నిర్మాణాన్ని ఆపాలంటూ అప్పీల్స్ కోర్టు ఆదేశం
అధ్యక్షుడు యజమాని కాదు..
టెనెంట్ మాత్రమేనంటూ ఘాటు వ్యాఖ్య
వాషింగ్టన్ : అధ్యక్షభవనంలో కూల్చివేసిన తూర్పు వింగ్ ప్రాంతంలో 400 మిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టిన బాల్‌రూమ్ నిర్మాణ పనులను నిలిపివేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభు త్వాన్ని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఆదేశించింది. దీంతో అధ్యక్ష అధికారా లకు పరీక్షగా నిలిచిన ఈ కేసులో ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ‘ప్రతి అధ్యక్షుడు ఓ తాత్కాలిక టెనెంటే. ఆయన అధ్యక్ష భవనానికి యజమాని కాదు. కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా దానికి ఆయన కొత్త రూపు ఇవ్వలేరు’ అని వాషింగ్టన్‌లో కొలంబియా సర్క్యూట్ జిల్లాకు చెందిన అప్పీల్స్ కోర్టు 2-1 మెజారిటీతో తీర్పు చెప్పింది. కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్ ప్రభుత్వం ఈస్ట్ వింగ్‌ను కూల్చేసి 90 వేల చదరపు అడుగుల బాల్‌రూమ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. దీనిని వ్యతిరేకిస్తూ ‘నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్’ అనే సంస్థ గత సంవత్సరం కోర్టును ఆశ్రయించగా ప్రిలిమినరీ ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది.
అప్పీల్స్ కోర్టు తన తాజా తీర్పులో దానిని సమర్ధించింది. ‘భారీ బాల్‌రూమ్‌ను నిర్మించాలా వద్దా అనేది కాంగ్రెస్ నిర్ణయించాల్సిన విషయం. అంతేకానీ అది కార్యనిర్వాహకవర్గం యొక్క సొంత నిర్ణయానికి సంబంధించింది కాదు’ అని అప్పీల్స్ కోర్టు ప్యానల్‌లోని మెజారిటీ సభ్యులు తమ తీర్పులో రాశారు. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును 14 రోజుల పాటు నిలిపివేశారు. అప్పీల్స్ కోర్టు తీర్పును దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. ఆ నిర్ణయం భయంకరమైనదని, రాజకీయ ప్రేరేపితమైనదని విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బాల్‌రూమ్ అనేది సైనిక కేంద్రమని చెప్పుకొచ్చారు. ఈ అన్యాయమైన తీర్పును రద్దు చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. కాగా అమెరికా ప్రజలకు ఇది ఓ గొప్ప రోజు అని నేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు బ్రెంట్ లెగ్స్ అన్నారు.
బాల్‌రూమ్ ప్రాజెక్టుకు బ్రేక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



