కోటా: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 25కి చేరింది. వివరాల్లోకి వెళ్తే.. రాంచి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని శిక్షణ కోసం హాస్టల్‌లో ఉంటోంది. ప్రవేశ పరీక్షకు సిద్దమవుతోన్న ఆమె..మంగళవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వివిధ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’ లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ క్రమంలో అక్కడ చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.కోటా అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2022 లో 15 , 2019 లో 18, 2018 లో 20, 2017 లో ఏడుగురు, 2016 లో 17, 2015 లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటితోపాటు అనేక ఘటనల్లో విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలూ ఉన్నాయి. 2023లోనే అత్యధికంగా ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం రెండు నెలలపాటు కోటాలోని శిక్షణా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి టెస్టులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సెప్టెంబరు, అక్టోబరులో విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని జిల్లా అధికారులు తెలిపారు.మరోవైపు విద్యార్థుల బలవన్మరణాలను ఆపేందుకు కోటాలోని వసతి గహాల్లో , భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చుతున్నారు. భవనాల పై అంతస్తు నుంచి దూకినా గాయపడకుండా కింద ఆవరణల్లోనూ వలలు కడుతున్నారు.