మరో మ్యాచ్‌ రీ షెడ్యూల్‌!

కాళీ పూజతో పాక్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ మార్పు కోల్‌కత : అసలే ఆలస్యంగా షెడ్యూల్‌ విడుదల, ఆపై వరు సగా పర్వదినాల కారణంగా కీలక మ్యాచుల్లో మార్పులు చేయా లంటూ వినతి. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటుంది. గల్లీ క్రికెట్‌ తరహాలో రోజుకో మ్యాచ్‌ను రీ షెడ్యూల్‌ చేయాలని రాష్ట్ర క్రికెట్‌ సంఘాల నుంచి బీసీసీఐ, ఐసీసీకి అభ్యర్థనలు అందుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ సైతం చేరింది. నవంబర్‌ 12న ఇంగ్లాండ్‌, పాక్‌ జట్లు కోల్‌కతలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో తలపడాలి. కానీ ఆ రోజు కాళీమాత పూజ ఉండటంతో క్రికెట్‌ మ్యాచ్‌కు భద్రత కల్పించటం కోల్‌కత పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. తాజాగా కోల్‌కత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని ఐసీసీ బృందం పర్య వేక్షించగా.. ఈ సందర్భంగా నవంబర్‌ 12న మ్యాచ్‌ను రీ షెడ్యూల్‌ చేయాలనే ప్రతిపాదన ఐసీసీ దృష్టికి వెళ్లిందని తెలుస్తోంది. దీనిపై బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు పండుగ కారణంగా అహ్మదాబాద్‌లో అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అక్టోబర్‌ 14కు మార్పు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లో జరగాల్సిన పాకిస్థాన్‌, శ్రీలంక మ్యాచ్‌ను సైతం అక్టోబర్‌ 10కి మార్పు చేయనున్నారు. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఆడుతున్న మూడు మ్యాచులను రీ షెడ్యూల్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది. త్వరలోనే ఐసీసీ, బీసీసీఐ ప్రపంచకప్‌ రీ షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

Spread the love