మత్తు వదలగొట్టిన గమ్మత్తైన పాట

మద్యం మత్తును కలిగిస్తుంది. కాని కాసేపట్లో ఆ మత్తు దిగిపోతుంది. స్వార్థం కూడా మత్తును కలిగిస్తుంది. కాని అది అంత తొందరగా వదిలిపోయేది కాదు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఎక్కే మత్తు అది. అవినీతి, దోపిడి, అహంకారం అనేవి మద్యం కన్నా ఎక్కువ మత్తునిస్తాయి. ఇవి ప్రమాదకరమైనవి, భయంకరమైనవి అంటూ గొప్ప సందేశంతో మహాకవి దాశరథి రాసిన పాట ఇది. ఆ పాటనిపుడు చూద్దాం.
తెలుగు సినిమాపాటకు కావ్యగౌరవాన్ని కలిగించిన కవుల్లో దాశరథి ఒకరు. ఆయన పాటల్లో గొప్ప భావుకత, భాషాసౌందర్యం కనిపిస్తాయి. ఆయన రాసిన సినిమా పాటలు తేలికైన పదాలతో మనల్ని ఇట్టే పట్టేసుకుంటాయి. అయస్కాంతాల్లా ఆకర్షిస్తాయి. ‘మనుషులు-మమతలు’ (1965) సినిమాలో ఆయన ఆరు పాటలు రాశాడు. అందులో ఓ అద్భుతమైన సందేశాత్మక గీతం కూడా ఉంది. లోకం గుట్టును విప్పి చెప్పిన పాట ఇది. పై పై మత్తు గురించి కాదు అసలు మత్తు ఏమిటో విడమర్చి చెప్పిన గమ్మత్తైన పాట  ఇది.. సినిమాలో సన్నివేశానికి తగినట్టుగా రాసిన పాట అయినా నిజ జీవితంలో మనిషి మనిషిని ప్రశ్నించే పాట ఇది. హైదరాబాద్‌ లోని ట్యాంక్‌ బండ్‌ ప్రదేశంలో ఈ పాటను చిత్రీకరించారు. సినిమాపరంగా చూసినట్లయితే… హీరో బాగా తాగి కైపెక్కి తూలుతుంటాడు. పాడుతుంటాడు. తాగి నేను తాగలేదంటాడు అదీ విశేషం. తాగి నిషాలో ఊగుతూనే నేను తాగలేదు, నాకు నిషాలేదు, నాకు నిషా రాదు అంటాడు. ఇది విన్నవారికి తాగినవాడు చెప్పే మొదటిమాట ఇదే కదా! అనుకుంటాం. కాని, చరణాలు చూస్తే ఆ హీరో చెప్పేవన్నీ లోతైన సత్యాలేనని, దాగి ఉన్న నిజాలేనని మనకు అర్థమవుతుంది.
ప్రపంచంలో చాలామందికి డబ్బంటే వ్యామోహం. డబ్బే ప్రపంచాన్ని నడిపించేది. డబ్బే మనిషికి మనిషికి మధ్యన అంత:స్సూత్రంలా పనిచేస్తుంది. సమాజాన్ని ముందుకు నడిపించే దిక్సూచి అదే. కాని ఆ డబ్బే ఎందరినో విడదీస్తుంది. ఎంతకైనా దిగజారేలా చేస్తుంది. కొందరు మద్యానికి బానిసలవుతారు. క్లబ్బుల్లో, మందుషాపుల్లో తాగి, జల్సాలు చేస్తూ తిరుగుతుంటారు. వాళ్ళకు కుటుంబం మీద, జీవితం మీద ఆలోచన అసలే ఉండదు. ఎప్పుడూ తాగడం, తూలడం, ఇలా.. కొందరికి డబ్బంటే వ్యామోహం. మరికొందరికి క్లబ్బంటే వ్యామోహం. కాని ఈ లోకంలో అందరికి స్వార్థమే అసలైన నిషా. స్వార్థం కోసం ఏ పనైనా చేస్తారు. ఎవరినైనా పడదోస్తారు. ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు. కాని, నాకు మాత్రం నిషా లేదు, నిషా రాదు అంటాడు హీరో. అంటే.. మద్యం వల్ల వచ్చిన నిషా ఉందేమో కాని స్వార్థం వల్ల వచ్చిన నిషా మాత్రం లేదు అని ఇక్కడ అర్థం. అంటే స్వార్థజీవిని కానని చెప్పుకుంటున్నాడు. అందుకే నేను తాగలేదు అంటున్నాడు.
లోకంలో కొందరికి పదవిపై వ్యామోహం ఉంటుంది. ఆ పదవి వల్ల అధికారం వస్తుంది. ఎవరినైనా శాసించవచ్చు. తమ చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు. అందుకే అధికారం లేనిదే జీవితమే లేదన్న భావనతో బతుకుతారు. కొందరికి పెదవి అంటే నిషా. అంటే.. ముద్దు నిషా అని అర్థం (శంగారం అంటే వ్యామోహం). కాని ఈ లోకంలో అందరికి యవ్వనమే గొప్ప నిషానిస్తుంది. యవ్వనంపై అందరికి వ్యామోహమే. అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. నిండు యవ్వనం ఒక వరంలాగా భావిస్తుంటారు. అంతకు మించిన నిషా ఏదీ ఇవ్వదు. అందుకే అది మహా నిషా అన్నాడు దాశరథి.
సమాజంలో కొందరికి పెళ్ళంటే వ్యామోహం. వధువుకోసం వేటలో ఉంటారు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి. తాను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో ముందే అంచనాలు వేసుకుంటారు. పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి మధువంటే పిచ్చి. తాగుడుకి దాసోహం అంటారు. వధువు, మధువు కొందరికైతే, లోకంలో అందరికీ చీకటిలో భలే నిషాగా ఉంటుంది. చీకటిలో చేసే పని ఏదీ ప్రపంచానికి తెలియదు. అంటే.. రహస్యకత్యాలని అర్థం. దోపిడీ, అక్రమ రవాణా, దురాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు మొదలైనవి ఏవైనా కావచ్చు. అన్నింటికి చీకటే చిరునామా. చీకట్లోనే మేడలు నిర్మించబడతాయి. కూల్చబడతాయి కూడా. అందుకే.. చీకటి భలే నిషానిస్తుందంటాడు దాశరథి.
ఎప్పటికి దిగిపోని మత్తు కలిగించే స్వార్థం, అవినీతి వంటి భయంకరమైన పదార్థాలముందు మద్యం ఎంత? అంటూ దాశరథి ప్రశ్నిస్తున్నాడీపాటలో.. ప్రతి మనిషి తనకు తెలిసో, తెలియకో ధనం మత్తులోనో, అహం మత్తులోనో, పదవి మత్తులోనో తూలిపోతాడు. వాటిని వదిలించుకుని నిజమైన, నిస్వార్థమైన మనిషిగా ముందుకు నడవమంటూ తన పాటతో హెచ్చరిస్తున్నాడు దాశరథి.
(జూలై 22 న దాశరథి జయంతి)
– డా||తిరునగరి శరత్‌ చంద్ర,

[email protected]

Spread the love