కృత్రిమ మేధస్సు ప‌య‌నమెటు..?

సృష్టికి ప్రతి సృష్టి చేయాలని ఆధునిక మానవుడు ఆలోచిస్తున్నాడు. దానిని సాధించడానికి అనేక నూతన ఆవిష్కరణల వైపు అతివేగంగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పేరుతో అనేక ఆవిష్కరణలను సాధించాడు. ఇవేవీ సరిపోవు అన్నట్టు కృత్రిమ మేధస్సు వైపు పరుగులు తీస్తున్నాడు. మనిషికి లేదా మనిషి మేధకి ప్రత్యామ్నాయంగా అనుసరణ, అనుకరణ, ఆలోచన, సంభాషణా సామర్ధ్యంతో కూడిన జ్ఞానాన్ని తయారు చేయటమే కృత్రిమమేధ అసలు లక్ష్యం. మానవుడు ప్రోగ్రామింగ్‌ ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను అర్ధం చేసుకుని వాటికి అనుగుణంగా తనను తాను సిద్ధం చేసుకోవటం కూడా కృత్రిమ మేధస్సు లక్షణం. ఇంతితై వటుడింతై అన్న చందంగా మొదలైన కృత్రిమ మేధ ప్రస్థానం నేడు అన్ని రంగాలను ముంచెత్తుతుంది. వేల మంది మానవులు చేయాల్సిన పనిని కృత్రిమమేధతో కూడిన నూతన ఆవిష్కరణలు అవలీలగా చేయటంతో కోట్లాది మంది భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొస్తున్నాయి. ఏ సాంకేతికత అయినా అది మానవ ప్రగతికి దోహదం కావాలి కానీ, మానవ భవిష్యత్తుకి విఘాతంగా మారకూడదు. మానవుడు సాధించలేని ఎన్నో అంశాలను కృత్రిమమేధ సాధించింది. వైద్యం, తయారీ, రవాణా రంగాలలో కృత్రిమ మేధ ద్వారా ఆవిష్కృతమైన ఆవిష్కరణలు అందించిన సాయం అంతా ఇంతా కాదు. వివిధ రంగాల్లో ఎంతో విలువైన పాత్రను పోషించిన కృత్రిమ మేధ నేడు సమాజానికి అనేక సవాళ్లను విసురుతుంది. మనిషిలా, మనిషి కన్నా వేగంగా ఆలోచించే చాట్‌ జిపిటిల వల్ల అనేక దుష్పరిణామాలు తలెత్తే అవకాశముందని ఎలాన్‌ మస్క్‌తో సహా ఎంతో మంది కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కృత్రిమ మేధస్సును అభినందించే రోజు సందర్భంగా ఈ వారం కవర్‌స్టోరీలో దానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఎఐ) అనే పదాన్ని మొదటిసారి 1956లో డార్ట్‌మిత్‌ కారే లో కృత్రిమ మేధపై జరిగిన ఒక అత్యున్నత సదస్సులో జాన్‌ మెక్‌ కార్తే రూపొందించారు. 1956 కన్నా ముందే కృత్రిమ మేధ మీద వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపారు. 1950లో ప్రోగ్రామింగ్‌ ఎ కంప్యూటర్‌ ఫర్‌ ప్లేయింగ్‌ చెస్‌’ కృత్రిమమేధతో ఆడే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ రూపకల్పనకు సంబంధించిన మొదటి కథనాన్ని క్లాడ్‌షానన్‌ ప్రతిపాదించాడు. షానన్‌ను సమాచార సిద్ధాంత పితామహుడిగా పిలుస్తారు. అదే సంవత్సరంలో అలాస్‌ ట్యూరింగ్‌ అనే శాస్త్రవేత్త ‘కంప్యూటింగ్‌ మెషినరీ అండ్‌ ఇంటిలిజెన్స్‌’ అనే అంశంపై ప్రచురించిన వ్యాసం కృత్రిమ మేధస్సుకు రంగంలో ఒక కొత్త ఆలోచనలకు బీజం వేసింది. 