Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాలికపై అమానుషం

బాలికపై అమానుషం

- Advertisement -

లారీ డ్రైవర్ లైంగిక దాడి, హత్యాయత్నం
మూడంతస్తుల భవనం పైనుంచి కిందకు తోసివేత
ప్రాణాపాయ స్థితిలో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స
నిందితునిపై ఫోక్సో కేసు..కఠినంగా శిక్షించాలని డిమాండ్
బాధితురాలికి మంత్రి పొంగులేటి భరోసా

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఖమ్మం నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పన్నెండేండ్ల వయస్సు ఉన్న ఓ బాలికపై లారీ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను మూడంతస్తుల భవనంపై నుంచి కిందకి తోసేశాడు. ఈనెల 6వ తేదీన జరిగిన ఘటనపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఉదంతం వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరానికి చెందిన బాలికపై ఆమె నివసించే ప్రాంతానికే చెందిన లారీ డ్రైవర్‌‌గా పనిచేసే గౌస్ (49) అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను మూడంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. అఘాయిత్యం ఫలితంగా బాలిక వెన్నుపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగినట్టు సమాచారం. బాధిత బాలికను తొలుత ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నగరంలోని మరో ప్రయివేట్ హాస్పిటల్‌‌లో చేర్పించారు.

ఫోక్సో కేసు నమోదు
ఈ ఘటనపై ఖమ్మం టూటౌన్ పోలీసులు నిందితుడు గౌస్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పలువురు స్పందించారు. బాధిత బాలికకు న్యాయం చేయాలని, నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

​దురాగతం బయట పడుతుందనే…
బాలికపై లైంగిక దాడికి దిగి, తన చర్య బహిర్గతమవుతుందనే కారణంతో నిందితుడు ఆమెను భవనంపై నుంచి కిందకు తోసినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. అపార్ట్‌‌మెంట్ దిగువన ఓ ప్రాంతంలో పెద్ద పెద్ద బండలు ఉన్నాయని, చుట్టూ ప్రహరీగోడ ఉందని, ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడ పడినా బాలిక ప్రాణాలు దక్కేవి కాదంటున్నారు. కింద పడటంతో బాలిక వెన్నుముక విరిగిందని, చేతులు, తలకు బలమైన గాయాలు అయినట్టు వైద్యులు చెప్తున్నారు. ప్రాణాపాయ స్థితి నుంచి బాలిక బయటపడ్డాక.. గాయాలు, నొప్పుల నుంచి కాస్త ఉపశమనం లభించాక గౌస్ దురాగతాన్ని వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మద్యం మత్తు వదిలాక విషయం తెలిసుకుని బాలిక ప్రాణాలతో ఉంటే తన విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఎలాగైనా ఆ బాలికను అంతమొందించి సాక్ష్యాలు లేకుండా చేయాలనే భవనం పైనుంచి తోసేసి.. ప్రమాదవశాత్తు పడిపోయిందని నమ్మించవచ్చని పథకం పన్నాడు. ఇదిలావుంటే రాపర్తినగర్ ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్లు ఈ ఘటనపై వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ముందు పాపను కాపాడుకుందాం : మంత్రి పొంగులేటి ఆవేదన
ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘాతకం తనను తీవ్రంగా కలచివేసిందని, నిందితుడిపై తక్షణమే కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి పొంగులేటి బాధిత బాలిక తండ్రితో, స్థానిక సర్పంచ్‌తో ఫోన్‌‌లో మాట్లాడి పరామర్శించారు. “ముందు మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా” అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. పాప వైద్యం ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు.

​బాధిత కుటుంబానికి అండగా నిలవాలి : నున్నా
బాలికపై అమానుషానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్ష‍ించాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ ‌చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

​నిందితున్ని కఠినంగా శిక్షించాలి: మాజీ మంత్రి అజయ్
నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -