సాయుధ దళాల నుండి మొదటి మహిళా సహాయకురాలిగా…

from the armed forces As the first female assistant...భారత వైమానిక దళానికి చెందిన ప్రధాన అధికారి స్క్వాడ్రన్‌ లీడర్‌ మనీషా పాధి. భారతీయ సాయుధ దళాల నుండి ఎయిడ్‌-డి-క్యాంప్‌ (ఏడీసీ)గా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సష్టించారు. మిజోరంలోని ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మిజోరాం గవర్నర్‌ చేతుల మీదుగా ఇటీవలె ఆమె ఈ ప్రతిష్టాత్మక గౌరవ బిరుదును అందుకున్నారు. ఆ సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
2015లో స్క్వాడ్రన్‌ లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మనీషా ఇప్పుడు గవర్నర్‌ హరిబాబు కంభంపాటికి సహాయకురాలిగా నియమితురాలయ్యారు. తద్వారా తన అద్భుతమైన కెరీర్‌కు కొత్త అధ్యాయాన్ని జోడించారు. ఇది ఆమె జీవితంలో ఓ ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. లింగ అడ్డంకులను ఛేదిస్తుంది. భారత సాయుధ దళాలలో మహిళాభివద్ధికి ఉదాహరణగా నిలిచింది. దేశంలో ఎయిడ్‌-డి-క్యాంప్‌ టైటిల్‌ అంటే ఓ గొప్ప గౌరవం.
లింగ విక్షను విచ్ఛిన్నం చేస్తూ
ఇది ఒక అధికారి యోగ్యతను, విధేయతను, విధి పట్ల అంకితభావానికి గుర్తింపు. అలాంటి గుర్తింపు పొందడం మనీషా వ్యక్తిగత విజయాన్ని మాత్రమే కాకుండా పురుషాధిపత్య రంగాలలో లింగ విక్షను సైతం విచ్ఛిన్నం చేస్తుంది. ఇటీవల రాష్ట్ర గవర్నర్‌ల కోసం ఇద్దరు సహాయకులు నియమించారు. భారత సాయుధ దళాల నుండి ఒకరికి, పోలీసు శాఖ నుండి ఒకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. మిజోరం గవర్నర్‌ ఏడీసీగా మనీషా నియామకం ఆమె అసాధారణ నైపుణ్యానికి, అంకితభావానికి నిదర్శనం. ఆమె వివిధ వైమానిక దళ స్థావరాలలో ఉండి విధి పట్ల తన నిబద్ధతను, అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించింది.
అంకిత భావానికి ప్రతిబింబం
ఐఏఎఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్న స్క్వాడ్రన్‌ లీడర్‌ పాది బీదర్‌, పూణే, భటిండాలోని వైమానిక దళ స్థావరాల నుండి మిజోరంలోని ఎయిడ్‌-డి-క్యాంప్‌ బాధ్యతల వరకు ఆమె ప్రయాణం దేశానికి సేవ చేయాలనే ఆమె అంకితభావాన్ని ప్రతిబింబి స్తున్నాయి. సాయుధ దళాల నుండి భారతదేశంలో ఇటువంటి గౌరవనీయమైన పదవిని పొందిన మొదటి మహిళగా ఆమె కీర్తిర ఘడించింది. ఈ ఏడాది నవంబర్‌ 29న ఆమెకు ఈ గౌరవ బిరుదు ప్రదానం చేశారు.
తండ్రి స్ఫూర్తితో…
ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌కు చెందిన మనీషా తన కుటుంబంలో రెండవ తరం అధికారి. ఆమె తండ్రి మనోరంజన్‌ పాధి స్ఫూర్తితో ఆమె ఈ రంగంలోకి ప్రవేశించారు. తండ్రి 2020లో పదవీ విరమణ పొందే నాటికి ఆయన గౌరవప్రదమైన ఫ్లయింగ్‌ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం గవర్నక్‌కు సహాయకురాలిగా కూతురి నియామకం పట్ల ఆమె తండ్రి అపారమైన గర్వాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో కఠినమైన సందర్భాలను ఆమె ఎదుర్కొని ఎదిగిన క్రమాన్ని ఈ సదర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
ఎన్నో సవాళ్లను స్వీకరించింది
ఇప్పుడు ఆమెకు వచ్చిన ఈ అవకాశం అంత సలుభంగా వచ్చింది కాదని ఆయన వివరించారు. మనీషా తాను ఎంచుకున్న రంగంలో విజయం సాధించేందుకు ఎన్నో సవాళ్లను స్వీకరించినట్లు ఆయన వివరించాడు. మనీషా ఐఏఎఫ్‌లో వత్తిని ఎంచుకుంటే, ఆమె సోదరుడు పౌర జీవితాన్ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం అతను నెదర్లాండ్స్‌లో పనిచేస్తున్నాడు. మనీషా భువనేశ్వర్‌లోని సీవీ రామన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పూర్వ విద్యార్థి. ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమె 2015లో ఐఏఎఫ్‌లో చేరారు. ఆమె భర్త మేజర్‌ దేపక్‌ సింగ్‌ కర్కీ. ప్రస్తుతం ఆయన ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తూ పంజాబ్‌లో ఉన్నారు.
మహిళా సాధికారతకు మద్దతు
గవర్నర్‌ కంభంపాటి మాట్లాడుతూ ‘ఆమె నియామకం ఆమె జీవితంలో ఒక మైలురాయి మాత్రమే కాకుండా లింగ అడ్డంకులను ఛేదించి, విభిన్న రంగాలలో రాణిస్తున్న మహిళలకు నిదర్శనం. ఈ విజయాన్ని జరుపుకోవడం, అన్ని రంగాలలో మహిళా సాధికారతకు మద్దతు ఇవ్వడం ప్రస్తుత సమాజంలో చాలా అవసరం’ అని ఆయన నొక్కి చెప్పారు. గత నెల నుండి ఆమె గవర్నర్‌ సహాయకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆయనతో పాటు అధికారిక పర్యటనలు చేస్తారు.

Spread the love