
వరి ధాన్యం నిల్వ, అవగాహనపై రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ, ఏరువాక కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు జాగ్రత్తలు డబ్ల్యూ డి ఆర్ ఏ పై అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గురువారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెం రైతు వేదిక లో ” వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయు గిడ్డంగులు, నిల్వ దాన్యంపై రుణాలు” అనే అంశం పై రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐపిహెచ్ఎం సహాయ సంచాలకులు డా.పి జ్యోతి మాట్లాడుతూ ధాన్యం నిల్వ సమయంలో ఆశించే చీడ పీడలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. డబ్ల్యూ ఆర్ డి ఏ, వ్యవసాయ ఋణాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఏరువాక ప్రధాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ మాట్లాడుతూ వరి , ప్రత్తి పంటలలో చీడపీడల గురించి వివరించారు. వరి నాటిన 15 రోజులకు, 1 ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలను కానీ, 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కానీ, 4 కిలోల క్లోరాన్ట్రనిలీప్రోల్ గుళికలను ఇసుకలో కలిపి వెదజల్లి కాండం తొలిచే పురుగును నివారించాలన్నారు. దోమ పోటు నివారణకు నాటేటప్పుడు ప్రతీ 2 మీటర్లకు తూర్పు పడమర దిశలో కాలిబాటలు వదలాలన్నారు. ప్రస్తుత పంటలలో చీడ, పీడల నివారణ గూర్చి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతులు వారి సమస్యలను వివరించగా, పరిష్కార మార్గాలను తెలియజేశారు. శిక్షణా కార్యక్రమం అనంతరం భువనగిరిలోని గిడ్డంగులను సందర్శించి, రైతుల సందేహాలకు సమాధానాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, కె మమత, ఎన్.ఐ.పి హెచ్ఎం పి జ్యోతి, మండల వ్యవసాయాధికారి ఎస్ పావని, వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్, ఎం వేణు, యంగ్ ప్రొఫెషనల్ గ్రామ అభ్యుదయ రైతులు రాంపల్లి కృష్ణ, కంచి మల్లయ్య, మందాడి సిద్ధారెడ్డి, జనార్ధన్, పురుషోత్తం రెడ్డి, దుర్గపతి చంద్రమ్మ లు పాల్గొన్నారు.