మణిపూర్ ఘర్షణలపై అమెరికా నివేదికకు విలువలేదు:భారత్

నవతెలంగాణ – హైదరాబాద్: గతేడాది వేసవిలో మణిపూర్ లోని మెయిటీ ప్రజలకు, కొండజాతి కుకీ-జో తెగ ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 220 మందికి పైగా మరణించారు.  అయితే, ఈ జాతుల మధ్య ఘర్షణల అనంతరం తీవ్ర స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని అగ్రరాజ్యం అమెరికా తన నివేదికలో పేర్కొంది. ఆ ఘటనలు సిగ్గుచేటు అని భారత్ ప్రధాని మోదీ పేర్కొన్నారని, చర్యలు తీసుకోవాలని ఆదేశించారని కూడా అమెరికా తన నివేదికలో వివరించింది.  అంతేకాదు, బీబీసీ వార్తాసంస్థపై ఐటీ దాడులు, సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడం వంటి అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. ఈ నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ విడుదల చేశారు.  ఈ నివేదికపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా నివేదికకు ఎలాంటి విలువ లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.ఈ నివేదిక పూర్తిగా పక్షపాత ధోరణితో రూపొదించారని ఆరోపించారు. భారత్ ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో దీన్నిబట్టి అర్థమవుతోందని అన్నారు.

Spread the love