నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తులు

– ఆన్‌లైన్‌లో స్వీకరణ గడువు 5
– 15న జీహెచ్‌ఎంల బదిలీలు
– వెంటనే పాఠశాలల్లో రిపోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆదివారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈనెల ఐదో తేదీ వరకు ఉన్నది. వచ్చేనెల మూడో తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతుల ప్రక్రియను చేపడతారు. బదిలీ అయిన పాఠశాలల్లో వెంటనే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఒకే పాఠశాలలో సెప్టెంబర్‌ ఒకటి నాటికి కనీసం రెండేండ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఒకే పాఠశాలలో గెజిటెడ్‌ హెచ్‌ఎంలు ఐదేండ్లపాటు మిగతా ఉపాధ్యాయులు ఎనిమిదేండ్లు పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఉద్యోగ విరమణకు మూడేండ్లలోపు సర్వీసు ఉన్న వారికి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ వారి ఇష్ట ప్రకారం బదిలీ ఉంటుంది. తొలుత ఈనెల 15న గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల (జీహెచ్‌ఎం)కు బదిలీలుంటాయి. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. అనంతరం స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు చేపడతారు. ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు. ఆ తర్వాత ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు. వచ్చేనెల మూడున ఎస్జీటీలకు స్థానచలనం ఉంటుంది. అదేనెల ఐదు నుంచి 19 వరకు అభ్యంతరాలపై అప్పీళ్లు చేసుకునేందుకు అవకాశమున్నది.

Spread the love