
మండలంలోని దుర్గనగర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో దాస్ నగర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ శీతాకాల శిబిరంలో భాగంగా ఐదవ రోజు గ్రామంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మైక్రో బయాలజీ లెక్చరర్ టీ వాసవిలత ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ అనే అంశంపై ప్రజలకు శనివారం వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవజాతి మనగడకు ముప్పువాటిల్లుతుందని, భూమిపైన, నీటిలో ఉండే జీవరాసులు ఆ ప్లాస్టిక్ ని తినడం వల్ల మానవులపై కలిగే దుష్ప్రభావాలను గ్రామస్తులకు తెలియజేశారు. మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవులకు క్యాన్సర్ మొదలైన రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని గుడి, వాటర్ ట్యాంక్ పరిసరాలను పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం సరిత, డి. సుమలత, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.