ఆర్ అండ్ బీ ఈఎన్ సీ అక్రమాస్తులు వంద కోట్ల పైనే
ఏసీబీ దాడుల్లో వెల్లడి
నవతెలంగాణ ప్రత్యేక – ప్రతినిధి
రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో ఛీఫ్ ఇంజనీరుగా పని చేస్తున్న మోహన్ నాయక్ అవినీతి అక్రమాలకు పాల్పడి దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీ మంగళవారం జరిపిన అకస్మిత దాడులో వెల్లడైంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా తెలిపిన వివరాల ప్రకారం ఆర్ అండ్ బి లో ఛీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మోహన్ నాయక్ అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీకి విశ్వసనీయ సమాచారం అందింది. దీనితో తమ విభాగానికి చెందిన ప్రత్యేక టీమ్ లను చారు సిన్హా రంగంలోకి దించారు. వీరు మోహన్ నాయక్ కు చెందిన ఇల్లు, ఇతర ఆస్తులతో పాటు అతని సమీపబంధువులు, స్నేహితులు,బినామీల ఆస్తులపై మెరుపు దాడులను నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లోని మోహన్ నాయక్ కు చెందిన 15 ఆస్తులపై ఈ దాడులను కొనసాగించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగాయి. ఇందులో మోహన్ నాయక్ కు చెందిన స్థిర, చర, ఆస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలో రూ. 82,89,750/- లక్షల విలువైన 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 7,34,73,867/- కోట్ల విలువైన కొంపల్లిలోని 3 ఫ్లాట్లు,గచ్చిబౌలిలోని 4 ఫ్లాట్లను ఏసీబీ అధికారులు కనుగొన్నారు.
అలాగే మియాపూర్ లో రూ.2,50,00,000/- విలువైన 3x విల్లా, కూకట్ పల్లిలో కొత్తగా నిర్మించిన రూ.62,14,000/- విలువైన కొత్త ఇల్లు తో పాటు నిజామాబాద్ లో కొత్త ఇంటి నిర్మాణం కోసం నాయక్ చెల్లించిన కోటి రూపాయల నగదు రసీదు కూడా ఏసీబీ కి చిక్కాయి. దీంతోపాటు అతని నివాసం లో 55 లక్షల రూపాయల విలువైన నగదు, రూ.1.44 కోట్ల బ్యాంకు బాలన్స్ , రూ.2 కోట్ల విలువైన 2500 గ్రాముల బంగారు నగలు, రూ.3.60 లక్షల విలువైన 6000 గ్రాముల వెండి నగలు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. 1,26,00,000/- కోట్ల విలువైన గృహోపకరణ వస్తువులు,11 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ. 25 లక్షల విలువైన 2 వాహనాలు కూడా నాయక్ కు చెందినవిగా తేలాయి. వీటి విలువ రూ.17,94,62,617/- కోట్ల రూపాయలుగా అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో వంద కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇంకా మోహన్ నాయక్ అక్రమాస్తుల గురించి దర్యాప్తు సాగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేశామని, నిందితుని అరెస్ట్ చేసి ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరిచామని అధికారులు తెలిపారు.



