కృత్రిమ మేథతో మహిళా ఉద్యోగులకే ప్రమాదం

– యూఎస్‌లో 1.2 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం
– నల్లజాతీయులకు ప్రతికూలతనే
వాషింగ్టన్‌ : ఆటోమేషన్‌, కృత్రిమ మేధా (ఏఐ) వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని మెకెన్సీ అండ్‌ కో ఓ రిపోర్ట్‌లో తెలిపింది. 2030 చివరి నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో కార్మికుల మార్కెట్‌ను విశ్లేషించిన కన్సల్టెంట్‌ సంస్థ మెకెన్సీ అండ్‌ కో పరిశోధన విభాగం ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది. వచ్చే ఏడేండ్లలో పురుషుల కంటే స్త్రీలు కొత్త వృత్తిలోకి వెళ్లాల్సిన అవసరం 1.5 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొంది. ఆటోమేషన్‌ ద్వారా ఎక్కువగా ఆఫీస్‌ సపోర్ట్‌ సహా కస్టమర్‌ సర్వీస్‌ రంగాల్లోని ఎక్కువగా ప్రమాదాన్ని ఎదుర్కోనున్నారని నివేదిక పేర్కొంది. ఆహారం, ఉత్పత్తి కార్మికులకు డిమాండ్‌ తగ్గిపోవడంతో నల్లజాతీయులు, హిస్పానిక్‌లు కూడా ప్రతికూలతలను చవి చూడనున్నారు.
”2030 నాటికి యూఎస్‌లో కనీసం 1.2 కోట్ల మంది కార్మికులు వృత్తులను మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆటోమేషన్‌, ఎఐతో తక్కువ వేతన కార్మికులు అత్యధికంగా ప్రభావితం కానున్నారు. వారు అత్యధిక వేతన స్థానాల్లో ఉన్నవారి కంటే 14 రెట్లు ఎక్కువగా వృత్తులను మార్చుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి అదనపు నైపుణ్యాలు అవసరం.” అని మెకెన్సీ అండ్‌ కో ఇన్స్‌ట్యూట్‌ డైరెక్టర్‌ క్వెలిన్‌ ఎల్లింగ్‌రూడ్‌ పేర్కొన్నారు. ”లాయర్లు, ఉపాధ్యాయుల నుంచి ఆర్థిక సలహాదారులు, ఆర్కిటెక్ట్‌లు ఇతర వైట్‌ కాలర్‌ కార్మికుల వరకు అందరూ ఏఐ ప్రమాదాన్ని చవి చూడనున్నారు. ఇది పెద్ద సంఖ్యలో ఉపాధిని నాశనం చేయనుంది. కృత్రిమ మేధా దాదాపు ప్రతి ఉద్యోగాన్ని మార్చబోతోంది.” అని ఆ ఇన్స్‌ట్యూట్‌ భాగస్వామి మైఖేల్‌ చురు అన్నారు. చమురు, గ్యాస్‌ ఉత్పత్తి, ఆటోమోటివ్‌ తయారీలో పనిచేసే కార్మికులు గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను అంతం చేసే ప్రక్రియలో భాగంగా 35 లక్షల మంది ఉద్యోగాలు పోవచ్చని ఆ రిపోర్ట్‌ పేర్కొంది. ఏఐ దుష్ప్రభావాలు అంతిమంగా అన్ని దేశాలపై పడనున్నాయని నిపుణులు హెచ్చరిస్తునే ఉన్న విషయం తెలిసిందే.

Spread the love