రాజ్యాంగ మౌలిక లక్షణాలపై దాడి

Assault on the basic features of the Constitutionమనం కేవలం రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని నడపాలి. రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. కానీ మౌలిక లక్షణాలను సవరించడానికి వీలులేదు. కేశవానంద భారతి కేసులో 13 మంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుతో 50 ఏళ్లుగా ఈ రాజ్యాంగ బేసిక్‌ స్ట్రక్చర్‌ను (మౌలిక లక్షణాలు) కాపాడుకుంటూ వస్తున్నాము. బేసిక్‌ స్ట్రక్చర్‌ అంటే అపార్టు మెంట్‌లో కీలకమైన స్తంభాలు మార్చడానికి వీల్లేదు. అలా మార్చాల్సి వస్తే భవనం కూలి పోతుంది. అంటే స్తంభాన్ని మార్చకుండా తలుపులు, కిటికీలు, గోడలు మార్చుకోవడానికి వీలుంది. ఇదే బేసిక్‌ స్ట్రక్చర్‌! మాకు అధికారం ఉందని ప్రతీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చుకుందామనుకుంటే అది సరైన పరిపాలన కాదు. రాజ్యాంగం మౌలిక లక్షణాలను దెబ్బతీసేలా కొత్త చట్టాలను తీసుకు రావడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) గురించి ఆలోచించాలి. పౌరసత్వాన్ని సవరిస్తూ 2019లో పలు మార్పులు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఐదేళ్ల వరకు కూడా ఈ చట్టాన్ని అమలు చేయలేదు. చేయలేక పోయారు.ఈ సవరణ దేశానికి మంచిదని నమ్మడం లేదు. ఇన్నాళ్లు అంటే ఐదేళ్లుగా సిఎఎను అమలు చేయకుండా కేవలం ఎన్నికలకు ముందు ఈ రూల్స్‌ తెచ్చారు. అయితే చట్టం ఏం చెప్పినప్పటికీ ఆ నియమాల అమలు మాత్రం న్యాయంగా ఉంటుందా..?ఉండదా..? అనే అనుమానాలు పెరిగి పోయాయి. అందువల్లే నిరసనలు, విమర్శలు, పిల్స్‌ వేయడం, దిష్టిబొమ్మలు తగలబెట్టడం వంటి ఆందోళనలు! మాకు 400 ఎంపీల సీట్ల కన్నా ఎక్కువగా వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని భయపెడుతున్నారు.
అధికారాలను దెబ్బతీయలేరు..
50 ఏళ్ల నాటి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చేసిన ఆదేశం ఇప్పటికీ ప్రామాణికంగానే ఉంది. కనుక భవిష్యత్తులోనూ కులాలు, మతాలు ఆధారంగా పరిపాలన చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా పౌరసత్వ అర్హతలను మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదాన్ని తొలగించేస్తామని అంటున్నారు. పదం ఏ విధంగా ఉన్నా.. లేకపోయినా లౌకిక లక్షణాన్ని తీసివేసే అధికారం మాత్రం ఎవరికీ లేదు. కనుక సిఎఎ గురించి తీవ్ర సమస్యలు వస్తున్నాయి. సిఎఎ చట్టాన్ని మార్చి 11న అమలులోకి తీసుకొచ్చారు. వెంటనే ఎన్నో చోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. అనేక చోట్ల సాయుధ బలగాలను, ఢిల్లీలో పోలీసులతో ఫ్లాగ్‌ మార్చ్‌ కూడా చేయాల్సి వచ్చింది. ఎన్నికల ముందు ఇంత కీలకమైన మార్పు చేయడం న్యాయమా..?, అవసరమా..?. రాజకీయ ప్రయోజనాల కోసమేనా? 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పౌరసత్వ మౌలిక లక్షణాలను రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌లో పేర్కొ న్నారు. వీటి ఆధారంగా 1955లో చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి వీల్లేదు. మొట్ట మొదటి పౌరసత్వ చట్టం (1955) ప్రకారం.. భారతీయ పౌరసత్వాన్ని అక్రమంగా వచ్చిన వారికి ఇవ్వరు. ”ఒక వేళ పత్రాలు ఉంటే రావచ్చు. వీసా గడువు దాటిపోతే రావడానికి వీల్లేదు. అయితే వీసా గడువు ఉంటే ధృవీకరణాలు దొరికితే ముస్లీంయేతర శరణార్థులను దేశంలో నివసించడానికి అవకాశం ఇస్తూ మార్పులు చేశారు.
మత ఆధారం ధర్మమా..?
పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌లో హింసకు గురై భారత్‌కు శరణార్థులుగా వలస వచ్చిన ముస్లీ మేతరులకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఈ కొత్త సవరణ చట్టం ద్వారా అవకాశం లభిస్తుంది. అంటే ఈ మూడు దేశాల నుంచి భారత్‌కు వస్తే సరైన పత్రాలు లేకపోయినా.. పౌరసత్వం ఇవ్వవచ్చని సిఎఎ చట్టం చెబుతోంది. అంటే 2014 డిసెంబర్‌ 31కి ముందు భారత్‌కు వచ్చి ఉన్న వారికి పౌరసత్వాన్ని కోరుకునేందుకు అవకాశం ఉంది. వారు అర్హులు అవుతున్నారు. మరొక వివరణ ఇది.. సిఎఎ కింద హిందువులు, క్రిష్టియన్లు, బౌద్దులు, పార్శీలకు పౌరసత్వం లభిస్తుంది. అంటే ప్రత్యేకంగా ముస్లింలకు మాత్రమే అవకాశం లేదని స్పష్టం చేస్తోంది. 2014 తర్వాత ప్రవేశించడానికి వీల్లేదని మరింత స్పష్టం చేస్తోంది. ముస్లింలను మాత్రమే ఎందుకు పక్కన పెట్టారు..? కేవలం ముస్లిం మతం ఆధారంగా భారత్‌కు రాకూడదని చెప్పడం న్యాయమ..? ధర్మమా..? రాజ్యాంగ సమ్మతమా..?1950 నాటి రాజ్యాంగం, 1955 నాటి పౌరసత్వ చట్టం ఉన్న నియమాలకు వ్యతిరేకంగా 2019లో పౌరసత్వ చట్టాన్ని సవరించారు. ఈ సవరణ రాజ్యాంగ మౌలిక లక్షణానికి (బేసిక్‌ స్ట్రక్చర్‌), లౌకిక లక్షణాలకు, మతాతీతమైన లక్షణానికి వ్యతిరేకమని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్స్‌ అమలు చేసేటప్పుడు పూర్తి అధి కారాలు ప్రభుత్వ గుప్పిట్లోకి వెళ్తాయి. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలను నిర్ణయించే అధికారాన్ని పోస్టల్‌ అధికారులకు అప్పగించారు. వారికి సాయుధ బలగాలు అండగా ఉంటాయి.
అధికార దుర్వినియోగ భయాలు..
నిజానికి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుంది. అసోం, మేఘా లయా, త్రిపుర రాష్ట్రాల ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వలస వచ్చిన వారు తమ సంస్కృతిని, సంప్రదాయాన్ని కోల్పోతామని భయపడు తున్నారు. మనకు రాజ్యాంగంలో ఆరో షెడ్యూల్‌ అని ఒకటి ఉంది. భారత దేశం లో దాదాపు 40 శాతం గిరిజన ప్రాంతాలు ఆరో షెడ్యూల్‌లోకి వస్తాయి. కనుక కేంద్ర ప్రభుత్వం అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరం, మేఘాలయ లోని అన్ని ప్రాంతాలు, అసోం, త్రిపురలోని మరికొన్ని ప్రాంతాలను సిఎఎలో మినహాయిస్తారు. అది గొప్ప విషయం. కానీ.. దీన్ని ఏ విధంగా అమలుచేస్తారు..?. సిఎఎ అమలులో చేతికి వచ్చే అధికారం దుర్వినియోగం చేసే ప్రమాదం లేకపోలేదా..? ఇది ప్రజల భయం.
మీరు భారతీయులేనా…?
ఈ దేశంలో ఉండే వారు భారతీయ పౌరులా..? కాదా..? అనేది ఏ విధంగా నిర్ణయిస్తారు.?. మీరు, మీ తండ్రులు, తాతలు మీరు భారత పౌరులని ఏ విధంగా రుజువు చేయాలి.” అనే ప్రశ్నలకు రూల్స్‌లో సరైన జవా బులు దొరక డం లేదు. ఇది ప్రధాన సమస్య. దీని వల్ల ఈ దేశంలో ఉన్న వారికి, వేరే దేశం నుంచి వచ్చిన వారికి భారత్‌లో పౌరసత్వం పొందాలంటే కావాల్సిన అర్హతలు, ధృవీకరణలు ఎక్కడ దొరుకుతాయి? ఉన్నట్టుండి మా తాతా భారత పౌరసత్వం కలిగిన వాడు అని రుజువు చేసుకోవడానికి అర్హతలు ఎక్కడ దొరుకుతాయి? ధ్రువీకరణాలు ఎక్కడ లభిస్తాయి? ఒకవేళ దొరకకపోతే ఇక్కడ పుట్టిన వాడు, తరతరాలుగా ఉన్నవాడు, ఓటింగ్‌ ఉన్న వాళ్లు కూడా, ఆధార్‌ ఉన్నా.. పౌరుడు కాదనే సమస్య, అనుమానం వస్తే ఏం చేయాలి..?.
నిరాకరిస్తే ఎలా?
ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఏ పౌరుడికి అయినా పౌరసత్వాన్ని నిరాకరిస్తే.. ఇవ్వబోమని నిర్ణయిస్తే.. ఈ ప్రజలు ఎక్కడికి వెళ్లాలి. ఏ దేశానికి వెళ్లాలి..?. ఒకవేళ వీడు విదేశీయుడు అని నిర్ణయిస్తే.. ఆ మాజీ పౌరులు ఎక్కడికి పోవాలి..?. అరెస్ట్‌ చేస్తారు. జైల్లో పెడతారు.. వారు జైల్లో ఎన్నాళ్లు ఉంటారు..? ఎవరికైనా పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం నిరాకరిస్తే.. భారత రాజ్యాంగంలో ఉన్న ఏ హక్కులు దక్కవు. అప్పుడు వాళ్ల గతి ఏమిటీ..?. అసోం తరహాలో లక్షల మంది జైలుపాలు కావాల్సిందేనా..? కనుక కొన్ని కొత్త జైల్లు నిర్మిస్తారు. ఇదా దేశ అభివృద్ధి కార్యక్రమం..?
మాడభూషి శ్రీధర్‌

Spread the love