా వ్యక్తులు, సంస్థలు ఎవరిమీదనైనా భయంకరమైన ఆరోపణలు చేయగల సమర్ధత కలిగినవి.వాటి పర్యవసానాలు వాటికి పట్టదు. ఊహాజనితమైన ఆరోపణలు చేస్తున్నాయి. చరిత్రలో చిలీ కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామిక నిబద్దతను ఎవరూ సందేహిం చాల్సిన అవసరం లేదు. అది ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ తెలుసు. ప్రజాస్వామిక పోరాటాల్లో తమదైన ముద్రను వారు ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణను వారెన్నడూ వీడలేదు. ఆ క్రమంలో నిరంతరం భాగస్వాములుగానే ఉన్నారు. వ్యవస్థా పరమైన చట్రానికి అనుగు ణంగా వారు సర్దుబాటు చేసుకొని నడుచుకుం టున్నారు. అందువల్లనే కమ్యూనిస్టుల మీద జరుపుతున్నదాడిని కాకమ్మ కథలుగా చూస్తున్నాను అని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెప్పాడు. కమ్యూనిస్టులు న్యాయం, సమానత్వం, హక్కులకు అంకితమయ్యారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు, ఆదర్శ సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు దేశంలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల వివక్ష, అణచివేతను నిర్మూలించాలన్నదే తమ లక్ష్యమని కూడా చెప్పారు.జనం, సమాజ కేంద్రంగా ఉండాలని, జీవితాలు మెరుగుపడాలని మేం కోరుతుండగా నయా ఉదారవాదం ప్రజలు, వారి హక్కుల కంటే పెట్టుబడికి పెద్ద పీటవేస్తున్నదని బోరిక్‌ చెప్పాడు. ప్రభుత్వ ఏర్పాటు ఒప్పందంలో భాగంగా ప్రజాప్రతినిధుల సభ అధ్యక్ష పదవిని కమ్యూనిస్టులకు అప్పగించాల్సి ఉంది. దానికి అనుగుణంగా నిర్ణయించా మని, గౌరవిస్తామని అన్నాడు. ఆ పదవిలో ఎవరు అన్నది సమస్యే కాదు, పార్లమెంటులోని సహచరులందరూ సమర్ధులే, వ్యక్తులు దొరుకుతారా లేదా అన్నది కాదు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి గనుక ఎవరున్నా ఇబ్బంది ఉండదన్నాడు.
ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలకు సామాజిక ఉద్యమాల ద్వారా మద్దతు కూడగట్టాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇవ్వటం పార్లమెంటులోని మితవాద శక్తులకు కంటగింపుగా మారింది. చిలీ పార్లమెంటులో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం అధికారంలో ఉన్న కూటమి ప్రతిపాదించే విధానాలు ఓటింగ్‌లో వీగిపోయే అవకాశం ఉంది. చట్టాలు, విధానాలను రూపొందించాల్సిన బాధ్యత చట్టసభలది తప్ప సామాజిక మద్దతు పేరుతో ఒత్తిడి తేవటం ఏమిటని మితవాదశక్తులు, వాటికి మద్దతుగా ఉన్న మీడియా,వాదిస్తున్నాయి. అందులో తప్పేం ఉందని అధ్యక్షుడు బోరిక్‌ ప్రశ్నించాడు. ఆ ఉద్యమాలు ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించినట్లయితే ఆహ్వానించాల్సిందే అన్నాడు. అబార్షన్‌ మీద చేసిన చట్టం వెనుక మహిళా ఉద్యమాల సమీకరణ లేదా అని ప్రశ్నించాడు. విద్యార్ధి ఉద్యమం ఉచిత విద్య కోసం పోరాడిందని, నూతన రాజ్యాంగం సామాజిక ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నదని, ప్రజాస్వామిక పద్దతుల్లో సామాజిక చర్చ జరగాలన్నాడు. వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన తరువాత ప్రతిపాదించిన ప్రజానుకూల సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లలేని వాస్తవ పరిస్థితి పార్లమెంటులో ఉంది. దానిలో భాగంగానే ధనికుల నుంచి పన్ను వసూళ్లను పెంచే ప్రతి పాదన పార్లమెంటు ముందుంచగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కార్పొరేట్‌, ధనికులకు మద్దతుగా నిలిచాయి. పెన్షన్ల పెంపు, పెన్షన్‌ హామీ, సంరక్షణ వంటి పధకాలకు అవసరమైన నిధులను సేకరించేందుకు కలిగిన వారి మీద పన్ను పెంచాలని వామపక్ష ప్రభుత్వం ప్రతిపాదించింది. దాన్ని అడ్డుకోవటం అంటే పౌరుల సామాజిక హక్కుల మీద దాడి చేయటమే. అందుకే అలాంటి పార్టీల మీద ఒత్తిడి తేవాలంటే పార్లమెంటుతో పాటు వెలుపల ప్రజా ఉద్యమాలను నడపాలని కమ్యూనిస్టు పార్టీ కోరింది. దీని మీద ఆగ్రహిస్తున్న మీడియా వెనెజులా మిలిటరీ మాజీ అధికారి హత్యను సాకుగా తీసుకొని కమ్యూనిస్టుల మీద తప్పుడు ఆరోపణలతో దాడికి దిగింది.
గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో 2021 డిసెంబరు 19న జరిగిన చిలీ మలివిడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. డిసెంబరు 19న తుది పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత ‘నయా ఉదార వాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే’ అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.
1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయా ఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది. మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు. ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్ధ్దతి ప్రకారం కమ్యూనిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో దామాషా ప్రాతిపదికన 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే. ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్న ఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్థానాలను గెలుచుకున్నారు. నూతన రాజ్యాంగ ప్రతిపాదనపై 2022లో జరిగిన ఓటింగ్‌ తిరస్కరణకు గురైంది. దాన్ని వామపక్ష వాదులు ప్రతిపాదించినట్లు ప్రచారం చేశారు. తరువాత 2023 డిసెంబరులో రెండవ రాజ్యాంగం గురించి జరిగిన ఓటింగ్‌లో మరోసారి తిరస్కరణకు గురైంది. దానిలో మితవాద ముద్ర ఉండటంతో వామపక్ష శక్తులు వ్యతిరేకించాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు, నూతన రాజ్యాంగం వంటి అంశాలలో మితవాద శక్తులు ఇప్పటి నుంచే వామపక్షాలను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి. దానిలో భాగంగానే పెద్ద పార్టీగా ఉన్న కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. వాటిని వామపక్షాలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఆసక్తిగా మారింది.
ఎం. కోటేశ్వరరావు
83331013288

Spread the love