టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు

TSPSCనవతెలంగాణ – హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో సిట్‌ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన ఎం.నాగరాజు అనే యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో హైటెక్‌ మాస్ కాపీయింగ్‌కు పాల్పడి అరెస్ట్ అయిన ఏఈ రమేష్ నుంచి సేకరించిన సమాచారంతో పాటు సెల్‌ఫోన్‌లోని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సిట్.. తాజాగా నాగరాజును అరెస్ట్ చేసింది. మున్సిపల్ ఏఈ పరీక్ష ప్రశ్నా పత్రాన్ని  రమేష్ నుంచి కొనుగోలు చేసేందుకు నాగరాజు 30 లక్షలు  ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా కొంత మొత్తాన్ని రమేష్‌కు బదిలీ చేశాడు. అనంతరం పరీక్ష రాసిన నాగరాజు… 16వ ర్యాంకు సాధించాడు. దర్యాప్తులో భాగంగా నాగరాజు కోసం రామాపురం వెళ్లిన సిట్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. గతంలోనే రమేష్ 30 మందికి పేపర్ విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అతని వద్దనుంచి పేపర్‌ను కొనుగోలు చేసిన వారిని పోలీసులు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు.

Spread the love