థాయిలాండ్‌ ప్రధానిగా

– స్థిరాస్తి దిగ్గజం శ్రద్ధ థవిసిన్‌ ?
బ్యాంకాక్‌ : పాపులిస్ట్‌ ఫెయూ థాయి పార్టీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం శ్రద్ధ ధవిసిన్‌ థాయిలాండ్‌ 30వ ప్రధానిగా నియమితులు కావడానికి అవసరమైనన్ని ఓట్లు లభించాయి. ఓటింగ్‌ ఇంకా పూర్తి కానప్పటికీ గెలుపునకు అవసరమైన ఓట్లు శ్రద్ధకు వచ్చాయి. అయితే పార్లమెంట్‌ వేదికపై ఒకరు కుప్పకూలడంతో ఇంకా దాదాపు 20 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వుండగానే ఓటింగ్‌ను నిలిపివేశారు. 11 పార్టీల సంకీర్ణానికి శ్రద్ధ నేతృత్వం వహించనున్నారు. ఎనిమిది కేబినెట్‌ పదవులు, 9 డిప్యూటీ కేబినెట్‌ పదవులను తాము తీసుకోనున్నట్లు ఫెయూ థాయి పార్టీ తెలిపింది. కాగా ఎన్నికల ఫలితాలకు ద్రోహం చేసేలా కొత్త ప్రభుత్వం వుందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాజకీయ ప్రతిష్టంభనకు స్వస్తి పలికి, సామరస్యతను నెలకొల్పాలంటే ఇది అవసరమని ఫెయూ థాయి నేతలు సమర్ధిస్తున్నారు. నెలల తరబడి నెలకొన్న సస్పెన్స్‌, చట్టపరమైన తగాదాలు, సభ్యుల బేరసారాలు వీటన్నింటి ఫలితంగా ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చిన వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి నెలకొంది.
2006లో సైనిక కుట్రలో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని తస్కిన్‌ షినవ్రత 15 ఏళ్ళ తన ప్రవాసాన్ని ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన గంటల వ్యవధిలోనే పార్లమెంటరీ ఓటింగ్‌ జరిగింది. ఫెయూ థాయి పార్టీ విజయానికి తాను స్వదేశానికి తిరిగి రావడానికి సంబంధం ఏమీ లేదని తస్కిన్‌ చెబుతున్నారు. అయితే స్నేహపూర్వక ప్రభుత్వం గనక అధికారంలో వుంటే తన శిక్షా కాలం తగ్గుతుందని తస్కిన్‌ ఆశిస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.

Spread the love