‘హస్తం’ ఖాతాలో మరో కార్పొరేషన్‌

'హస్తం' ఖాతాలో మరో కార్పొరేషన్‌– బోడుప్పల్‌లో నెగ్గిన అవిశ్వాసం
– మేడ్చల్‌ జిల్లాలో మల్లారెడ్డికి షాక్‌
నవతెలంగాణ-బోడుప్పల్‌
కాంగ్రెస్‌ ఖాతాలోకి మరో కార్పొరేషన్‌ చేరింది. మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి తన సొంత నియెజకవర్గంలో భారీ షాక్‌ తగిలింది. శనివారం బోడుప్పల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మిగౌడ్‌పై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్‌ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో మొత్తం 28 మంది సభ్యులకుగాను 22 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. అనంతరం ఎజెండా ప్రకారం 11 గంటలకు మేయర్‌ బుచ్చిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. అందుకు అనుకూలంగా హాజరైన సభ్యులందరూ ఆమోదం తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్టుగా అధికారులు ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
త్వరలో కొత్త మేయర్‌ ఎన్నిక
బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా బోడుప్పల్‌ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ తోటకూర అజరు యాదవ్‌ పేరును కాంగ్రెస్‌ ప్రకటించింది. కలెక్టర్‌ ఆదేశాల మరకు తేదీ నిర్ణయం కాగానే మేయర్‌గా అజరు యాదవ్‌ను ఎన్నుకుంటారని కాంగ్రెస్‌ నేతలు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ తెలిపారు. రెండ్రోజుల్లో డిప్యూటి మేయర్‌ పేరును ప్రకటిస్తామన్నారు. డిప్యూటీ మేయర్‌ విషయంలో పోటీ అధికంగా ఉందని చెప్పారు. కాగా, డిప్యూటీ మేయర్‌ కోసం కొత్త స్రవంతి కిషోర్‌ గౌడ్‌, బొమ్మక్‌ కళ్యాణ్‌ పోటీ పడుతున్నట్టు సమాచారం.

Spread the love