ఎన్జీటీ ప్రమాణాలను ఏపీ పాటించడం లేదు

– కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
– ఎస్‌ఆర్‌ఎంసీ లైనింగ్‌ పనులు ఆపాలంటూ ఈఎన్సీ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జారీచేసిన మ్రార్గదర్శకాలను పాటించడం లేదని తెలంగాణ సాగునీటి పారుదల అభివృద్ధి, ఆయకట్టు శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ కృష్ణా యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేఆర్‌ఎంబీ చైర్మెన్‌కు లేఖ రాశారు. అనేక అంశాలను ఈ లేఖలో వివరించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా అదనపు నీటిని తరలించేందుకు శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(కేఆర్‌ఎంసీ) లైనింగ్‌ పనులు జరుగుతున్నాయంటూ తప్పుబట్టారు. కేఆర్‌ఎంసీ ద్వారా నీళ్లు తీసుకుపోవద్దంటే 2021లోనే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ పనులను ఆపాలని గతంలో ఎన్జీటీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. కృష్ణా నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ ద్వారా తరలిస్తున్నారని చెప్పారు.1977లో చేసుకున్న అంత:రాష్ట్ర ఒప్పందం ప్రకారం 1500 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ ద్వారా తరలించే అధికారం లేదని చెప్పారు. రిజర్వాయర్‌లో ఉన్న నిల్వల ప్రకారమే తరలింపుల ఉంటుందన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను సైతం పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే చేపట్టాలనే సంగతిని ఎన్జీటీ గతంలోనే చెప్పిందన్నారు. ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటూనే కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజల న్యాయమైన ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love