క్రికెట్ యాప్ లతో జనాలకు ఎర

నవతెలంగాణ – హైదరాబాద్: క్రికెట్ మ్యాచ్ ల వినోదం ఓవైపు కొనసాగుతుంటే, దాని వెనుక కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతుంటుంది. చిన్నా చితకా బెట్టింగ్ నిర్వాహకులు, బెట్టింగ్ లకు పాల్పడేవాళ్లు అక్కడక్కడా పోలీసులకు పట్టుబడిన ఘటనలు తెలిసిందే. కానీ, బెట్టింగ్ లో పెద్ద తలకాయలు, బెట్టింగ్ లకు గుండెకాయ వంటి బుకీలు పోలీసులకు పట్టుబడిన ఘటనలు చాలా తక్కువ. అయితే బెట్టింగ్ కు సంబంధించి ఓ దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. బెట్టింగ్ లకు పాల్పడే వాళ్లను ఊరించి, బోల్తా కొట్టించేందుకు బుకీలు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారట. అందుకోసం ప్రత్యేకంగా టెక్కీలను నియమించుకుంటున్నారట. అసలేం జరుగుతోందంటే… బుకీలు కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల సాయంతో మాయదారి యాప్ లను తయారు చేయించుకుంటున్నాయి. ఈ యాప్ లు ఎలాంటివంటే… జనాలకు గాలం వేసేందుకు అద్భుతమైన ఎత్తుగడ వేస్తాయి. బెట్టింగ్ కు పాల్పడేవాళ్లకు సదరు యాప్ లు మొదట్లో ఓ మోస్తరు విజయాలు అందిస్తాయి. కొద్ది మొత్తమే అయినప్పటికీ, పలుమార్లు డబ్బు గెలుచుకోవడంతో బెట్టింగ్ రాయుళ్లలో ఆశ పెరుగుతుంది. దాంతో వారు ఎక్కువ మొత్తంలో డబ్బుతో బెట్టింగ్ కు పాల్పడతారు. ఇలాంటి బెట్టింగ్ ల ద్వారా సదరు బుకీలు గణనీయమైన స్థాయిలో లాభాలు పొందుతారు. ఎక్కువ మొత్తంలో డబ్బుతో పందెం వేస్తారు కాబట్టి, బుకీల పర్సంటేజీ కూడా పెరుగుతుంది. ఇలా బెట్టింగ్ రాయుళ్ల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు బుకీలు ప్రత్యేకంగా టెక్ కంపెనీల సాయం తీసుకోవడమే కాకుండా, సాఫ్ట్ వేర్ నిపుణులను కూడా నియమించుకుంటున్నారట. ఈ నిపుణుల పని… ఎప్పటికప్పుడు బెట్టింగ్ రాయుళ్లకు కొద్దిపాటి విజయాలతో ఎర వేస్తూ, వారు తమ గుప్పిట చేజారకుండా చూసుకోవడమే. మరో విషయం ఏంటంటే… కొన్ని టెక్ కంపెనీలతో బుకీలు ఆదాయాన్ని వాటాల రూపంలో పంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అనైతిక ధోరణులతో నికార్సయిన బెట్టింగ్ కు విఘాతం ఏర్పడుతుందని, వీటిపై నియంత్రణ ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Spread the love