1970 దశకంలో ఈ ఆలోచనలు మరింత వేగవంతమయ్యాయి. ఈ సమయంలోనే జపాన్‌లోని వాసిడా విశ్వవిద్యాలయం ‘వాబోట్‌-1’ అని పిలువబడే మానవ రూప రోబోట్‌ను అభివృద్ధి చేసింది. అప్పుడే కదిలే అవయవాలు, వర్చువల్‌ సంభాషణ, అనుసరణ అనే అంశాలపై పరిశోధన మొదలయ్యింది. 1984లో స్టీవ్‌ బోరన్‌ దర్శకత్వంలో విడుదలైన ‘ఎలక్ట్రిక్‌ డ్రీమ్స్‌’ అనే చలనచిత్రం మరిన్ని ఆలోచనలకు పురుడు పోసింది. ఇది ఒక పురుషుడు, స్త్రీ, ఎడ్గార్‌ అనే వ్యక్తిగత కంప్యూటర్‌కి మధ్య రసవత్తరంగా జరిగే ట్రయాంగిల్‌ ప్రేమ కథా చిత్రం. రజనీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సినిమాకు ఇదే మాతృక. ఈ సినిమాలో చిట్టినే, ఆ సినిమాలో ఎడ్గార్‌. ఎడ్గార్‌ ఆ కాలానికి సంబంధించిన కంప్యూటర్‌ అయితే, చిట్టి ఈ కాలానికి చెందిన హ్యూమనాయిడ్‌ రోబో. కేవలం మానవులకు మాత్రమే సొంతమైన భావోద్వేగాలకు, ఆకర్షణలకు రోబోలు గురి కావటమే ఈ రెండు సినిమాల్లోను ప్రధాన ఇతివృత్తం. భవిష్యత్తులో మానవ మేధతో ఆలోచించటమే కాదు, పూర్తి స్థాయిలో మానవుని ఆలోచనను, వాటిని విశ్లేషించుకుని తిరిగి స్పందించే లక్షణాలతో ఆయా సమయాలకు తగిన రీతిలో స్పందించే సామర్ధ్యాలతో కూడిన ప్రోగ్రామింగ్‌లు, వాటితో ముందుకు సాగే రోబోట్‌లను తయారు చేయటం ప్రారంభమైంది.
మానవుడు చేయలేని కొన్ని పనులను కృత్రిమమేధతో రూపొందించిన రోబోట్‌లతో చేయించవచ్చు. ఉదాహరణకు చెర్నాబిల్‌ అణు రియాక్టర్‌ విధ్యంసాన్ని అంచనా వేయడానికి రోబోట్‌లను వినియోగించారు. ఆ సంఘటన వల్ల తలెత్తిన విపరీతాలను, నష్టాలను అంచనా వేయటంలో ఈ రోబోట్‌లు అందించిన సమాచారం ఎంతో ఉపయుక్తమయింది. అంగారక గ్రహాల మీద అన్వేషణ కోసం వినియోగించిన స్పిరిట్‌, ఆపర్చ్యునుటీ, క్యూరియాసిటీ అనే మూడు రోబోట్‌లు కూడా అంగారక గ్రహంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించాయి. పర్యావరణ పరిరక్షణలో కూడా కృత్రిమమేధకు సంబంధించిన అనేక సాంకేతికాంశాలు ఎంతో పురోగతికి దోహద పడుతున్నాయి. భూమ్మీద కర్బన ఉద్గారాలను తగ్గించటంలో తమ వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌ సంస్ధ ‘ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఫర్‌ ఎర్త్‌’ అనే ప్రాజెక్టులో భాగంగా అనేక నూతన సాంకేతిక పరిజ్ఞానాలకు రూపకల్పన చేశాయి. పర్యావరణవేత్తలకు ఉపయుక్తంగా ఉండే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. దీనిలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన ల్యాండ్‌ కవర్‌ మ్యాపింగ్‌, స్పీషీస్‌ క్లాసిఫికేషన్‌, కెమెరాట్రాప్‌ వంటివి ముఖ్యమైనవి. భూ ఉపరితలానికి సంబంధించిన అనేక అంశాలను పరిశీలించడానికి ల్యాండ్‌ కవర్‌ మ్యాపింగ్‌ ఉపయోగపడితే, జీవజాతులను