అధికారం కారాదు ఏకపక్షం!

అధికారం కారాదు ఏకపక్షం!మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన స్థాయిలో అభివృద్ధి సాధించబడాలి, అలా కాకపోతే అది ప్రజాస్వామ్యం అనబడదు. ప్రజా సంక్షేమమే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మని భావిస్తారు. పాలకుల పాలనా విధానాలు, ప్రణాళికలు క్షేత్రస్థాయిలో వాటి అమలుపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే అభివృద్ధి, స్వేచ్ఛ, సమానతలు కాపాడబడతాయి. రాజకీయ నాయకు (పార్టీ)ల తప్పుడు విధానాల ఫలితంగా అన్నెం,పున్నెం ఎరగని లక్షల, కోట్ల మంది ఆ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. మొన్నటి ఎన్నికల ఫలితాల్లో అవి స్పష్టంగా కనిపించాయి. ఈ ఫలితాల నుంచి పాఠాలు, గుణ పాఠాలు పాలక, ప్రతిపక్షాలకు నేర్చుకోవాల్సిందే. అభివృద్ధి అంటే? ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం కాదు. పాలన అంటే అప్పులు చేసి ప్రజలకు అంటగట్టడం, పంచిపెట్టడం పేరుతో పాలకులు వెనకేసుకోవడం అంతకన్నా కాదు!?. పవర్‌ అంటే అహంకారం కానే కాదు, బాధ్యతతో కూడిన సేవ అనేది విస్మరించరాదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిపూజ, నిరంకుశత్వ అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాలకు కాలం చెల్లిందనే రీతిలో జనం ఓటు కర్రుతో కాల్చివాత పెట్టారు! ప్రజల ముందు ఈ విద్వేష రాజకీయ వేషాలు నడవవన్న సంగతి తెలుసుకోవాలి. అనుకున్న మెజార్టీ రాకపోవడానికి కారణాలు విశ్లేషించుకోవాలి. అలాగే అధికారపక్షాన్ని ఇకనుంచి సరైన దారిలో నడిపించడం ప్రతిపక్షాల బాధ్యతేనని గుర్తుంచుకోవాలి.
నూతన పార్లమెంట్‌లో కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అభివృద్ధి ఎజెండాకు ప్రాధాన్యమిస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. భారత ప్రజాస్వామ్యం ఇంకెంత మాత్రం ఏకపక్షం కాకూడదని బలంగా కోరుకున్న ఓటర్ల విజ్ఞతకు తాజా ఫలితాలు అద్దం పడుతున్నాయి. నేడు ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. ప్రజల ఆకాంక్షలకి పట్టం కడుతూ, నెరవేర్చే దిశగా ముందుకు సాగాలి. అంతేకాదు సమాఖ్య స్ఫూర్తికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాలను కలుపు కొని వెళ్తేనే మనుగడ సాగిస్తామనేది కాదనలేని వాస్తవం. సంకీర్ణ రాజనీతి ప్రదర్శిస్తేనే దేశానికి క్షేమదాయకం అవుతుంది. మన భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఉందంటున్నారు మన ప్రధాని. అభివీద్ధి రేటు ఏడు శాతం అని చెబుతున్నారు. వృద్ధి అంత వేగంగా ఉంటే నిరుద్యోగం ఎందుకు ఉందన్నది ఓ చిక్కుముడి. ఇప్పటికైనా దానిపై ప్రభుత్వాలు నేడు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా నిలదొక్కుకోవడానికో, భవిష్యత్తులో మళ్లీ అధికారం చేపట్టడానికో ఓటు బ్యాంకు రాజకీయాలకో నగదు బదిలీ పథకాలు అమలు చేస్తున్నారు. దీని మూలంగా అతి ప్రధానమైన ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం మీద పెట్టాల్సినంత శ్రద్ధ, తగినన్ని నిధులు ఖర్చు చేయడం లేదు. పేదరికంలో ఉన్నవారికి ఈ పథకాలు ఉపశమనం మాత్రమే. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరలన్నా, అభివృద్ధి కావాలన్నా వారి కొనుగోలు శక్తి పెంచడం ద్వారానే సాధ్యమవుతుంది. ఉపాధి కల్పించడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. ఇప్పటి వరకు ఆ దృష్టి మన పాలకుల్లో లేకపోవడం పెరుగుతున్న పేదరికానికి సంకేతం. ప్రజల అవసరాలు, వారి అభివృద్ధిని వృష్టిలో పెట్టుకొని స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలతో ప్రాధాన్యాన్ని గుర్తించి వ్యవహరించాల్సి ఉంది. కానీ ఈరోజు గడిచిపోతే చాలు అనుకునే విధంగా వ్యవహరిస్తే? మరి విద్య, వైద్యం, ఆరోగ్యం ఎప్పటికీ సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగలనుంది.
