నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డిఎంకె ఎమ్మెల్యే అనిత ఆర్. రాధాకృష్ణన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను పరిశీలించిన జడ్జి జి.కె.ఇళంతిరైయన్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికైన ముఖ్యమంత్రి పట్ల మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అంతటి అవమానకరమైన భాషను ఎలా మాట్లాడగలరని జడ్జి ప్రశ్నించారు. ఆయన సామాన్య వ్యక్తి కాదు కదా.. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు లేదా అని జడ్జి ఎమ్మెల్యేను నిలదీశారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పిటిషన్‌ను తిరస్కరించారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కొద్దిసేపటికే పోలీసులు సదురు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.
కాగా, జూన్ 22న సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ షేర్ చేశారు. అయితే, తిరుచెందూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆ తర్వాత ఆత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆ పోస్ట్‌ను ప్రస్తావిస్తూ నటి త్రిష, సీఎం విజయ్‌ల వ్యక్తిగత జీవితంపై తీవ్ర పరువు నష్టం కలిగించేలా, అవమానకరమైన రీతిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, తాజాగా అరెస్ట్ చేశారు.



