విద్యా కాషాయీకరణ దిశగా మరో అడుగు

– ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగుజాడల్లో ఎన్‌సీఈఆర్టీ
– ఇండియా స్థానంలో భారత్‌ పేరు మార్పును వెనక్కి తీసుకోవాలి :
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో విద్యారంగం కాషాయీకరణ దిశగా మరో అడుగు ముందుకు పడిందని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. పాఠ్యాంశాలను కాషాయీకరణ చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగుజాడల్లో జాతీయ విద్యా పరిశో ధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) పనిచేస్తున్నదని తెలిపింది. ఇండియా స్థానంలో భారత్‌ అనే పేరు మార్పు చేయాలన్న నిర్ణయాన్ని ఎన్‌సీఈఆర్టీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాంఘిక శాస్త్రం సిలబస్‌ రూపొందించే కమిటీ 12వ తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్‌ అనే పేరుతో పిలవాలని సూచించిందని తెలిపారు. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైందని విమర్శించారు. ఇప్పటికే న్యూఢిల్లీలో జరిగిన జీ-20 సమ్మిట్‌ సమయంలో చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఇందులోనే ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని పంపి వివాదానికి బీజేపీ ప్రభుత్వం తెర లేపిందని విమర్శించారు. దానికి కొనసాగింపు గా విద్యార్థుల పాఠ్యాంశాల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ తన ఎజెండాను అమలు చేసేలా చూడ్దానికి ఈ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. అందుకే ప్యానెల్‌ చైర్మెన్‌ అయిన చరిత్రకారుడు, ప్రొఫెసర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త అయిన ఇస్సాక్‌ (రిటైర్డ్‌), నేతృత్వంలోని ప్యానెల్‌ సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల్లో ‘హిందూ పరాజయాలు’పై ఉన్న ప్రాధాన్యతను తగ్గించాలంటూ సిఫారసు చేసిందని పేర్కొన్నారు. ఎన్‌సీఈఆర్టీ సూచనలు భారత రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 1(1) స్పష్టంగా, ఇండియా అంటే భారత్‌, రాష్ట్రాల యూనియన్‌గా పేర్కొందని గుర్తు చేశారు. దేశంలో అనేక సంస్థలు, రాజకీయ పార్టీలు ‘ఇండియా’ పేరు ను చేర్చుకున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కమిటీ పాఠ్యాంశాల్లో ఇలాంటి సిఫారసు చేయడం గందరగోళాన్ని సృష్టించే అవకాశ ముందని పేర్కొన్నారు. వాస్తవానికి, అధికార బీజేపీకి ‘భారత్‌’, ఇండియా రెండింటి పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శిం చారు. ఈ పేరు మార్పు అనేది ప్రధానంగా రాజ కీయ దురుద్ధేశాలను రెచ్చగొట్టి వారికి అనుకూలంగా మార్చుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ చేసిన వ్యూహమని తెలిపారు. ఎన్‌సీఈఆర్టీ ప్రతిపాదనను తిరస్కరించా లని దేశ ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు.

Spread the love