కలెక్టర్‌పై దాడి హేయమైన చర్య

– నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి :తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వికారాబాద్‌జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, కడా ప్రత్యేక అధికారి, తహశీల్దార్‌, ఇతర అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వి.లచ్చిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో ఆయన మాట్లాడుతూ అధికారులపై దాడికి పాల్పడిన వారితో పాటు ఉసిగొల్పిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా ప్రజాభిప్రాయానికి ఉద్యోగులు తమ విధి నిర్వహణలో బాగంగా వెళ్లారే తప్ప అక్కడి రైతులతో తమకెలాంటి పేచి లేదని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హింసకు పాల్పడితే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయన్నుట్టు తెలిపారు.

Spread the love