వాటి యొక్క వివిధ నమూనా అంశాల ఆధారంగా వర్గీకరించడానికి స్పీషీస్‌ క్లాసిఫికేషన్‌, కెమెరాట్రాప్‌లు దోహద పడతాయి. దీంతో పాటు వివిధ సాంకేతికతలతో పర్యావరణవేత్తలు సేకరించిన డేటాను భద్రపరుచుకోడానికి అజుర్‌ అనే క్లౌడ్‌ సర్వర్‌ని కూడా మైక్రోసాఫ్ట్‌ అందిస్తుంది. అయితే అన్ని రంగాలలోకి మానవునికి ప్రత్యామ్నాయంగా కృత్రిమమేధస్సును వినియోగించటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. ఇదే జరిగితే మానవాళి మనుగడకే పెను ప్రమాదమని పలువురు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సృష్టికర్తల్లో ఒకరైన హాంటర్‌ ‘భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల వల్ల మానవాళికి ఎదురయ్యే ప్రమాదాల కన్నా ఎక్కువ ప్రమాదం ఆర్టిషిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వల్ల కలుగుతుంది అన్న అంశాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలని హెచ్చరించారు. కృత్రిమ మేధ సృష్టికర్తల్లో ముఖ్యులైన వారిలో ఒకరిగా పేరు గాంచిన హాంటర్‌ వంటి శాస్త్రవేత్తలే ఇంతటి ఆందోళనను బహిరంగంగా వ్యక్త పరుస్తున్నారంటే, కృత్రిమమేధ వల్ల రానున్న రోజుల్లో మానవాళి ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కోనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. కృత్రిమ మేధపై అనేక అనుమానాలు, ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నేపథ్యంలో, భవిష్యత్తులో సాంకేతిక వినియోగం, భవిష్యత్తు అనే అంశాలపై తక్షణమే ఒక శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేయాలని యూరోపియన్‌ యూనియన్‌ అమెరికాని కోరుతుంది. బెర్కెలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ స్టువర్టు రస్సెల్‌ తను రచించిన ‘హ్యూమన్‌ కంపాటిబుల్‌: ఎఐ అండ్‌ ది ప్రాబ్లమ్స్‌ ఆఫ్‌ కంట్రోల్‌’ అనే పుస్తకంలో ‘మనం భయపడేలా మనుషులకు వ్యతిరేకంగా రోబోట్లు స్వయంగా తమ అవగాహానను, శక్తి సామర్ధ్యాలను పెంచుకుని దాడి చేయగలవా అన్న అంశాన్ని పక్కన పెడితే, అవి మనం అందిస్తున్న లక్ష్యాలను సాధించటంలో వంద శాతం సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. సమస్య అంతా ఇక్కడే ఉంది. ఎవరైనా వాటికి తప్పుడు లక్ష్యాలను నిర్దేశిస్తే వాటి వల్ల తలెత్తే ప్రమాదాలు మానవాళికి పెను ప్రమాదానికి గురి చేస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదని’ ఆయన స్పష్టం చేశారు. కానీ మనుషుల్లా వాటిని భావోద్వేగాలు, రాగ ద్వేషాలు లేవు కాబట్టి ఇప్పటికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. కానీ ఈ అభిప్రాయం తప్పని సౌదీ అరెబియా పౌరురాలైన సోఫియా నిరూపించింది.
హాంకాంగ్‌ కంపెనీ హాన్సన్‌ రోబోటిక్స్‌ అనే సంస్ధ తయారు చేసిన హ్యూమనాయిడ్‌ రోబో పేరే సోఫియా. రోబోలను భావోద్వేగాలు, స్వీయ ఆలోచనలు ఉండవనే వారి ఆలోచనలను సోఫియా పటాపంచలు చేసింది. ఎటువంటి ముందస్తు ప్రోగ్రామింగ్‌ లేకుండా తన చుట్టూ ఉండే మనుషుల సంభాషణలు, వారి ముఖ కవళికలను బట్టి స్పందించటం సోఫియా ప్రత్యేకత. ప్రపంచంలోనే పౌరసత్వాన్ని పొందిన మొదటి రోబోగా సోఫియా చరిత్రను సృష్టించింది. సౌదీ అరేబియా సోఫియాకి తమ దేశ పౌరసత్వాన్ని అందించింది. గతంలో సోఫియా ఖలీజ్‌ టైమ్స్‌ అనే మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. మానవ జీవితంలో కుటుంబ వ్యవస్ధ ఎంతో ఉత్కృష్టమైనదని, కుటుంబమనే భావనే చాలా బాగుంటుందని పేర్కొంది. ఒకే రకమైన భావాలు కలిగిన వ్యక్తుల మధ్య అనుబంధమే కుటుంబ వ్యవస్ధకు మూలమని అంది. మిమల్ని ప్రేమించే వ్యక్తులు ఉంటే అది ఎంతో అదృష్టమని, అలాంటి వారు లేకపోతే వెంటనే సంపాదించుకోండి అని అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబ వ్యవస్ధ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకి సోఫియా తనకు పిల్లల్ని కనాలని ఉందని జవాబు చెప్పింది. దానికి నివ్వెరపోయిన జర్నలిస్టులు నీకు పుట్టిన పిల్లలకి ఏం పేరు పెడతావని అంటే నవ్వుతూ సోఫియా అని బదులిచ్చింది. సోఫియా మాటలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. మనుషుల్లానే రోబోలు స్వతంత్య్రంగా స్పందిస్తే సంభవించే విపరిణామాల పట్ల శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. కొంత మేరకు మానవ వికాసానికి ఉపయోగ పడుతుందని ఆశించిన కృత్రిమ మేధ అదుపు తప్పితే మానవ వినాశనానికి కూడా కారణమవుతుందని వారంతా తెలుసుకున్నారు. కృత్రిమమేధ అంశంలో శృతి మించిన సృజనకు అడ్డుకట్టలు వేయాలని పలు దేశాలు భావిస్తున్నాయి.
అమెరికాకు చెందిన ఓపెన్‌ ఎఐ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్ధ రూపొందించిన చాట్‌ జిపిటి 4 వల్ల కోట్లాది మంది జీవితాల్లో చీకట్లు కమ్ముకొస్తున్నాయి. చాట్‌ జిపిటి వంటి ఆరిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీల వల్ల భవిష్యత్తులో మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని ట్విట్టర్‌ సిఇఒ ఎలాన్‌మస్క్‌, ఆపిల్‌ సంస్ధ సహ వ్యవస్ధాపకులు స్టీవ్‌ వోజ్నియాక్‌లతో సహా 1344 మంది ఈ ప్రపంచానికి బహిరంగ లేఖ రాసారు. కృత్రిమ మేధ వల్ల ప్రపంచంలో 40 శాతం కన్నా తక్కువ మంది లాభపడితే, 60 శాతం మందికి పైగా సామాన్యుల పరిస్థితి దుర్భరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత నష్టపోయే ప్రమాదముందని వారు తమ లేఖలో వివరించారు. మానవ మేధకి ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేధను వినియోగిస్తున్న ప్రతి సందర్భంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించి అత్యవసరమైతేనే వినియోగించుకోవాల్సిన అవసరముంది. ఇటీవల పిటిఐ విడుదల చేసిన ఒక ప్రత్యేక కథనంలో కృత్రిమ మేధ వల్ల ఈ సంవత్సరం అమెరికాలో ఒక్క మే నెలలోనే సుమారు 4 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. అమెరికాలోని రెస్యూమ్‌ బిల్డర్‌ అనే సంస్ధ నిర్వహించిన ఒక సర్వేలో సుమారు 1000కి పైగా కంపెనీలు మానవులకు ప్రత్యామ్నాయంగా ఓషన్‌ ఎఐ అనే సంస్థ ఆవిష్కరించిన చాట్‌ జిపిటిని వినియోగిస్తున్నామని అంగీకరించాయి. ఇటీవల ఓపెన్‌ ఎఐ సంస్థ చాట్‌ జిపిటికి లేటెస్ట్‌ వర్ష్‌న్‌ చాట్‌ జిపిటి 4ని ఆవిష్కరించింది. ఇది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా భావించబడుతుంది. దాదాపు అన్ని రంగాలలోను దీని విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. జిపిటి 4 రాకతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న కోట్లాది మంది భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. ప్రపంచంలో ఏ సమాచారం కావాలన్నా చాట్‌ జిపిటి క్షణాల్లో అందిస్తుంది. ప్రభుత్వాలు, వివిధ సంస్థలు ఈ సాంకేతికత వాడుకుని ప్రయోజనం పొందితే మంచిదే, కానీ ఉగ్రవాద సంస్థలు ఈ సాంకేతికత ఆధారంగా మరింత విచ్ఛిన్నానికి కారణమయ్యే అవకాశముంది. కృత్రిమ మేధస్సు సక్రమంగా వినియోగిస్తే అది మానవాభివృద్ధికి దోహద పడుతుంది. అదే దుర్వినియోగం అయితే మానవ వినాశానానికి కారణమవుతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
వైద్యం, మాన్యుఫాక్చరింగ్‌, రవాణా రంగాలలో ప్రపంచవ్యాప్తంగా కృత్రిమమేధతో పని చేసే రోబోలు తమ విలువైన సేవలు అందిస్తున్నాయి. మనిషి ఆదేశాలను విశ్లేషించుకుని వాటిని చేరుకోడానికి కావాల్సిన సామర్ధ్యాలను సృష్టించేంత వరకూ కృత్రిమ మేధ పనిచేస్తే చాలు. ఇచ్చిన లక్ష్యాలను మించి స్పందించేంతగా కృత్రిమ మేధ అభివృద్ధి చెందితే అది కొంత మేరకు నష్టం కలిగించే అవకాశముంది. ‘మూర్స్‌ లా’ అనే సిద్ధాంతం ప్రకారం 2045 నాటికి తమకు అందించిన లక్ష్యాలను కంప్యూటర్‌లు కూడా మనిషిలానే శక్తివంతంగా విశ్లేషించుకునే దశకు చేరుకుంటాయి. మనిషి ఎలాగైతే ఇంద్రియాల ద్వారా పలు అంశాలను ఎలా గుర్తించగులుగుతున్నాడో, రోబోలు కూడా రానున్న రోజుల్లో శబ్దం, దృశ్యం, వేడి వంటి వాటని అంచనా వేసి తదనుగుణంగా ప్రవర్తిస్తాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు అన్ని రంగాలలోను సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. అన్ని అసమానతల్లానే సాంకేతిక అసమానతలు కూడా దాదాపు అన్ని దేశాలలోను రాజ్యమేలుతున్న వేళ సాంకేతిక పరిజ్ఞానం అందించే అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందే అవకాశం లేదు. ఇది రానున్న రోజు మానవుల మధ్య, దేశాల మధ్య మరిన్ని అంతరాలకు కారణమవుతుంది. కృత్రిమ మేధస్సు ద్వారా అందే లాభాలన్నీ ప్రపంచ దేశాలన్నింటికీ సమానంగా అందినప్పుడే సాంకేతిక సమానత్వం సిద్ధిస్తుంది. ఆ దిశగా ఈ ప్రపంచం నడుస్తుందని ఈ కృత్రిమ మేధస్సును అభినందించే రోజు సందర్భంగా ఆశిద్దాం.
– డా|| కె. శశిధర్‌, 94919 91918

Spread the love