– సవాల్ చేసిన ఇజ్రాయిల్ కమ్యూనిస్టులు, ప్రజాతంత్ర శక్తులు
– పోలీసులకే వత్తాసు పలికిన న్యాయస్థానం
జెరూసలెం: గత నెలలో పాలస్తీనియన్లపై ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించిన యుద్ధాన్ని నిరసిస్తూ అనేక మంది ఇజ్రాయిలీయులు, యూదులు, అరబ్బులు వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ లెక్కచేయకుండా వారు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. విచిత్రంగా ఈ ప్రదర్శనలపై ఇజ్రాయిల్ పోలీస్ కమిషనర్ యకోవ్ షబ్తారు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధానికి ఆయన చూపిన కారణం ప్రదర్శనలను నియంత్రించేందుకు తగినంత మంది పోలీసు అధికారులు లేరని. ప్రదర్శనలపై నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. షబ్తారు ఆదేశాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని, కాబట్టి వాటిని రద్దు చేయాలని ఇజ్రాయిల్ కమ్యూనిస్టు పార్టీ , హదాష్ (డెమొక్రటిక్ ఫ్రంట్ ఫర్ పీస్ అండ్ ఈక్వాలిటీ) సంకీర్ణం, అదాలా (ఇజ్రాయిల్ అరబ్ మైనార్టీల హక్కుల కోసం పోరాడే లీగల్ సెంటర్) సంయుక్తంగా ఈ పిటిషన్ వేశాయి. పోలీసుల ఆదేశం వెనక ఉన్న సైద్ధాంతిక ప్రేరణలను ఇది ఎత్తి చూపింది. కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చే ఇజ్రాయిలీ నిరసనకారులను బస్సులోకి ఎక్కించి మిలిటరీ బాంబులు వేస్తున్న గాజా ప్రాంతానికి పంపుతామని నెతన్యాహు ప్రభుత్వం బెదిరించింది. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ కోర్టులు ఎమర్జెన్సీ ఫార్మేట్‌లో పనిచేస్తాయి. వారు అత్యవసరంగా భావించిన కేసులను మాత్రమే విచారిస్తారు. కాబట్టి ఈకేసును విచారణకు చేపట్టడం అసాధారణమైన విషయం. ఈ విచారణలో పోలీసుల తరపు న్యాయవాది చేసిన వాదనలు వింటే గాజాకు వ్యతిరేకంగా సైన్యం చేస్తున్న యుద్ధానికి మద్దతు తెలపని వారు ఎవరైనా హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్టే పరిగణిస్తామని నెతన్యాహు తీసుకున్న వైఖరిని బలపరిచేవిగా ఉన్నాయి. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కు అంటూనే, ఇజ్రాయిల్‌లో ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల్లో అటువంటి స్వేచ్ఛ గురించి ఆదేశించలేమని కోర్టు పేర్కొంది.