బతుకమ్మ ఆడుతూ హన్మకొండలో ఆశా వర్కర్ల నిరసన

Asha workers protest in Hanmakonda while playing Bathukamma– పలు చోట్ల వివిధ రూపాల్లో ఆందోళనలు
నవతెలంగాణ విలేకరులు- హన్మకొండ, గార్ల
ఆశా వర్కర్లకు ఫిక్స్డ్‌ వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు ఆదివారం హనుమకొండ జిల్లా ఏకశిలా పార్కు వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టి సారించి ఆశలతో వెట్టిచాకిరి ఆపాలని కనీస వేతనాలు ఇవ్వాలని, పనికి గుర్తింపు ఇవ్వాలని ఉయ్యాల రూపకంగా పాటలు పాడుతూ మూడు గంటల పాటు నిరసన తెలిపారు. తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) గౌరవాధ్యక్షులు రాగుల రమేష్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆశలకు వేతనాలు ఇస్తున్నామని మంత్రులు చెప్పడం సరికాదన్నారు. హర్యానా రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ.14,000 ఫిక్స్డ్‌ వేతనం ఇస్తున్నారని, పాండిచ్చేరి రాష్ట్రంలో రూ.10వేలు వేతనం ఇస్తున్నారని వివరించారు. ప్రభుత్వం ఆశాల యూనియన్‌ తో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు నాయకులు యాకూబీ, సీహెచ్‌ శ్రీవాణి, కరుణలత, సుభాషిని, జె.శ్వేత, సింగారపు రమ, పద్మ పుష్ప ,రూప, శారద పాల్గొన్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ, భువనగిరిలో ఆశా వర్కర్లు వటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. తిప్పర్తి మండలంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. పెన్‌పహాడ్‌లో భిక్షాటన చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కీసర తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు వంటా వార్పు చేసి నిరసన తెలిపారు.
ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : పాలడుగు భాస్కర్‌
ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి, రూ.18వేలు ఫిక్స్‌డ్‌ వేతనాన్ని చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని నెహ్రూ సెంటర్‌లో జరుగుతున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. నిరంతరం ప్రతి ఇంటికి తిరిగి వెళ్ళి ప్రజల అరోగ్య సంరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న ఆశాలు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వెలిబుచ్చారు.
ఆశాల సమస్యల పరిష్కారానికి చేస్తున్న సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. సీఐటీయూ మండల కన్వీనర్‌ కందునూరి శ్రీనివాస్‌ సంఘీబావం తెలుపగా ఆశాల యూనియన్‌ నాయకులు పి రమాదేవి, ఉమాదేవి, పుష్ప, ఎం రమణ, నమ్మి, ఆశా కుమారి, విజయలక్ష్మి,సుజాత, కౌసల్య, శాంత, నాగమణి, భద్రమ్మ, జ్యోతి పాల్గొన్నారు.

Spread the love