సైబర్ నేరాలపై అవగాహన అవసరం: ఎస్సై

– గుత్తి కోయలకు అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ – తాడ్వాయి
సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగ అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గుత్తి కోయిల కు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, ఓ ఎల్ ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్ ల కు స్పందించకూడదన్నారు. సైబర్ నేరాల గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేయాలన్నారు. సైబర్ క్రైమ్ గురైన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారన్నారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని, తెలియని మెసేజ్లు పై క్లిక్ చేయరాదని తెలిపారు. సైబర్ నేరగాళ్లు మాయ మాటలు చెబుతూ బహుమతులు వచ్చాయని లాటరీ తగిలిందని, లోన్లు ఇస్తామని, ఇతరత్రా ఆశ చూపి ఆన్లైన్ ద్వారా డబ్బులు ఎరవేస్తారని అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్లకు స్పందించరాదని తెలిపారు. అంతేకాకుండా గుత్తి కోయలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా సహకరించాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే ఆశ్రమం కలిగించవద్దని, వారెవరైనా ఆశ్రయిస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో తాడ్వాయి పోలీసులు ఆర్మీ రమేష్, పూజారి రమేష్, జాజ సాంబయ్య, తాడ్వాయి పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love