– మీ సమస్య మా దృష్టికి తీసుకరండి…పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆటో డ్రైవర్లు ఆందోళన చెందొద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. వారు సమస్యలను తమ దృష్టికి తీసుకరావాలనీ, వెంటనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయాలనే లక్ష్యంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రకటించలేదని స్పష్టం చేశారు. ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభించినప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. వాటిని పరిష్కరించుకుందామని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేతలు బలరాం నాయక్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో సీఎం కేసీఆర్ నీటిపారుదల ప్రాజెక్టులపై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారని గుర్తు చేశారు.ఆ సందర్భంగా సీఎల్పీ తరుపున కూడా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామంటే అనుమతి ఇచ్చారా? అని బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో బుధవారం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వం మారిందనీ, అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. మీరు బంగారు తెలంగాణ అయితే ప్రజావాణిలో వేల దరఖాస్తులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు.
నాలుగు పాదాలపై నియంతృత్వం…పార్లమెంట్‌లో బీజేపీ తీరు సరిగాదు
పార్లమెంటు భద్రతపై ప్రశ్నించినందుకు 77 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో మొన్న ఆగంతకులు దూకి సభ్యులపై టియర్ గ్యాస్ విసరడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ పార్లమెంటరి వ్యవస్థకే మాయని మచ్చ అన్నారు. దేశ వ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం రావాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పార్లమెంటుపై దాడికి పాల్పడిన బీజేపీ కార్యకర్తలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పార్లమెంటుపై దాడి జరిగితే రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.