75 ఏండ్ల స్వాతంత్య్ర ‘అమృతోత్సవాలు’ జరుపుకున్నాం. సాంకేతిక వినియోగం కూడా బాగా పెరిగింది. కానీ దేశ సంపద మాత్రం కొద్ది మంది వద్ద కేంద్రీకృతం అవ్వడంతో అభివృద్ధిలో అసమానతలు, నిరుద్యోగం, పేదరికం మాత్రం ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి. దీనికి తోడు రాజకీయ పార్టీ(నాయకు)ల్లో, అధికారుల్లో అంకితభావం, నిజాయితీ తగ్గి స్వార్థం పెరిగిపోయి ప్రజా ప్రయోజనాలు విస్మరిస్తున్నారు. ప్రపంచంలోనే యువ జనాభా ఎక్కువ గల మనదేశంలో ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే అభివృద్ధే మనకు అవసరం. దానిపై దృష్టి పెడితేనే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడున్న అసమానతలను తగ్గించాలి, అప్పుడే సహకార ధోరణి పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఆదాయ వనరులు ఎలా పెంచాలి? లబ్ధిదారులకు ఎలా అందించాలనేది నేటి పాలకులు గమనించి పాటించాల్సి ఉంది. ఈ సమస్య మూలాలు గుర్తించి పరిష్కరించాలి. అమెరికా ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశమని చెప్పుకునే ముందు ఆ పాలకుల, సమాజం వినూత్న విధానాలను, ఫలితాలను అధ్యయనం చేయాలి. ఆ తర్వాత మన విద్య ,వైద్యంలో పరిశోధనలు, ఉన్నత చదువులపై ప్రత్యేక దృష్టితో ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలి.
మన దేశ రాజ్యాంగంలో పొందుపరచుకున్న విధంగా మనది రాష్ట్రాల సమాహారం. ఆ సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలి. మనదేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు ద్వంద్వ విధానాలు కనిపిస్తున్నాయి. పన్నుల వాటా-బదిలీ అయినా, పెట్టుబడులైనా నిష్పాక్షికంగా వ్యవహరిస్తే దేశానికి మంచిది.రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడితే దేశానికి కూడా మంచిదే కదా!.కేంద్రం గుత్తాధిపత్యం, ఏక చత్రాధిపత్యంతో వ్యవహరించరాదు. ఇప్పటివరకు మందబలంతో చేసిన చట్టాలు ప్రజలకు మేలుకంటే నష్టాన్నే ఎక్కువ చేశాయి. సభలో చర్చించకుండా ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోకుండా చేసిన నిర్ణయాల పట్ల ప్రజలు ఒకింత అసహనంతోనే ఉన్నారన్న విషయం పాలకులు గమనంలో పెట్టుకోవాలి. అలాగే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందనే అభిప్రాయం కూడా ప్రజల్లో బలంగా వచ్చింది. ఎందుకంటే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరే దానికి నిదర్శనం. అధికారంలోకి రావడానికి మత,విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారి పట్ల ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోలేదు. ఎందుకు రాజకీయ నాయకులకు లోబబడిందనే విమర్శలు వచ్చాయి? ఇది పాలకపక్షం పట్ల సహజంగానే వ్యతిరేకతను పెంచింది. అందుకే ఎన్నికల్లో చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు జనం. అధికార యంత్రాంగాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోకూడదు. వారిని స్వేచ్ఛగా పనిచేయించాలి.
కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో రాష్ట్రానికో తీరు, ప్రాంతానికో తీరు తమ డబులింజన్‌ సర్కార్లు ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తున్నది. పెట్టుబడులు, మౌలిక వసతులు అక్కడికే వెళుతున్నాయి. ప్రయివేటు పెట్టబడులు కూడా అక్కడే పెట్టించి కార్పొరేట్‌ శక్తులకు లాభం చేకూరుస్తున్నది. ఇది మారాల్సిన అవసరం ఉన్నది. అన్ని రాష్ట్రాలను సమాన అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగాలి. సంకీర్ణ ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకోవాలి. ఎన్డీయేపై ఒత్తిడిని పెంచి ఇప్పటివరకు అందని రాష్ట్రాలకు నిధులు వచ్చేలా చూడాలి. రాజకీయ పార్టీలైనా అధికార, ప్రతిపక్షాలైనా అంతిమ లక్ష్యం ప్రజా ప్రయోజనాలే అనే అంశాన్ని విస్మరించకూడదు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగాల పరిపుష్టికి ప్రాధాన్యతనిస్తూ పాలన చేయాలి. విద్వేషం, కుల, మత, ప్రాంత, లింగ వివక్ష, విభేదాలు లేని విధంగా సమ్మిళిత అభివృద్ధికి పాటుపడుతూ పౌర స్వేచ్ఛను పరిరక్షించాలి. ఈ తీర్పు నుండి ”పాలక, ప్రతిపక్షాలను అధికారానికి బెత్తెడు దూరంలో ఉంచిన ప్రజల చైతన్యం ఓ గుణపాఠం” నేర్పుతుంది. పాలకులంటే ప్రభువులు కాదనే ఆలోచనతో ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగించాలి.లేదంటే అధికారానికే కాదు, ప్రజలకే దూరమవుతారు.
మేకిరి దామోదర్‌
9573666650

Spread the love