Sunday, May 31, 2026
E-PAPER
Homeఆదిలాబాద్స్త్రీనిధి నియామకాల్లో ఇష్టారాజ్యం

స్త్రీనిధి నియామకాల్లో ఇష్టారాజ్యం

- Advertisement -

 నవతెలంగాణ: సిర్పూర్ (టి ):  స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్‌లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతోందని నిరుద్యోగ యువత ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ జీవో నెం.86 జారీ చేసినప్పటికీ, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకాల్లో మాత్రం కేవలం 30 సంవత్సరాల వయోపరిమితినే అమలు చేయడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసే అవకాశాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వం హయాంలో దశాబ్దకాలంగా నిర్ణీత సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత వయోపరిమితి కారణంగా ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ నెల 18న ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ జీవో నెం.86 జారీ చేయడాన్ని స్వాగతించిన నిరుద్యోగులు, అదే సడలింపును స్త్రీనిధి నియామకాల్లో కూడా అమలు చేయాలని కోరుతున్నారు.

ఇటీవల విడుదల చేసిన స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో గరిష్ఠ వయోపరిమితిని 30 సంవత్సరాలుగా పేర్కొనడమే కాకుండా, మే 29ను దరఖాస్తుల చివరి తేదీగా నిర్ణయించడం వల్ల అనేక మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు. వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచి, దరఖాస్తు గడువును పొడిగించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో ఎం.ఎస్. నెం.33 (30 సెప్టెంబర్‌ 2022) ద్వారా విద్యాసంస్థలు, ప్రభుత్వ నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, స్త్రీనిధి నియామకాల్లో మాత్రం ఇప్పటికీ పాత 6 శాతం రిజర్వేషన్లనే అమలు చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

2025-26 మార్చిలో జరిగిన స్త్రీనిధి జనరల్ బాడీ సమావేశంలో మొత్తం 163 ఖాళీల భర్తీకి సభ్యులు ఆమోదం తెలిపినప్పటికీ, అనంతరం ఏప్రిల్‌ 29 మరియు మే 9 తేదీల్లో విడుదల చేసిన నోటిఫికేషన్లలో కేవలం 153 పోస్టుల భర్తీకే అవకాశం కల్పించారని తెలిపారు. మిగిలిన 10 పోస్టులను మంత్రుల పేషీల సిబ్బంది, రాజకీయ నాయకుల అనుచరులకు కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక 2018 నుంచి ఇప్పటివరకు స్త్రీనిధిలో సుమారు 450 మంది సిబ్బంది రాజీనామా చేశారని, అందులో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. మాజీ మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి వేధింపుల కారణంగానే ఈ రాజీనామాలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయమై గతంలో రాజీనామా చేసిన అభ్యర్థులు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్త్రీనిధి నియామకాల్లో జీవో నెం.86 ప్రకారం వయోపరిమితి సడలింపు, జీవో నెం.33 ప్రకారం ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ-ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, బీసీలకు 27 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలను విస్మరించి పాత రోస్టర్ పాయింట్ల ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయమని నిరుద్యోగులు విమర్శించారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం మే 22న పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు వినతిపత్రం సమర్పించినట్లు నిరుద్యోగ యువత తెలిపారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని స్త్రీనిధి నియామకాల్లో న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -