క్షణికం

త్రిపుర దేశాన్ని త్రిలింగ సేనుడు పాలిస్తున్నాడు. పొరుగు దేశాలతో పోల్చితే ఆ దేశం బాగా వెనుకబడి ఉండేది. ప్రజల పేదరికానికి జాలిపడి త్రిలింగసేనుడు ప్రతి నెల ప్రారంభ దినంలో ప్రజలందరికీ ఉచితంగా భోజనాలు పెట్టించేవాడు. అందుకు దేశమంతా భారీగా ఏర్పాట్లు జరిగేవి. రాజు, మంత్రి కలిసి అప్పుడప్పుడు దేశ సంచారం చేసి ప్రజల అభిప్రాయం సేకరిస్తుండేవారు. అన్నదానం గురించి ఆయనను అంతా పొగుడుతుండేవారు. అన్ని దానాల్లోకి గొప్పదైన అన్నదానం చేసిన రాజు అందరి అభిమానాన్ని పొందుతాడని అంతా అనేవారు. రాజు సంతోషించేవాడు. ఒకసారి మాత్రం త్రిలింగసేనుడితో ఒక యువకుడు ”మన రాజు పరమ మూర్ఖుడు. అన్నదానం పేరుతో లక్షల వరహాలు వధా చేస్తున్నాడు” అన్నాడు.
మారువేషంలో ఉన్న రాజుకు చాలా కోపం వచ్చింది. ఆయన వాడితో ”నోటికి వచ్చినట్లు మాట్లాడే వాళ్లను మన రాజు శిక్షిస్తాడు” అన్నాడు.
”అయితే నేను చెప్పే కథ విని రాజు నన్ను శిక్షించడం న్యాయమో కాదో చెప్పండి” అంటూ ఆ యువకుడు కథ చెప్ప సాగాడు. ఒకసారి శ్రవణుడు, శివుడు అనేవాళ్లు డబ్బు సంపాదించాలని ఊర్లు తిరుగుతూ ఒకచోటకు చేరుకున్నారు. అక్కడ పండితుడొకడు ఆవులను మేపుకుంటూ వారికి కనిపించాడు. ఆయన వాళ్ల గురించి తెలుసుకొని ”నా దగ్గర పనిలో చేరితే మీకు సకల శాస్త్రాలు నేర్పుతాను. మీ భోజనం ఏర్పాట్లు మీవే. జీతం ఏమీ ఉండదు” అన్నాడు. శ్రవణుడు వెంటనే ఒప్పుకున్నాడు. శివుడు మాత్రం ”తిండి లేకుండా చదువుకునేది ఎలా? డబ్బు తీసుకోకుండా పనిచేసేది ఎలా? అది నా వల్ల కాదు” అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అదష్టం కొద్ది ఆ మర్నాడు శివుడికి ఇంకో ఊర్లో పని దొరికింది. ఒక రైతు వాడికి మూడు పూటలా తిండి పెట్టి, నెలకు వెయ్యి వరహాలు జీతంగా కూడా ఇస్తానని పనిలో పెట్టుకున్నాడు. ఆ విధంగా రోజులు సుఖంగా గడిచిపోతుంటే అక్కడ శ్రవణుడు తీరిక సమయంలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసి, ఆ వచ్చే డబ్బుతో కడుపు నింపుకుంటూ, పండితుడి పనులన్నీ చేస్తూ సకల శాస్త్రాలు నేర్చుకోసాగాడు. అలా ఐదేళ్లు గడిచాయి.
చదువురాని శివుడిని రైతు మోసం చేసి పనిలోంచి తీసేసాడు. కొన్నేళ్లపాటు స్థిరం లేకుండా ఎక్కడెక్కడో తిరిగిన శివుడు ఇప్పుడు శ్రవణుడి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురుకులాన్ని స్థాపించి, ఎందరికో గురువై విద్య నేర్పుతున్న శ్రవణుడు శివుడి తిండి ఖర్చులను తానే భరిస్తున్నాడు.
ఈ కథ చెప్పి ఆ యువకుడు ”అయ్యా! ‘అన్నేన క్షణికా తృప్తి: యావజ్జీవంచ విద్య యా!’ అన్న సూక్తి ఉండనే ఉంది. అంటే అన్నం అప్పటికే తృప్తినిస్తే విద్య యావత్‌ జీవితం తృప్తినిస్తుంది. ఈ సూక్తిని మరిచిన ఆ శివుడిని నేనే! ఆకలితో ఉన్నటువంటి లేనివాడిని పిలిచి అన్నం పెట్టడం గొప్ప విషయమే కానీ, ఉన్నవారికి లేని వారికి అన్నదానం పేరుతో లక్షల వరహాలు వధా చేస్తున్న రాజు దేశానికి అన్యాయం చేస్తున్నాడు. ఆ డబ్బును సక్రమంగా వినియోగిస్తేనే మన దేశం కూడా పొరుగు దేశాల్లాగే అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుంది” అన్నాడు.
అప్పుడు రాజు తన మారువేషం తొలగించి ”శివా! అనుభవంతో నీవు నేర్చుకున్న విషయం చాలా గొప్పది. ఇకమీదట ఈ రాజ్యంలో అన్నదానాలు ఉండవు. ప్రజలకు వృత్తి విద్యలతో సహా పలు విద్యల్లో శిక్షణ ఇవ్వగల విద్యాలయాలు నెలకొల్పుతాను. వాటిని నీవే పర్యవేక్షించాలి” అన్నాడు.
ఆ ప్రకారం ప్రజలు వృత్తి విద్యలతో శిక్షణ పొందగా త్రిపురదేశం కూడా క్రమంగా అభివృద్ధిని సాధించింది.
– డి.కె.చదువుల బాబు, 9440703716

Spread the love