బ్యాంకుల రుణ ప్రణాళిక ప్రకటనలకే పరిమితమా?

 రైతులందరికి పంట రుణాలు ఇవ్వాలి: తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రతియేటా బ్యాంకులు ప్రకటిస్తున్న రుణ ప్రణాళిక ప్రకటనలకే పరిమితమవుతున్నాయని తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడింది. రైతులందరికీ పంట రుణాలివ్వాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు శనివారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది మొదట రూ.82వేల కోట్లు ప్రకటించి, దాన్ని రూ.67,885 కోట్లకు తగ్గించారని విమర్శించారు. వాస్తవంగా ఇచ్చింది రూ.59,060 కోట్లేనని పేర్కొన్నారు. బుక్‌ అడ్జెస్టుమెంటు ద్వారా పాత అప్పులను తిరగరాసి అప్పులు ఇచ్చిన్నట్లు చూపుతున్నారని తెలిపారు. వాస్తవానికి రైతులకు ఇచ్చిన అప్పులు రూ. 37,000 కోట్లకు పరిమితమవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి రైతులకు రూ.21,607 కోట్లు నాలుగు విడతలుగా విడుదల చేస్తానని ప్రకటించిందని గుర్తు చేశారు. విడతలుగా రూ.50వేల లోపు బాకీ ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగిలిన రైతులకు రుణమాఫీ జరగలేదనీ, వారికి తిరిగి పంట రుణాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులు ఉండగా బ్యాంకులు 43 లక్షల మందికి మాత్రమే పంట రుణాలు ఇస్తున్నారని తెలిపారు. మిగిలిన 21 లక్షల మందికి భూములు ఉన్నప్పటికీ వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతి బ్యాంకు బ్రాంచీ ఏటా 100 మంది కొత్త సభ్యులకు అప్పులు ఇవ్వాలని రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆదేశించినా అమలు కావడం లేదని గుర్తు చేశారు. ప్రతి ఏటా 5.35 లక్షల మంది కొత్త వారికి రుణాలు ఇవ్వాలనీ, కానీ బ్యాంకులు కొత్త సభ్యులకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేవని అభిప్రాయపడ్డారు. రిజర్వుబ్యాంకు ఆదేశాలను పాటించని బ్యాంకులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ.8.13 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీని ప్రకారం రూ.1.23 లక్షల కోట్లు పంట రుణాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. దళితులకు మొత్తం పంట రుణాలలో 15 శాతం రుణాలు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. కౌలు, పోడు సాగుదారులకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఏ నిబంధనలు పాటించని బ్యాంకులపై ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ స్థాయిలో బ్యాంకర్ల సమావేశం జరిపి రాష్ట్ర రుణ ప్రణాళికను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకర్ల సమావేశాలకు రైతు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని నిబంధన ఉన్నప్పటికీ వారిని పిలువడం లేదని విమర్శించారు. ప్రభుత్వం విజిలెన్స్‌ శాఖ ద్వారా పంట రుణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, రైతులందరికీ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు జూన్‌ 10 నాటికి పంట రుణాలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. రైతులు ఆందోళనకు దిగకముందే పంట రుణాలు ఇప్పించుటలో వ్యవసాయశాఖ చర్యలు చేపట్టాలని కోరారు..

Spread the love