Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌‌వాడీలకు జీతాలు చెల్లించండి

అంగన్‌‌వాడీలకు జీతాలు చెల్లించండి

- Advertisement -

మహిళల‌ను కోటీశ్వరులను చేస్తామని మభ్యపెడుతున్న 
సీఎం రేవంత్‌‌రెడ్డి : మాజీమంత్రి హరీశ్‌‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మభ్యపెడుతున్నారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు విమర్శించారు. ముందు అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు హరీశ్‌‌రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు నెలలుగా జీతాలు అందక 62 వేల మంది అంగన్‌‌వాడీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు చెల్లించకుండా అంగన్‌వాడీలను వే‌ధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుందని తెలిపారు. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 2014 నాటికి అంగన్‌వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగ‌న్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650కు, మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800కు, హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించా‌మని వివరించారు.

అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.18 వేలకు పెంచుతామనీ, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రకటిం‌చిందని తెలిపారు. మాయ మాటలు చెప్పి, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్ధాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి అని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రెటేరియట్ కు పిలుపునిచ్చిన అంగన్‌వాడీల పట్ల పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరవాలనీ, ప్రజాపాలనను అన్ని వర్గాల ప్రజలూ ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. రెండు నెలలుగా పెండింగ్‌‌లో ఉన్న అంగన్‌వాడీల వేతనాలను ‌వెంటనే చెల్లించాలనీ, అప్ గ్రేడ్ చేసిన మినీ అంగన్ వాడీలకు ఏడాదిగా పెండింగ్‌‌లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -