ఎదురులేని ప్రయాణం ప్రఖ్యాత న్యాయ సలహాదారు

ఎదురులేని ప్రయాణం ప్రఖ్యాత న్యాయ సలహాదారు,మీడియా వ్యూహకర్త, వ్యవస్థాపకు రాలు ప్రియాంక ఖిమానీ. ఆమె స్థాపించిన ఖిమాని & అసోసియేట్స్‌ అనే సంస్థ ద్వారా భారతీయ సంగీతంలో పాశ్చాత్య దేశాల ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రపంచ ప్రేక్షకుల ముందు మన దేశ కళాకారులను నిలబెడుతుంది. మన దేశ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. ఇలా లా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఎదురులేని ప్రయాణం చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
సంగీతం ఆమె జీవితంలో ఓ అందమైన భాగం. థియేటర్‌కి పరిచయం, పాఠశాల స్థాయి నుండే థియేటర్‌కి పరిచయమయింది. సజనాత్మక ప్రాజెక్ట్‌లలో పాల్గొనడం మొదలుపెట్టింది. రేడియో ఆర్టిస్టుగా ఎన్నో స్క్రిప్ట్‌లు రచించింది. మోడలింగ్‌ కూడా చేసింది. ఇంట్లో ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు ప్రతి రోజు ఎన్నో గంటలు విశ్రాంతి లేకుండా శ్రమించేది. ఓ న్యాయవాదిగా కళాకారుల హక్కుల కోసం ఎంతో కృషి చేస్తున్నది. వినోద రంగంలో న్యాయ సలహాల అవసరాలను తగ్గించాలనే ఉద్దేశంతో నమ్ముతూ లా చేసింది.
స్కూల్‌ వయసులోనే…
ముంబయిలోని ఓ సాధారణ గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగింది ప్రియాంక. ‘నేను పెరిగిన స్థలం, పరిస్థితులు నా వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాయి. నా తల్లిదండ్రులు చాల్‌లో ఇల్లు కొనుగోలు చేయకముందే మాహిమ్‌ స్టేషన్‌ వెలుపల వారు నడుపుతున్న ఫోటోకాపీయింగ్‌ (‘జిరాక్స్‌’ అని వారు పిలుస్తారు) దుకాణం నడుపుతూ నన్ను పెంచారు’ అని ఆమె చెబుతుంది. ప్రియాంక ఇప్పుడు అనేక స్థానిక భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. చిన్నతనం నుండి విభిన్న నేపథ్యాలు, వర్గాల వ్యక్తులతో కలిసిపోయి వారితో సంభాషించడం వల్లనే ఇది సాధ్యమయింది. 15 ఏండ్ల వయసులో ఆమె తన మొదటి టీవీ షో తమన్నా హౌస్‌కు 60-ఎపిసోడ్ల వరకు థ్రిల్లర్‌ను రాసింది.
సాఫీగా సాగలేదు
కుటుంబ ఆర్థిక పరిస్థితులను దష్టిలో ఉంచుకుని ప్రియాంక తాను తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఆదాయ వనరులకు ఆధారంగా మలుచుకుంది. ముంబైలోని జై హింద్‌ కాలేజీలో టీవీ షోలకు రాస్తూనే బయోటెక్నాలజీ చదివింది. తర్వాత గవర్నమెంట్‌ లా కాలేజీలో లా చదువుతున్నప్పుడు ప్లేస్‌మెంట్‌ వచ్చినపుడు కెరీర్‌తో పాటు జీతం చాలా అవసరం కావడం వల్ల చేరిపోయింది. కానీ ఈ పని ఆమె అనుకున్నట్టుగా లేదు. అయితే ఆమె న్యాయవాద వత్తి అంతా సాఫీగా సాగలేదు. యువతిగా, మహిళగా ఈ రంగంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. ‘చాలా మందికి న్యాయవాది అంటే ఒక నిర్దిష్ట మూస పద్ధతి ఉంది. నెరిసిన జుట్టు, దూకుడు, వాదన, నక్కజిత్తులు వంటివి ఉండాలని భావిస్తారు. అలాగే మహిళలు ఏదో ఒకవిధంగా పురుషుల నియంత్రణలో ఉండాలని అందరూ ఆశిస్తారు. అలాంటి వారి చేతుల్లో ఉండాలని నేను కోరుకోలేదు’ ఆమె అంటుంది.
సమస్యలు పరిష్కరించింది
ఏమైనప్పటికీ ఈ సవాళ్లు ఏవీ ప్రియాంకను ఆపలేకపోయాయి. ఆత్మవిశ్వాసంతో ఆమె ముందుకే వెళ్ళింది. సోను నిగమ్‌ నుండి లతా మంగేష్కర్‌ వరకు వినోద పరిశ్రమలోని పెద్ద పెద్ద వారికి చట్టపరమైన సంక్షోభం ఏర్పడినపుడు ఓ న్యాయ వాదిగా పరిష్కరించింది. ఓ లాయర్‌గా ప్రియాంక ప్రయాణం చాలా సంతప్తికరంగా ఉంది. ఆమె ఏండ్లుగా అధ్యయనం చేసి పరిపూర్ణ జ్ఞానంతో ఎదిగింది. క్లయింట్‌కు వివాదాస్పద విషయాల్లో అవసరమైన సలహా ఇవ్వడం ఆమె ప్రవత్తిని, వ్యూహరచన చేసే సామర్థ్యాన్ని పదును పెట్టాయి.
భవిష్యత్తు విషయానికొస్తే…
‘ఎవరికైనా సలహాదారుగా ఉండాలంటే మనమై వారికి నమ్మకం చాలా ముఖ్యం. క్లయింట్లు మన అనుభవం, జ్ఞానం కోసం మాత్రమే మన వద్దకు వస్తారు. అయితే వారు తమ జీవితంలోని అత్యంత క్లిష్టమైన నిర్ణయాల కోసం మనల్ని కలుస్తారు. మనల్ని వారు విశ్వసిస్తారు. కాబట్టి ఇచ్చే సలహా వారికి ఎంతో అమూల్యమైనది. పరిశ్రమ పరిజ్ఞానం, న్యాయ పరిజ్ఞానంతో క్లయింట్లతో శాశ్వత సంబంధాన్ని పెంపొందించుకోవాలి. మన కోసం ఒక బలమైన పునాదిని నిర్మించుకోవడంలో కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి. కొంత కాలంగా ఆమె సంస్థ మెర్లిన్‌, సిడి బేబీ, డౌన్‌టౌన్‌ మ్యూజిక్‌, బెర్క్లీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు మార్గదర్శకత్వాన్ని అందించింది. ఈ విధంగా భారతీయ వినోద పరిశ్రమకు బహుళజాతి ప్రేక్షకుల ప్రాప్యతను పెంచడానికి ఖిమాని చేసిన ప్రయత్నాలు అసమానమైనవి.
అధికంగా అంచనా వేయను
వృత్తితోనే ఆమె ఓపికగా ఉండటం నేర్చుకుంది. ఇంకా దఢంగా, వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ప్రవీణ్యతను సంపాదించింది. ‘ఒకరి కీర్తి, జీవితం నా చేతుల్లో ఉన్నాయని నేను ఎప్పుడూ గర్వంగా భావించను. నా నైపుణ్యాన్ని నేను అధికంగా అంచనా వేయను. నన్ను నేను మెరుగులు దిద్దుకునేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంటాను’ అంటూ ఆమె వివరించింది. లాభాపేక్షలేని ఉమెన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండియా చాప్టర్‌ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్న ప్రియాంక చాలా మంది నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెబుతుంది. అలాగే రోజువారీ అనుభవాలు, వ్యక్తుల నుండి అపారమైన ప్రేరణను పొందుతుంది.

Spread the love